నేటి నుంచి పాత యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం

by D.Reddy |
నేటి నుంచి పాత యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి (Yadagirigutta Laxmi Narasimha swamy) అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavams) ముస్తాబైంది. నేటి (ఫిబ్రవరి 7) నుంచి ఈనెల 13వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక ఇవాళ ఉదయం వేద పండితులు స్వస్తివాచనం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురారోపణం, మృత్సంగ్రహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి అలంకార సేవలను చేపట్టనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలు..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 9న స్వామివారి సింహ వాహనసేవ, రాత్రి అశ్వవాహన సేవలో ఎదుర్కోళ్లోత్సవం, 10న ఉదయం హనుమంత సేవ, రాత్రి గజవాహన సేవలో తిరుకల్యాణోత్సవం, 11న ఉదయం గరుఢ వాహనసేవ, రాత్రి రథాంగ హోమం, దివ్య విమాన రథత్సవం, లక్ష్మీదేవీ సమేతంగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 12న చక్రతీర్థం, మహా పూర్ణాహుతి, 13న అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈనెల 10న రాత్రి నిర్వహించే స్వామివారి కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కల్యాణ టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ గోపురాలకు రంగులు వేసి మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక పాతగుట్టలో ఏడు రోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు.

Next Story

Most Viewed