అమరావతి స్టాండ్‌ చంద్రబాబుకు ఇమేజా ! డ్యామేజా !

by  |
అమరావతి స్టాండ్‌ చంద్రబాబుకు ఇమేజా ! డ్యామేజా !
X

దిశ, వెబ్‌డెస్క్: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కేపిటల్ సిటీగా ఉండాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిపై సొంత పార్టీలోనే డిఫరెంట్ కామెంట్లు వినపడుతున్నాయి. హైదరాబాద్‌లో ఉంటూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తమ అధినేత చేస్తున్న వ్యాఖ్యలు నేతల మధ్య చిచ్చు పెట్టడమే గాక పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చే విధంగా ఉన్నాయని లోలోపల రగిలిపోతున్నారు. ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తప్ప టీడీపీలోనే ఎవరూ మూడు రాజధానులను వ్యతిరేకించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మంకు పట్టుతో ప్రజల్లో నెగిటివ్‌ ఫీలింగ్ తెచ్చుకోవడం ఎందుకని పలువురు ఎమ్మెల్యేలు అనుచరులు, కార్యకర్తలతో చర్చించినట్లు సమాచారం. సీఎం జగన్ మూడు రాజధానులపై దూసుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు ఎలా ఆపగలుతామని, సైలెంట్‌గా ప్రజల్లో ఉంటేనే బెటరనే అభిప్రాయానికి మెజార్టీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో నాలుగేళ్లు సమయం ఉన్నా.. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరుగుతాయి. అలాంటప్పుడు ప్రజల వద్దకు వెళ్లి ఏవిధంగా సమాధానం చెప్పాలని అధినేతపై కొందరు లోలోపల గుస్సా అవుతున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖచ్చితంగా పార్టీ మనుగడ కష్టం అవుతుందని, ఇప్పటికే పార్టీ చాలా నష్టపోయిందని, సంయమనంతో ఉన్న ప్రజలను రాజధాని పేరిట రెచ్చగొట్టినట్లు అవుతుందని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు చర్చించికుంటున్నట్లు తెలుస్తోంది. అమరావతిని రాజధాని చేసినా 2019 ఎన్నికల్లో ఆ ప్రాంతంలో టీడీపీకి ఎక్కువ సీట్లు రాలేదని, ఇప్పుడు అమరావతి స్టాండ్ తీసుకుంటే ఫ్యూచర్‌లో పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని, ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి రావడమే గాక, కొన్నిచోట్ల కాలు సైతం పెట్టనీయరని నేతలు అభిప్రాయపడుతున్నారు.

అమరావతిలో రాజధాని అంటే కేవలం ఆ ప్రాంత ప్రజలు, భూములు ఇచ్చిన వారు మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఉంటారని, కానీ ఇప్పుడు తీసుకువచ్చిన మూడు రాజధానుల అంశం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని చెప్పుకుంటున్నారు. ఇన్నిరోజులు మూడు రాజధానులు అంటూ వైసీపీ నేతలు ప్రజల్లోకి గట్టిగ వాదనను తీసుకెళ్లారని కానీ ఇప్పుడు అమరావతిలోనే మొత్తం రాజధాని కొనసాగిస్తే అదంతా చంద్రబాబు వల్లే జరిగిందని, అతను కోర్టులకు వెళ్లడం వల్లే తమ ప్రాంతానికి రాజధాని రాకుండా పోయిందన్న అభిప్రాయంతో టీడీపీకి దూరం అవుతారని నేతలు ఫ్యూచర్‌ గురించి ఆలోచిస్తున్నారు. మూడు రాజధానుల అంశం చాలా సున్నితమైనందున కేవలం అమరావతి పాటే పాడుకుంటూ ఉంటే పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయని కార్యకర్తలు సైతం తమ లీడర్ల వద్ద బహిరంగంగానే ప్రశ్నలు సంధిస్తున్న సందర్భాలు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయి.

ఎవరైనా తమ ప్రాంతానికి రాజధాని వస్తుందంటే స్వాగతిస్తారని.. కానీ విశాఖకు ఎగ్జిక్యూటివ్, కర్నూలుకు జ్యూడీషియల్ కేపిటల్ వద్దంటే ఆ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయని.. రాజధాని వ్యతిరేకిస్తే పార్టీకి గడ్డు పరిస్థితులు రావడం ఖచ్చితమని భావించి నేతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వచ్చేరోజుల్లో ఎన్నికల కోసం ప్రజల వద్దకు వెళ్తే ఈ ప్రాంతానికి రాజధాని రాకుండా చేసిన మీకు ఎందుకు ఓట్లేయాలని నిలదీస్తారని, అప్పుడు మనం సమాధానం చెబుదామన్న ఎలాంటి ఛాన్స్‌ ఉండదని నేతలు తర్జన భర్జన పడుతున్నారు. తమ అధినేత చంద్రబాబు తీసుకున్న అమరావతి స్టాండ్‌ పార్టీకి ఇమేజ్‌ కంటే డ్యామేజే‌ ఎక్కువ తెస్తుందని, ఈ ఎఫెక్ట్ మూడు నాలుగు టర్మ్‌ల వరకు కొనసాగుతుందని ఒక్కో నేత ఇతర నేతలతో ఓపీనియన్‌ చెప్పుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే మూడు రాజధానుల గవర్నర్ గెజిట్ బిల్లుపై హైకోర్టు ఈనెల 14 వరకు ఆగాలని చెప్పడంతో తర్వాత వచ్చే పరిస్థితులను వైసీపీ, టీడీపీ ఏవిధంగా క్యాచ్‌ చేసుకొని ముందుకు వెళ్తాయనేది కీలకంగా మారింది. చంద్రబాబు తీసుకున్న అమరావతి స్టాండ్ తర్వాత పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఇమేజ్‌ను పెంచుతాయా, డ్యామ్‌జ్‌కు బాటలు వేస్తాయా అన్నది భవిష్యత్‌ నిర్ణయించనుంది.

Next Story

Most Viewed