కరోనా వార్డుల్లో స్మార్ట్ ఫోన్లు వాడుకోవచ్చు

by Shyam |
కరోనా వార్డుల్లో స్మార్ట్ ఫోన్లు వాడుకోవచ్చు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లకు మానసిక స్వాంతన అవసరమని, వారు స్మార్ట్ ఫోన్లు లేదా ట్యాబ్‌లు వాడుకోడానికి వెసులుబాటు ఇవ్వాలని కేంద్ర హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. కరోనా చికిత్స పొందుతున్న పేషెంట్లకు మందులతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అవసరమని, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నందున వారితో మాట్లాడడం ద్వారా, వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనడం ద్వారా ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు గత నెల 29న రాసిన లేఖలో డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ గార్గ్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఉపకరణాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడంపై తగిన సూచనలు చేసేలా వైద్య సిబ్బందికి అర్థం చేయించాలని సూచించారు.

ఒకవేళ స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా వైద్య సేవలకు అంతరాయం కలుగుతున్నట్లయితే నిర్దిష్టంగా ఫలానా టైమ్ అంటూ షెడ్యూలును ఆసుపత్రుల అధికారులు రూపొందించవచ్చునని పేర్కొన్నారు. చికిత్స పొందే క్రమంలో వారు సమాజం నుంచి ఒంటరి అయిపోయామనే భావన వారి మనసులో కలగరాదని, మానసికంగా భరోసా ఉండే వాతావరణం వార్డుల్లో ఉండాలని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో సామాజిక బంధం కూడా వారిని ఒంటరితనం నుంచి దూరం చేస్తుందని, మానసిక మద్దతు లభించడానికి స్మార్ట్ ఫోన్లు వీలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ఐసొలేషన్ వార్డులతో పాటు ఐసీయూ వార్డుల్లో సైతం పేషెంట్లకు స్మార్ట్ ఫోన్లను వాడుకోడానికి అనుమతి ఇవ్వాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed