- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సర్కారుకు ఆ రూల్స్ గిట్టలే.. అమలు డౌటే!
దిశ, న్యూస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆమోదించనున్న నూతన విద్యుత్ టారిఫ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయడం అనుమానమేనని తెలుస్తోంది. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ నుంచి మొదలుకొని అన్ని రకాల విద్యుత్ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో (డీబీటీ) వేయాలన్న ప్రధాన పాలసీ సవరణ రాష్ట్ర ప్రభుత్వానికి గిట్టదని పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్, విద్యుత్ మంత్రి చేసిన వ్యాఖ్యల ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. ఈ వారంలోనే కేబినెట్ సమావేశంలో పెట్టి ఆమోదించడానికి సర్వం సిద్ధమైన నూతన పాలసీలో విద్యుత్ చార్జీల వసూలుకు సంబంధించిన చాలా అంశాలను కేంద్రం కొత్తగా చేర్చింది. 2016 టారిఫ్ పాలసీకి భారీగా సవరణలు చేస్తూ ఈ కొత్త పాలసీని రూపొందించారు. విద్యుత్ చట్టం ప్రకారం టారిఫ్ పాలసీకి ఎప్పటికప్పుడు సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అయితే ఈ పాలసీలోని అంశాలు కేవలం మార్గదర్శకాలుగానే ఉంటాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యుత్ అంశం రాజ్యాంగంలో కేంద్రం, రాష్ట్రాలు రెండింటి పరిధిలోని జాబితాలో ఉండడం కారణంగానే ఇది రాష్ట్ర ప్రభుత్వాల మీద బైండింగ్ కాదని చెబుతున్నారు.
రైతులకు ఇస్తున్న వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతి ఎక్కువ సబ్సిడీ నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తున్న రాష్ట్రాల సరసన నిలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇస్తున్న ఉచిత విద్యుత్, ఇతర సబ్సిడీలకు బడ్జెట్‌లో సమారు రూ.7500 కోట్ల దాకా కేటాయించింది. ఇవి కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విద్యుత్ బిల్లులను కూడా ప్రభుత్వమే డిస్కంలకు ముందుగానే చెల్లిస్తోంది. ప్రాజెక్టుల విద్యుత్ బిల్లుల విషయం ఎలా ఉన్నప్పటికీ తాజా బడ్జెట్ ప్రకారం లెక్కేస్తే రూ.7500 కోట్లు రైతులు నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లిస్తే ప్రభుత్వం వారి వ్యక్తిగత ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే ఒక్క హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాలు వ్యవసాయంతో ముడిపడి ఉన్నవే అయినందున రైతులకు నేరుగా భారం పడే ఈ పాలసీని ఎంత మేరకు అమలు చేస్తుందో వేచి చూడాలని పలువురు పేర్కొంటున్నారు.
పలు కేటగిరీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ నష్టాలను పూడ్చుకోవడానికి హైటెన్షన్ కేటగిరిలోని పారిశ్రామిక వినియోగదారులపై క్రాస్ సబ్సిడీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతోంది. ఈ క్రాస్ సబ్సిడీ ఎత్తి వేయాలన్న నిబంధనను కూడా కేంద్రం నూతన టారిఫ్ పాలసీలో చేర్చింది. క్రాస్ సబ్సిడీ ఎత్తి వేయకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ మీద ప్రభావం పడి దేశంలోకి పెట్టుబడులు రావనే వాదనను కేంద్రం తెరమీదకు తీసుకొస్తోంది. రాష్ట్రంలో దక్షిణ ప్రాంత డిస్కం అయిన టీఎస్‌ఎస్పీడీసీఎల్ పరిధిలో క్రాస్ సబ్సిడీ అంశాన్ని పరిశీలిస్తే ఎల్‌టీ కేటగిరీలోని గృహ, వ్యవసాయం అన్ని రకాల కనెక్షన్లు కలిపి 82లక్షల 44వేల2739 ఉండగా వీటి నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7654 కోట్లు బిల్లులు వసూలయ్యాయి. కాగా కేవలం 5105 ఉన్న హెచ్‌టీ పారిశ్రామిక కనెక్షన్ల ద్వారా ఇదే సంవత్సరంలో రూ.8407కోట్లు వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే ఏడాదిలో అన్ని ఎల్‌టీ కేటగిరీ కనెక్షన్లలో కలిపి యూనిట్ విద్యుత్‌కు సగటున రూ.3.07 పైసలు వసూలు కాగా అన్ని కేటగిరీల హెచ్‌టీ కనెక్షన్లు కలిపి సగటున యూనిట్‌కు రూ.7.81 పైసలు వసూలైంది. ఈ టారిఫ్ విధానంలో హేతుబద్ధత లేదని అందరికీ అందుబాటులో ఉండే విద్యుత్ లభించినపుడే పెట్టుబడులు వస్తాయని బలంగా నమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం క్రాస్ సబ్సిడీని ఎత్తి వేయాలన్న అంశాన్ని ప్రధానంగా టారిఫ్ పాలసీలో చేర్చింది.
విద్యుత్ వినియోగదారులను ప్రస్తుతం 50 నుంచి 60 కేటగిరీలుగా వర్గీకరిస్తున్నారని, భవిష్యత్తులో విద్యుత్ దేనికి వినియోగిస్తున్నారనేది ప్రామాణికంగా తీసుకోకుండా ఎంత మొత్తం విద్యుత్ వినియోగిస్తున్నారన్న దాన్ని ఆధారంగా చేసుకొని కేవలం 6 కేటగిరీలు ఉంటే చాలని టారిఫ్ పాలసీలో కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇది కూడా ఒక రకంగా వ్యవసాయ, గృహ, పారిశ్రామిక వినియోగదారులన్న బేధాన్ని తీసేసి వారు వాడుకునే విద్యుత్ పరిమాణాన్ని బట్టి మాత్రమే టారిఫ్ నిర్ణయించి క్రాస్ సబ్సిడీలను ఎత్తివేసే పరోక్ష నిబంధనేనని స్పష్టమవుతోంది. వీటితో పాటు ఎప్పటికప్పుడు విద్యుత్ కొనుగోలు, పంపిణీలకు అవుతున్న ఖర్చు ఆధారంగా చార్జీలు పెంచాల్సిందిగా పేర్కొంటూ, టారిఫ్ పెంపు విషయంలో ఇక ముందు వాయిదాలు వేయకుండా ఉండేందుకుగాను రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఎస్ఈఆర్సీ)లను ఉద్దేశించి కొత్త టారిఫ్ పాలసీలో కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. నూతన టారిఫ్ పాలసీలోని ఈ నిబంధనలన్నీ తెలంగాణతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు రాజకీయంగా రుచించకపోవచ్చని, ఈ కారణంగా పాలసీ అమలు అంత ఈజీ కాదని విద్యుత్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.