- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మర్డర్ కేసులో ‘చాంపియన్’ ఎస్కేప్.. కెరీర్ నాశనమేనా..!
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకాలు గెల్చిన సుశీల్ కుమార్ కెరీర్ ఇక ముగినట్లే. గత కొంత కాలంగా సరైన ప్రదర్శన చేయక పోవడంతో టోక్యో ఒలంపిక్స్‌కు కూడా అర్హత సాధించని సుశీల్.. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో ఇరుక్కున్నాడు. ఘటన జరిగిన తర్వాతి రోజే ‘తనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు’ అని మీడియాకు ప్రకటన విడుదల చేశాడు. కానీ, పోలీసుల దర్యాప్తు, ఆ ఘటనలో గాయపడిన మరో రెజ్లర్ సాక్ష్యాలను పరిశీలిస్తే సుశీల్ కుమార్ ఆ రోజు సంఘటనా స్థలంలో ఉన్నట్లు తెలుస్తున్నది. గొడవకు కారణం కూడా అతడే అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి ఆగ్నేయ ఢిల్లీ ప్రాంతంలో ఉన్న ఛత్రాసాల్ స్టేడియం వద్ద జరిగిన ఘర్షణలో సాగర్ కుమార్ అనే మాజీ జూనియర్ నేషనల్ చాంపియన్ చనిపోయాడు. ప్రస్తుతం నేషనల్ సీనియర్ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. సాగర్ తండ్రి ఢిల్లీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఘర్షణ జరిగిన సమయంలో సుశీల్ కుమార్, అజయ్, ప్రిన్స్ దలాల్, సోను మహల్, సాగర్ కుమార్ ఉన్నారు. వీరిలో సాగర్ చనిపోగా.. సోను మహల్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అన్నింటికీ సుశీల్ కారణం..
ఢిల్లీ పోలీసులు గాయాలతో చికిత్స పొందుతున్న సోను మహల్‌ను విచారించారు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకున్నారు. సోనూ ఏం చెప్పాడంటే..’సుశీల్ కుమార్, అజయ్, ప్రిన్స్ దలాల్, సోను మహల్, సాగర్ కుమార్ మధ్య మంగళవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఛత్రాసాల్ స్టేడియం పార్కింగ్ ఏరియాలో ఈ గొడవ జరిగింది. ఆ సమయంలో ఒకరినొకరు తీవ్రంగా గాయపర్చుకున్నారు. నాకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడే కింద పడిపోయాను. ఈ గొడవ అంతటికీ సుశీల్ కారణం. ఆ సమయంలో అతడు అక్కడే ఉన్నాడు’ అని సోను చెప్పాడు. మరోవైపు పోలీసుల దర్యాప్తులో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఘర్షణ జరిగిన సమయంలో ప్రిన్స్ దలాల్ అనే రెజ్లర్ తన మొబైల్ ఫోన్‌లో మొత్తం ఘటనను చిత్రీకరించాడు. సాగర్‌ను చితక బాదుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంటనే దలాల్‌ను అరెస్టు చేసి ఫోన్ సీజ్ చేశారు. అంతే కాకుండా ఘటనా స్థలం నుంచి రెండు డబుల్ బ్యారెల్ గన్స్, ఏడు క్యాట్రిడ్జ్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గన్స్ హర్యాణాలోని అశోద గ్రామానికి చెందిన వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయి ఉన్నాయి.
మాఫియాతో సంబంధాలు..
పోలీసులు ఘర్షణ అనంతరం ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రెండు ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి. ఒకటి గురుగ్రామ్‌లోని కంపెనీ పేరు మీద రిజిస్టర్ అవగా.. ఇంకొకటి హర్యానాకు చెందిన గ్యాంగ్‌స్టర్ నవీన్ బాలీకి సన్నిహితుడైన మోహిత్ అశోద పేరు మీద రిజిస్టర్ అయ్యింది. నీరజ్ బవానా అనే గ్యాంగ్ స్టర్ అరెస్టు తర్వాత నవీన్ బాలీ కొత్తగా గ్యాంగ్ ఏర్పాటు చేసి మాఫియాను నడిపిస్తున్నాడు. ప్రిన్స్ దలాలా రోహ్‌తక్ యూనివర్సిటీలో మూడో సంవత్సరం విద్యార్థి. అతడికి నవీన్ బాలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ ప్రిన్స్ దలాల్ ఈ ఘటన సమయంలో ఫోన్‌లో మొత్తం చిత్రీకరించాడు. అంతే కాకుండా ఛత్రాసాల్ స్టేడియం వెలుపల దాదాపు 15 మంది గ్యాంగ్ వెయిట్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనపడ్డాయి. ఇదంతా ముందస్తు ప్లాన్ అని పోలీసులు చెబుతున్నారు. సుశీల్ కుమార్ ఇందులో నేరుగా పాల్గొన్నాడని.. తనకు సంబంధం లేదని చెప్పిన వ్యాఖ్యలు తప్పని పోలీసులు అంటున్నారు.
పరారీలో చాంపియన్..
లండన్ ఒలంపిక్స్‌లో వెండి పతకం, బీజింగ్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకొని దేశ ప్రతిష్టను పెంచిన ఆనాటి చాంపియన్ సుశీల్ కుమార్ ఇప్పుడు ఒక హత్యా నేరంలో ఇరుక్కొని పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం ఢిల్లీ-హర్యాణా సరిహద్దులో విస్తృతంగా గాలిస్తున్నారు. రెజ్లింగ్‌లో 66 కేజీల ఫ్రీ స్టైల్‌లో ఎన్నో పతకాలు సాధించాడు. ఏసియన్ గేమ్స్‌లో కాంస్య, వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఐదు స్వర్ణ పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల జరిగిన ఒలంపిక్స్ అర్హత పోటీల్లో విఫలం కావడంతో టోక్యో ఒలంపిక్స్ బెర్త్ సాధించలేకపోయాడు. అప్పుడే సుశీల్ కెరీర్ ముగిసిందని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కొని పూర్తిగా రెజ్లింగ్‌కు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.