ఢిల్లీ సీఎంకు క‌రోనా టెస్టు.. నేడో రేపో ఫ‌లితం

by vinod kumar |   ( Updated:2020-06-09 05:01:02.0  )
ఢిల్లీ సీఎంకు క‌రోనా టెస్టు.. నేడో రేపో ఫ‌లితం
X

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు వైద్యాధికారులు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం కేజ్రీవాల్ ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి.. ల్యాబ్ కు పంపారు. ఈ ఫ‌లితం ఇవాళ రాత్రికిగానీ, బుధ‌వారం ఉద‌యంగానీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.గొంతు నొప్పి, జ్వ‌రం రావ‌డంతో.. కేజ్రీవాల్ ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ షుగ‌ర్ పేషెంట్ కావ‌డంతో.. కుటుంబ స‌భ్యులు, అభిమానులు కొంత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఆదివారం ఉద‌యం త‌న అధికారిక నివాసంలో కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి గోపాల్ రాయ్, చీఫ్ సెక్ర‌ట‌రీ విజ‌య్ దేవ్ హాజ‌ర‌య్యారు. దీంతో వీరికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. అయితే ఢిల్లీలో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేప‌థ్యంలో రెండు నెల‌ల నుంచి దాదాపు అన్ని స‌మావేశాలు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే నిర్వ‌హిస్తున్నారు. కేవ‌లం లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ తో జ‌రిగే స‌మావేశాల‌కు మాత్ర‌మే నేరుగా కేజ్రీవాల్ హాజ‌ర‌వుతున్నారు. జూన్ 2న ఎల్జీ ఆఫీసులో జ‌రిగిన స‌మావేశానికి కేజ్రీవాల్, సిసోడియా హాజ‌ర‌య్యారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంలో 13 మంది ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

Advertisement

Next Story

Most Viewed