ఎటూ తేలని కరెంటోళ్ల వివాదం.. సీల్డ్ కవర్‌ కోసం వెయిటింగ్..?

by Shyam |
ఎటూ తేలని కరెంటోళ్ల వివాదం.. సీల్డ్ కవర్‌ కోసం వెయిటింగ్..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: విద్యుత్ ఉద్యోగులు-సర్కిల్ ఆపరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మధ్య జరుగుతున్న వివాదం ఎటూ తేలలేదు. గత నెల 24న ఎస్ఈపై విద్యుత్ ఉద్యోగులతో ప్రారంభమైన ఫిర్యాదులు, విచారణ, నిరసనల పరంపరకు తోడు ఎస్ఈ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు నమోదుతో కరెంట్ ఉద్యోగుల లొల్లి వేడెక్కింది.

గురువారం నుంచి మాస్ లీవ్‌లకు విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఇచ్చిన పిలుపుతో మంగళవారం టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ నుంచి సర్కిల్ ఎస్ఈకి పిలుపువచ్చింది. బుధవారం విద్యుత్ ఉద్యోగులతో నిజామాబాద్ అదనపు కలెక్టర్ ఒక దఫా చర్చలు జరిపారు. అవి కూడా ఎటూ తేలలేదు. సాయంత్రం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రెండో సారి డీఈలతో చర్చించారు. అక్కడ కూడా ఉద్యోగులు ఎస్‌ఈని బదిలీ చేయాలని పట్టుబట్టారు. దీంతో ఇద్దరు జేఏసీ నేతలు అయిన లక్ష్మారెడ్డి, తోట రాజశేఖర్‌లు తనను మానసికంగా వేధిస్తున్నారని, తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఎస్‌ఈ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు కావడంతో ఆ వివాదం కూడా ఎటూ తేలలేదు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోనూ ఇద్దరు జేఎసీ నాయకులపై చర్యలు తీసుకోకుండా హమీ ఇచ్చినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్‌తో జేఏసీ చేసిన చర్చలు, హమీ మేరకు విద్యుత్ ఉద్యోగుల ఐకాస మాస్ లీవ్‌ను రెండురోజుల పాటు వాయిదా వేసిందని జేఎసీ కన్వీనర్ శ్రీనివాస్ తెలిపారు. టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వద్దకు వెళ్లిన ఎస్‌ఈ సుదర్శనం స్థానికంగా జరిగిన పరిణామాలను తెలిపినట్టు తెలిసింది. సీయండీ నుంచి ఎస్ఈని బదిలీ చేయాలని కానీ, ఇతర చర్యల్లో కూడా ఎలాంటి పురోగతి కనిపించలేదు. సీఎండీ నుంచి కూడా నిజామాబాద్ నేతలకు ఎలాంటి సమాచారం అందలేదు. మొత్తానికి వివాదం పెద్దది కావడానికి ప్రధాన కారణమైన సంస్థ సాగదీత ధోరణి అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే.. సీల్డ్ కవర్ ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. విద్యుత్ ఉద్యోగులు-ఎస్ఈ మధ్య వివాదం పరిష్కరించేందుకు నిజామాబాద్ ఉద్యోగుల జేఎసీ చైర్మన్ అలుక కిషన్ బుధవారం జేఏసీతో నేతలతో చర్చల్లో పాల్గొన్నా.. ఫలితం లేకుండా పోయింది. నిజామాబాద్ సర్కిల్‌లో జరుగుతున్న కరెంటోళ్ల ఆందోళనపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు వెళ్లినట్టు తెలిసింది. జిల్లాలో పరిస్థితులను అంచనా వేసుకొని త్వరలో వివాదానికి ముగింపు పలికే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed