నియోజకవర్గంలో డెంగ్యూ విశ్వరూపం.. పెరుగుతున్న మరణాలు

by Sridhar Babu |
నియోజకవర్గంలో డెంగ్యూ విశ్వరూపం.. పెరుగుతున్న మరణాలు
X

దిశ, మణుగూరు: పినపాక నియోజకవర్గంలో డెంగ్యూ విశ్వరూపం తాండవిస్తోంది. ప్రతి కుటుంబంలో ఒక్కరు, ఇద్దరు డెంగ్యూ జ్వరంతో మంచంపై ఉన్నారని ప్రజల ద్వారా తేటతెల్లమౌవుతోంది. నియోజకవర్గంలో సరైన వైద్యం లేకపోవడమే డెంగ్యూ మరణాలకు కారణమని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. పినపాక మండలం సీతంపేట గ్రామంలోని రేగళ్ల సమ్మయ్య కూతురు రేగళ్ల హారతి డెంగ్యూ జ్వరంతో కొన్ని రోజులుగా బాధపడుతూ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మరణాన్ని చూడలేక కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రేగళ్ల హారతి మరణాన్ని చూడలేక గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులను ఓదార్చారు.

రేగళ్ల హారతి మరణాన్ని మరవకముందే మణుగూరు మండలంలోని అన్నారం గ్రామంలో దులగొండి కేశవసాయి(23) అనే వ్యక్తి డెంగ్యూ జ్వరంతో బుధవారం మృతిచెందాడు. కొడుకు డెంగ్యూ జ్వరంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆర్తనాదాలతో ఘోషించారు. దులగొండి కేశవసాయి మరణాన్ని చూడలేక అన్నారం గ్రామప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. ఇదే గ్రామంలో ఎంతోమంది డెంగ్యూ జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారని, సరైన వైద్యం దొరకడం లేదని గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో ప్రభుత్వ వైద్యులు హెల్త్ క్యాంపులు నిర్వహించడంలేదని ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కనీసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన డాక్టర్ లేక సరైన మందులు లేక ప్రజలు విషజ్వరాలతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఉన్నతాధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story