- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
DHARANI: పట్టా భూముల్లో ధరణి చిచ్చు..
దిశ, తెలంగాణ బ్యూరో: అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ ఉదాసీనత, రైతు జీవితాలపై ఉక్కుపాదం మోపుతున్నది. సెక్షన్ 22 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం నిషేదించచబడిన భూ జాబితాలో పొరపాటున పట్టా భూములు కూడా చేర్చబడ్డాయి. ఈ విషయంపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ పట్టా భూములను నిషేధిత జాబితా నమోదు చేస్తే వెంటనే తొలగిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ హామీ నెరవేరలేదు. నిషేధిత భూముల జాబితాలోని పట్టాభూములను గుర్తించి న్యాయం చేయాల్సిన రెవెన్యూ ఉన్నతాధికారులెవరూ ఈ అంశంపై సమీక్షించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఈ క్రమంలో రైతుల ఆవేదన అరణ్యరోదనగా మారింది. సదరు భూములు అమ్మలేక, కొనలేక, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సీఎం కేసీఆర్‌కు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దన్న ఉద్దేశ్యం ఉన్నప్పటికీ ధరణి పోర్టల్‌లో సాంకేతిక లోపాలను సవరించకుండా జాప్యం చేస్తుండడం విమర్శల పాల్జేస్తోంది. ఒక్క సర్వే నంబరులోని పాక్షిక భూమిపై వివాదం ఉంటే మొత్తం విస్తీర్ణాన్ని నిషేధిత జాబితాలో నమోదు చేసే గ్రేట్సాఫ్ట్వేర్ వల్ల వేలాది మంది రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. పైగా పీఓబీలో నుంచి పట్టా భూములను తొలగించేందుకు పోర్టల్‌లో ఇచ్చిన ఆప్షన్ సక్రమంగా పని చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
అన్నింటికీ మించి మాడ్యూల్‌ను రూపొందించారు. కానీ దానికి సంబంధించిన మార్గదర్శకాలను కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు ఇవ్వలేదు. దాంతో పోర్టల్‌లో దరఖాస్తులు వచ్చినా ఏ రూల్స్ప్రకారం పరిష్కరించాలో జిల్లా స్థాయి అధికారులకు అర్ధం కావడం లేదు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కటి ఆప్షన్లు ఇస్తున్నారు. అన్ని సమస్యలకు ధరణి పోర్టల్‌లో మాడ్యూల్స్ ఇచ్చేశామని ప్రగతి భవన్‌లోని సీనియర్ఐఏఎస్అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ వాటికి రూల్స్‌రూపొందించడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
పోర్టల్ద్వారా వచ్చిన వేలాది దరఖాస్తుల పరిష్కారానికి కూడా నెలల సమయం పడుతోందని సమాచారం. పైగా రూల్స్‌లేకుండా దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా ఏవైనా పొరపాట్లు తలెత్తితే తామే బాధ్యులమవుతామన్న ఆందోళన కూడా అధికారుల్లో ఉంది. ఇకనైనా ధరణి పోర్టల్పర్యవేక్షించే ఉన్నతాధికార వర్గం ప్రతి మాడ్యూల్లో వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి రూల్స్ ఫ్రేం చేయాలని రెవెన్యూ అధికారులు కోరుతున్నారు.
పీఓబీలో సగం ఖాతాలు
రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలోని నగర శివారు మండలాల్లోని ఏ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించినా సగానికి పైగానే పీఓబీలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా వరకు ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అండ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏసీబీ, చిట్ ఫండ్స్ రెఫరెన్స్ లతోనే నిషేదిత జాబితాలో చేర్చినట్లుగా దర్శనమిస్తున్నాయి. ఒకటీ రెండు ప్రాపర్టీలుగా కాదు. ప్రతి రెవెన్యూ గ్రామంలోనూ వేలాది భూములు పీఓబీలోనే ఉన్నాయి. ప్రధానంగా ఆదాయపు పన్ను శాఖ రికవరీ, ఎటాచ్మెంట్ ఆర్డర్ వంటి పదాలతోనే కనిపిస్తున్నాయి. ఏ జిల్లాలో అధికారులు, ఉద్యోగులు ఏసీబీకి చిక్కినా వారి ఆస్తులు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. వారి ఆస్తుల లెక్కింపు ప్రక్రియలో గుర్తించిన ఆస్తులన్నీ పీఓబీలోకి చేర్చారు.
నిజానికి ఇలా పీఓబీలో రెవెన్యూ శాఖ అధికారులు పొందుపర్చలేదు. 2017 కంటే ముందు ఆయా శాఖలు స్వాధీనం చేసుకున్న భూములను క్లయింట్లు, నిందితులు ఇతరులకు అమ్ముకోకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఈ క్రమంలో ఫలానా ప్రాపర్టీలను రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ లేఖలు సమర్పించారు. అయితే వాటి కాల పరిమితి ఎప్పుడో ముగిసినా ఆయా శాఖలు తిరిగి ఉపసంహరించుకున్నట్లుగా లేఖలు రిజిస్ట్రేషన్ల శాఖకు పంపలేదు. ఈ క్రమంలో తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారుల పాసు పుస్తకం 2020 చట్టం అమల్లోకి వచ్చింది.
సాగు భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను తహశీల్దార్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో రిజిస్ట్రేషన్ల శాఖలో నమోదు చేసిన పీఓబీ జాబితాను రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్‌లో పొందుపర్చారు. ఇప్పుడేమో రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూములుగా ఉన్నప్పటికీ వివిధ కారణాలు, రెఫరెన్సులతో 22 ఏ కింద కనిపిస్తున్నాయి. ఇప్పుడీ భూములను సాధారణ పట్టా భూములుగా మార్చేందుకు అధికారుల దగ్గర ఏ మార్గం లేదు. మళ్లీ ఆయా శాఖలు ఇప్పటికీ స్వాధీనంలోని భూముల వివరాల జాబితాను రెవెన్యూ శాఖకు పంపిస్తే తప్ప మార్గమేదీ లేదని ఓ డిప్యూటీ కలెక్టర్‘దిశ’కు వివరించారు. దరఖాస్తుదారులు తమ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదన్నారు. అయితే సర్వే నంబరులోని కొంత భూమి స్వాధీనంలో ఉన్నప్పటికీ సదరు సర్వే నంబరులోని మొత్తం విస్తీర్ణానికి నిషేధం వర్తిస్తుండడంతో బాధితుల సంఖ్య చాంతాడంత కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలే దీనికి పరిష్కార మార్గాన్ని చూపించాలి. సదరు రెవెన్యూ, స్టాంప్స్ అండ్‌రిజిస్ట్రేషన్, ఏసీబీ, విజిలెన్స్ అండ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్, ఈడీ వంటి శాఖలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
పరిష్కారానికి మార్గం లేక..
ఎన్నో ఏండ్లుగా నలుగుతున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పీఓబీ జాబితా అంటే ప్రభుత్వ భూములే. ఐతే వాటిలో పట్టా భూములు చేరాయని గుర్తించినా సవరించేందుకు ఆసక్తి లేదు. ఉద్దేశ్య పూర్వకంగానే ప్రభుత్వ భూములనే పట్టా భూములుగా మార్చారన్న విమర్శలొస్తాయన్న భయం అధికారుల్లో ఉందని సమాచారం. తన కంటే ముందు అధికారులు చేయలేదు. తాను పరిష్కరించడంలో ఎక్కడైనా పొరపాట్లు చోటు చేసుకుంటే ప్రభుత్వం తీసుకునే క్రమశిక్షణా చర్యలకు బలి కావాల్సి వస్తోందన్న అభిప్రాయం ఐఏఎస్ అధికారుల్లో ఉందని సమాచారం.
పరిష్కారానికి సేత్వార్, ఖాస్రా పహాణీ ప్రకారం ప్రభుత్వ భూమి అని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. కానీ సేత్వార్ నుంచి నేచర్ ఆఫ్ ల్యాండ్ ఎలా మారిందో, దానికి సంబంధించిన సర్క్యులర్లు, కేటాయింపులు, ఎన్వోసీ పత్రాలను పరిశీలించడం లేదు. ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడుతామని, వాటిని ఆటోలాక్ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సభ్యులకు ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే జీఓల ద్వారా అమలు చేశారు. ఆ శాఖలు సమర్పించిన మొత్తం జాబితాలకు ‘ధరణి’ పోర్టల్ లో ఆటో లాక్ వేశారు. వాటిపై క్రయ విక్రయాలను నిషేదించారు. పీఓబీలో పేర్కొన్న భూములన్నీ ప్రభుత్వానివేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పీఓబీ సమస్యలను పరిష్కరించేందుకు వేలాది దరఖాస్తులు వచ్చాయి.
5 గుంటలకు 100 మంది
అన్నదమ్ములు భూములు పంచుకున్నారు. వారసత్వ ఆస్తులను సోదరికి ఇవ్వలేదు. ఆమె తనకు ఐదు గుంటల భూమి వస్తుందని వాదించింది. అన్నదమ్ములు వినలేదు. దాంతో ఆమె తనకు ఆస్తి ఇప్పించాలంటూ కోర్టులో దావా వేసింది. ఇది తెగేందుకు ఎంత కాలం పడుతుందో ఎవరు చెప్పలేరు. కానీ ఆమె ఐదు గుంటల ఆస్తికి 100 మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ భూమి ఏ సర్వే నంబరులో ఉందో.. రెవెన్యూ అధికారులు దాన్ని మొత్తంగా పీఓబీలో పెట్టేశారు. ఆ సర్వే నంబరుతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల్లో నాలుగైదు నంబర్లతో ఒకటీ రెండెకరాల భూమి కలిగిన వారికి కూడా క్రయ విక్రయాలకు దూరమయ్యారు. ఇప్పుడీ ఏరియాలో ఓ నలుగురు కలిసి 4 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆమె ప్రస్తావించిన సర్వే నంబరు కూడా వీరి పాసు పుస్తకంలో ఉంది. ఇంకేముంది? వారికి అమ్ముకునే హక్కులు లేకుండాపోయాయి. తమ పాపమేమీ లేకపోయినా ఇదేం న్యాయం అని రెవెన్యూ అధికారులను అడిగితే.. అంతా ధరణి మహిమ అంటున్నారు. ఇదీ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని ఐదు గుంటల వివాదానికి 100 మంది రైతులు పడుతున్న ఇబ్బంది. ఇలా ఉదాహారణలు రాష్ట్ర వ్యాప్తంగా వందలాదిగా కనిపిస్తున్నాయి.
18 గుంటలు ఎక్కడ?
మేడ్చల్‌జిల్లా ఘట్ కేసర్ మండలం ఏదులాబాద్ రెవెన్యూ పరిధిలో ఈ సమస్యను పరిష్కరించుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఉన్న శ్రీ సీతారామచంద్ర ఆలయానికి నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలో పొలాలు ఉన్నాయి. కానీ స్టాంప్స్ అండ్‌రిజిస్ట్రేషన్, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారుల చిన్న నిర్లక్ష్యంతో 13 ఏండ్లుగా సదరు పట్టా భూముల రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆలయ భూములు నిషేధిత జాబితాలో పొందుపర్చకుండా ఏదులాబాద్ లోని సర్వే నం.153 లోని భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చారు. చిన్న పొరపాటు పెద్ద సమస్యకు కారణమైంది. ఇది నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.
ఈ ఆలయానికి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌మండలం మక్తఅనంతారం సర్వే నం.153లో 18 గుంటలు, బీబీనగర్సర్వే నం.180లో 1.26 ఎకరాలు ఉన్నట్లుగా దేవాదాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. 2007 జూన్20న జీఓ నం.863 ద్వారా గుర్తించారు. వీటిని సెక్షన్ 22 ఎ కింద నిషేదిత రిజిస్ట్రేషన్ల జాబితాలో నమోదు చేయాలని పేర్కొన్నారు. అయితే 2008లో ఏదులాబాద్సర్వే నం.153లోని మొత్తం భూమిని పీఓబీలో చేర్చారు. దాంతో ఆ సర్వే నంబరులోని రైతులు 13 ఏండ్లుగా సమస్య ఎదుర్కొంటున్నారు. తమ పట్టా భూమిని పొరపాటుగా దేవాదాయ శాఖ భూమిగా నమోదు చేశారంటూ మేడిపల్లి మండలం బోడుప్పల్‌కు చెందిన చింతకుంట్ల ఆండాలు పలుమార్లు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. రిట్పిటిషన్నం.16367/2018 లో సదరు భూములు పట్టా అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే పీఓబీ జాబితా నుంచి తొలగించాలని సూచించింది.
ఘట్కేసర్సబ్రిజిస్ట్రార్తప్పు చేసినట్లుగా గుర్తు చేశారు. కానీ స్థానిక సబ్‌రిజిస్ట్రార్, తహశీల్దార్, ఆర్డీఓలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఐతే వాస్తవానికి ఆలయానికి సంబంధించిన భూమి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌మండలం మక్త అనంతారంలోని సర్వే నం.153లో కేవలం 18 గుంటలు మాత్రమే ఉంది. దాని నేచర్ఆఫ్ల్యాండ్కాలమ్లో ఇనాం భూమిగా పేర్కొన్నారు. దాన్ని మాత్రం నిషేదిత జాబితాలో పొందుపర్చలేదు. దేవాదాయ శాఖ దగ్గరున్న పాత రికార్డులను పరిశీలిస్తే అసలైన పట్టాదారులకు న్యాయం జరుగుతుంది. అక్రమార్కులకు శిక్ష పడుతుంది.
పరిష్కరించకపోతే నష్టం
ఎవరైనా చచ్చి చెడి కలెక్టర్ దగ్గరికి వెళ్లి తమ భూములను పీఓబీ జాబితాలో నుంచి తొలగించండని స్పందిస్తున్నారు. అన్నీ పరిశీలించి వాటిని తొలగించేందుకు తన అధికారాన్ని వినియోగిస్తున్నారు. ఆ తర్వాత ధరణి పోర్టల్ ను నిర్వహించే తెలంగాణ స్టేట్ టెక్నాలజీస్ సర్వీసెస్ నుంచి క్లియరెన్స్ కూడా కావాలంటున్నారు. వారెక్కడ ఉంటారో, ఎలా పట్టుకోవాలో తెలియక బాధితులు అయోమయానికి గురవుతున్నారు. లాక్ డౌన్ ఎత్తేసినా వీటిని పరిష్కరించకపోతే క్రయ విక్రయాలు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ భూములపై కొన్ని లావాదేవీలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ల దగ్గరికి వెళ్లే సరికి పీఓబీలో ఉందంటూ తహశీల్దార్లు పేచీ పెడుతున్నారు. ఏదో సర్వే నంబరులోని కొంత విస్తీర్ణంపై కేసు దాఖలైతే మొత్తాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేశారు. వాటిని నియంత్రించేందుకు ధరణి పోర్టల్ సాంకేతిక నైపుణ్యం ససేమిరా అంటోంది. ఇకనైనా టీఎస్ టీఎస్ లోని అధికార వర్గం, ధరణి పోర్టల్ నిర్వహిస్తోన్న సాంకేతిక నిపుణులు దృష్టి పెట్టాలని రెవెన్యూ అధికారులు కోరుతున్నారు.