- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త ‘ధరణి’
దిశ, తెలంగాణ బ్యూరో: రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సులభతరం చేస్తూ ‘ధరణి’ పోర్టల్‌ను అమల్లోకి తీసుకురానున్నారు. నేటి నుంచి దీనిలోని డేటా ఆధారంగానే భూ క్రయ విక్రయాలు నిర్వహించనున్నారు. సరికొత్త భూ పరిపాలన అందుబాటులోకి రానుంది. గతంలో గ్రామం, మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఐదంచెలుగా ఉన్న రెవెన్యూ వ్యవస్థలు ఇక నుంచి మండలం, జిల్లా, రాష్ట్రానికి అంటూ మూడంచెలకు మారనుంది. వీఆర్వో వ్యవస్థ రద్దుతో గ్రామం, కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఆర్డీఓల పాత్ర లేకపోవడంతో డివిజన్ల స్థాయిలో పాలన ఉండదని స్పష్టమవుతోంది. కాగా, నేడు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనుండడంతో తెలంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-2020 ను నోటిఫై చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
29వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. తహసీల్దార్లు జాయింట్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వర్తించడం, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు చేసే విషయమై సందేహా నివృత్తి చేయడానికి కొత్త చట్టాన్ని నోటిఫై చేశారు. కానీ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ పాత ఆర్వోఆర్ చట్టం ప్రకారం చేయనున్నట్లు ప్రకటించారు. రద్దయిన చట్టం ప్రకారం రెగ్యులరైజ్ సాధ్యం కాదన్న వాదన ఉంది. అమలుపై స్పష్టత ఇవ్వకుండా లావాదేవీలు నడపడం ద్వారా న్యాయపరమైన చిక్కులు వస్తాయని రెవెన్యూ నిపుణులు, రెవెన్యూ శాఖ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి దాకా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఏ చట్టం ప్రకారం రెగ్యులరైజ్ చేస్తారో చూడాలంటున్నారు. పాత చట్టం ప్రకారం చేస్తే రద్దయిన చట్టం ప్రకారం చేయడం చెల్లదంటూ ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే పీఓబీ జాబితాపైనా పెద్ద ఎత్తున అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకా అనేక మంది ‘ధరణి’ పోర్టల్ లో వారి ఆస్తుల వివరాలను పరిశీలించుకోలేదు. ఈ విషయమై ఇప్పటికే ప్రతి రోజూ పదుల సంఖ్యలో తమకు ఫోన్లు వస్తున్నాయని ఓ ప్రొఫెసర్ ‘దిశ’కు వివరించారు.
ఎదురుచూపుల్లో యంత్రాంగం..
ప్రభుత్వం నోటిఫై చేసిన ఆర్వోఆర్ 2020 చట్టాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు ఎప్పుడెప్పుడు జారీ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. 1971 లో వచ్చిన ఆర్వోఆర్ చట్టానికి గైడ్ లైన్స్ ను 18 ఏళ్ల తర్వాత అంటే 1989 జూన్ 9న రూపొందించారు. ఆ మధ్య కాలంలో ఆర్వోఆర్ చట్టం-1948 నే యథాతథంగా అమలు చేశారు. ఇప్పుడేమో మార్గదర్శకాలను జారీ చేయకుండానే అమలు చేసేందుకు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సాదాబైనామా క్రమబద్ధీకరణపై సందేహం..
1971 ఆర్వోఆర్ చట్టాన్ని రిపీల్ అయినట్లు కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తేదీ.17.10.2020 న విడుదల చేసిన సర్క్యులర్ సీసీఎల్ఏ రెఫరెన్స్ ద్వారా సాదాబైనామాలను క్రమబద్ధీకరించడం చెల్లదని, పాత చట్టంలోని సెక్షన్ 5 ఏ ప్రకారమే సాధ్యమవుతుందని రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ అన్నారు. కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఆ అంశాలేవీ పేర్కొనకుండానే రెగ్యులరైజ్ చేయడం చెల్లదన్నారు. పాత చట్టమే అమలు ఉందని ప్రభుత్వం ప్రకటిస్తే కొత్తగా తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యూటేషన్లు చేయడం కుదరదని స్పష్టం చేశారు. అలాగే పార్టు బీ భూముల విషయం, నాన్ డిజిటల్ సిగ్నేచర్ కు సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ జారీ చేయలేదన్నారు. తహసీల్దార్ల దగ్గర పౌతి, మ్యూటేషన్ వంటి అనేక కేసులు పెండింగులో ఉన్నాయి. వాటిపై ఎలాంటి ఆర్డర్లు జారీ చేయొద్దని సీసీఎల్ సెప్టెంబరు ఏడో తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. వాటిపైనా తదుపరి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రతి నిర్ణయానికి ఏదైనా చట్టం ఉంటుంది. ఇప్పుడీ సాదాబైనామాల క్రమబద్ధీకరణపై ఎవరైనా కోర్టుకు వెళ్తే జనం ఇబ్బంది పడుతారన్నారు.
ట్రిబ్యునళ్ల ఏర్పాటేది..?
ఇప్పటికీ కొత్తగా రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయలేదు. కేవలం ఆర్వోఆర్ కు సంబంధించిన కేసుల విషయమై తహసీల్దార్ల ఏర్పాటు ఉన్నది. మిగతా ఇనా్మ్, టెనెన్సీ, పీఓటీ వంటి కేసులపై నిషేదం లేనప్పటికీ తహసీల్దార్/ఆర్డీఓ/జాయింట్ కలెక్టర్ కోర్టుల్లో విచారణలను నిలిపేశారు. రెవెన్యూ కోర్టులను పున:ప్రారంభించకపోవడంతో కేసులన్నీ పెండింగులోనే ఉన్నాయి. అయితే ధరణి అమలు తర్వాత వారం పాటు లావాదేవీలు, వివాదాలు, ఇబ్బందులను పరిశీలించి చట్ట సవరణ చేయడమా? ఇతర మార్గాలపై కలెక్టర్లతో చర్చించనున్నట్లు ప్రభుత్వం తెలిసింది. నవంబరు మొదటి వారంలోనే కలెక్టర్లు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యలో తలెత్తే వివాదాలన్నింటికీ చట్టంలో ఎలాంటి సవరణలు చేయాలో, మార్గదర్శకాలో అనే అంశంపై ప్రభుత్వం యోచిస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
పీఓబీ చిక్కులు..
దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడడానికి రెండు జీఓలను అమలులోకి తెచ్చారు. ఐతే కొత్తగా రెండు విభాగాలు సమర్పించిన జాబితాలన్నింటినీ ‘ధరణి’ పోర్టల్ లో ఆటో లాక్ చేసి, వాటిపై క్రయ విక్రయాలు జరగకుండా నిషేధించారు. భవన నిర్మాణాలకు అనుమతులను నిరాకరించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే 2015 లో హైకోర్టు పలు కేసుల్లో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త జాబితా తయారు చేసి పోర్టల్ లో చేర్చారా? లేదా? అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. సెక్షన్ 22 ఎ నిషేధిత జాబితా ప్రభుత్వ సైట్ లో పెట్టమని తీర్పు వెలువరించిన ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇప్పుడేమో ఏ ప్రాతిపదికన నమోదు చేశారో అర్ధం కావడం లేదని రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ అన్నారు. నిషేదిత భూముల జాబితాను తయారు చేసేటప్పుడు పలు ప్రొసీజర్స్ ఉంటాయని వాటి సంగతి కూడా తేల్చలేదన్నారు. అలాగే, పీఓబీ జాబితా రూపకల్పనకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుందని రెవెన్యూ చట్టాల నిపుణుడు ప్రొ.ఎం.సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. కానీ వక్ఫ్, దేవాదాయ శాఖలు ఇచ్చిన జాబితాలను యథాతథంగా ఆటోలాక్ అనడం ద్వారా వేలాది మంది ఇబ్బందులు పడుతారన్నారు. ఇలా పలు సమస్యలు పరిష్కరించకుండానే ‘ధరణి’ పోర్టల్ అందుబాటులోకి రావడంతో గందరగోళం తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఒక్క కార్యాలయానికే పరిమితం..
నేడు మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ‘ధరణి’ పోర్టల్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే దీనిని ప్రధాన సర్వర్ తో లింక్ చేయలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రైనింగ్ మాడ్యూల్ లోనే వ్యవహారం నడిపించడంతో నేటి నుంచి మిగతా తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యూటేషన్లు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి ఆధారిత కార్యకలాపాలను ప్రారంభించేందుకు మరికొంత సమయం పట్టేటట్లు ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే వ్యవస్థను రూపొందించకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటామన్న భయం అధికారుల్లో పట్టుకుంది.
ఇక కోర్టులకేనా..?
• ప్రజా ఫిర్యాదులకు అవకాశం లేని తహసీల్దార్ కార్యాలయాలుగా మారుతున్నాయి. ధరణి పోర్టల్ లో హక్కుదారుడు, ఇతరులు ఫిర్యాదు చేసేందుకు, స్వీకరించేందుకు వ్యవస్థలు లేవు. ఈ క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగిందని భావించినా, అన్యాయానికి గురైనట్లు తలచినా కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితులే. సమస్త సమస్యలకు పరిష్కార వేదికగా కీర్తించిన పోర్టల్ సామాన్యుల పాలిట శాపంగా మారుతుందని రెవెన్యూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
• ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ కార్యాలయం కేవలం రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యూటేషన్లకు పరిమితం కానుంది. ఏ వ్యక్తికీ న్యాయం చేసే అధికారం అధికారులకు లేకుండాపోయింది. ప్రతి అంశంలోనూ కోర్టులను ఆశ్రయించే వ్యవస్థకు నాంది పలుకుతుంది.
• నాలా కన్వర్షన్ కాని భూముల్లో వెలిసిన ప్లాట్లకు సంబంధించిన వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటికి జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల వివరాలన్నీ ధరణిలో యథాతథంగా నమోదు చేశారు. నాలా కన్వర్షన్ చేయని భూముల మార్కెట్ విలువలను కూడా వ్యవసాయేతర భూములుగా పరిగణించిన దాఖలాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కొనే వారి సంఖ్య లక్షల్లో ఉన్నారు.
• వివిధ పథకాలు, ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాల్లోనూ చిక్కుముళ్లు ఉన్నాయి. ఆ రైతుల పాసు పుస్తకాల్లో కట్ చేయకుండా యథాతథంగా ఉంచిన ఉదాహరణలు ఉన్నాయి. అలాగే వాటిని డీమార్కేషన్ చేయకుండా పెండింగులో ఉంచారు.
• ధరణిలో మిస్ చేసిన సర్వే నంబర్లకు పరిష్కారం ఎలా దొరకుతుందో ఎవరూ చెప్పడం లేదు.
• ఆర్ఎస్ఆర్ లో తేడాలు కలిగిన సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లపైనా రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వాటిని పరిష్కరించకుండా రిజిస్ట్రేషన్లు చేపడితే ఎర్రర్ వస్తుందంటూ మొర పెట్టుకున్నారు. దీనిపై ప్రభుత్వం పరిష్కారాన్ని చూపలేదు.