ఆ ఆలయంలో దేవతలకు బీరు, సారాయి ప్రసాదం..

by Sumithra |
ఆ ఆలయంలో దేవతలకు బీరు, సారాయి ప్రసాదం..
X

దిశ, ఫీచర్స్ : ఆలయానికి వెళ్లే భక్తులు సాధారణంగా పూలు, పండ్లు లేదా ఏవైనా ఆహార పదార్థాలను నైవేధ్యంగా భగవంతుడికి సమర్పిస్తారు. దేవుడికి సమర్పించిన నైవేధ్యాన్ని తిరిగి భక్తులకు పంచిపెడతారు. అన్ని దేవాలయాల్లో జరిగే తంతు ఇలానే ఉంటుంది. అయితే ఉజ్జయినీలోని కాలభైరవ దేవాలయంలో స్వామివారికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయాన్ని నిత్యం వందలాది మంది సందర్శిస్తుంటారు. దాంతో ఈ దేవాలయం జాతర జరిగే సమయంలో సారాయి ఏరులై పారుతుంది. అందరూ దీన్ని సారాయి అంటే... భక్తులు మాత్రం తీర్థమని చెబుతుంటారు. మరి ఆ దేవాలయం ఎక్కడుంది... ఎందుకు ఆ దేవాలయంలో మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారో తెలుసుకుందాం.

ఆలయానికి వెళ్లిన భక్తులకు తీర్థంగా పంచామృతం లేదా తులసి తీర్ధాన్ని ఇస్తారు. కొన్ని ఆలయాల్లో కొబ్బరి నీళ్లను తీర్థంగా అందజేస్తారు. కానీ, అతి కొద్ది ఆలయాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా తీర్థప్రసాదాలుంటాయి. ఉజ్జయినీలోని కాలభైరవాలయంలో మద్యాన్ని ప్రసాదంగా ఇస్తే, కర్ణాటకలోని ఓ ఆలయంలో కూడా తీర్థంగా సారాయి, బీర్లను ఇస్తుంటారు. ఇలా ఎందుకు ఇస్తారు అని ప్రశ్నిస్తే అక్కడి భక్తులు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యపోతారు. సుమారు ఆరు శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతున్నట్టు భక్తులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది... మద్యం తీర్థంగా ఇవ్వడం వెనుక ఉన్న కథేంటో చూద్దాం…

మద్యాన్ని తీర్థంగా ఇచ్చే ఆలయం గురించి తెలుసుకోవాలంటే మనం కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాకు వెళ్లాలి. జిల్లాలోని గులేడగుడ్డలోని లింగాపూర్‌ అనే గ్రామంలో కనకరాయ దేవుని ఆలయం ఉంది. ఈ ఆలయం ముందు వరసగా పదుల సంఖ్యలో దుకాణాలుంటాయి. ఈ దుకాణాల్లో పూలు, కాయలకు బదులుగా మద్యం అమ్ముతుంటారు. ఆలయానికి వచ్చే భక్తులు మద్యం కొనుగోలు చేసి ఆలయంలోని కనకరయ్యకి, లక్ష్మీ రంగనాథానికి సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన మద్యాన్ని స్వాములిద్దరికీ నైవేద్యంగా సమర్పించి దానిని తిరిగి తీర్థంగా భక్తులకు అందజేస్తారు. ఈ ఆచారం ఆరు వందల యేళ్లుగా కొనసాగుతోంది. ప్రతీ ఏడాది హోలీ తరువాత వచ్చే పౌర్ణమి రోజున ఆలయంలో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు వచ్చిన భక్తులు తమ కోర్కెలు తీర్చాలని మొక్కుకొని మద్యం సమర్పించి తీర్థం పుచ్చుకుంటారు. జాతర జరిగే ముందురోజు ఈ తతంగం జరుగుతుంది.

జాతర రోజున కొంత మొత్తంలో మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. అయితే, కోరిన కోర్కెలు తీరిన తరువాత ఇంత మొత్తంలో మద్యం ఇస్తానని భక్తులు మొక్కుకుంటారు. అలా మొక్కుకున్న మొక్కులను తప్పకుండా నెరవేర్చాలని, లేదంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలోనే జాతర సమయంలో మొక్కులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. దీంతో గర్భాలయమైన సాకు ఆవరణ మద్యం సీసాలతో నిండిపోతుయంది. కనకరాయునికి మద్యం సమర్పించడం వెనుక ఓ కథ ఉంది. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో కరువు ఏర్పడింది. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు లక్ష్మీ రంగనాథుడు దారి చూపాడు. పండ్ల రసంలో నీరుపోసి రసాన్ని ఇచ్చి ప్రజల దాహార్తిని తీర్చాడు. ఆ కాలంలో పండ్ల రసం అంటే సోమరసంగా చెప్పేవారు. ఆ సోమరసమే ఇప్పుడు సారాయిగా మారింది. కనకరాయుడు, లక్ష్మీరంగనాథుడికి పండ్ల రసానికి బదులుగా సారాయిని నైవేద్యంగా సమర్పించడం అప్పటి నుంచే వస్తున్నదని భక్తులు చెబుతున్నారు. ఒక్క జాతర సమయంలోనే కాకుండా ప్రతిరోజూ వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి మద్యం నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇది క్లుప్తంగా సారాయి తీర్థం కథ.

Advertisement

Next Story