- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరదల నష్టం.. ₹9,422 కోట్లు
హైదరాబాద్ నగరంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వానలు, వరదల కారణంగా సుమారు రూ.9,422 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది. పంటలు దెబ్బ తినడం వల్లనే రూ.8,633 కోట్ల నష్టం కలిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వారికి వివరించారు. రూ.222 కోట్ల మేరకు రోడ్లు, రూ.567 కోట్ల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. జల విలయంతో ఏర్పడిన పరిస్థితులను కేంద్ర బృందం గురువారం స్వయంగా అధ్యయనం చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో వర్షాలు, వరదల కారణంగా జరిగిన భీభత్సాన్ని, మౌలిక సదుపాయాలకు కలిగిన విఘాతాన్ని కేంద్ర బృందానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో నగరానికి చేరుకున్న ఈ బృంద సభ్యులు సీఎస్ తోపాటు వివిధ విభాగాల కార్యదర్శులతో సమావేశమయ్యారు. వరదలతో జరిగిన నష్టాన్ని, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హఫీజ్ బాబానగర్, ఫలక్‌నుమా, గుర్రం చెరువు, అల్ జుబైల్ కాలనీ, కందికల్ గేటు మెయిన్ రోడ్డు, అప్పా చెరువు, పల్లె చెరువు, బండ్లగూడ తదితర ప్రాంతాలను సందర్శించారు.
గత 100 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరంలో ఎన్నడూ లేనంతటి భారీ స్థాయిలో 24 గంటల వ్యవధిలోనే అతి భారీ వర్షం కురిసిందని, వరదలు, చెరువులు పొంగిపొర్లడంతో రోడ్లు దెబ్బతిన్నాయని, కాలనీలు ముంపునకు గురయ్యాయని, ప్రజలకు తీవ్రస్థాయిలో ఆస్తినష్టం జరిగిందని సీఎస్ ఆ బృందానికి వివరించారు. చేతికందాల్సిన పంట నీట మునిగిందని, రైతులు కోలుకోలేనంతటి నష్టానికి గురయ్యారని చెప్పారు. పంటల నష్టమే రూ. 8,633 కోట్లు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని వివరించారు. జీహెచ్ఎంసీ రోడ్లతోపాటు రాష్ట్ర, జాతీయ రహదారులు కూడా దెబ్బతిన్నాయని, కొన్నిచోట్ల కోతకు గురయ్యాయని, ఈ నష్టం సుమారు రూ. 222 కోట్లు ఉండవచ్చని రోడ్లు-భవనాల శాఖ ప్రాథమిక స్థాయిలో అంచనా వేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు రూ.567 కోట్ల మేర నష్టం జరిగినట్లు జీహెచ్ఎంసీ, పట్టణాభివృద్ధి శాఖ అంచనా వేసినట్లు తెలిపారు.
సహాయక చర్యలు చేపట్టాం
ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ. 550 కోట్లను విడుదల చేసిందని సీఎస్ కేంద్ర బృందానికి వివరించారు. బాధిత కుటుంబాలకు తలా రూ.10 వేల చొప్పున నగదు అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు రెండు లక్షల మందికి సహాయక చర్యలు చేపడుతూనే, ఆహార పొట్లాలను అందజేసినట్లు వివరించారు. సురక్షిత తాగునీటి కోసం మూడు లక్షల క్లోరిన్ టాబ్లెట్లు, బ్లీచింగ్ పౌడర్‌ను అందించినట్లు తెలిపారు. నగర పరిధిలోనే 15 విద్యుత్ సబ్ స్టేషన్లు నీళ్లలో మునిగిపోయాయని, రెండు రోజుల వ్యవధిలోనే సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. శివారు ప్రాంతాల్లో కూడా తీవ్రమైన నష్టం జరిగిందని తెలిపారు. గడచిన పది రోజుల్లో జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకోవంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు తక్షణం అందించాల్సిన సేవల్లో మాత్రం అన్ని విభాగాలు సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు వివరించారు.
కొనసాగుతున్న విరాళాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం సమీక్ష నిర్వహించి సుమారు రూ.5000 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశారు. కేంద్రం తక్షణ సాయంగా రూ.1,350 కోట్లను అందజేయాల్సిందిగా ప్రధానిని కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉదారంగా విరాళాలు ఇవ్వాల్సిందిగా స్వయంగా ముఖ్యమంత్రి పిలుపు ఇవ్వడంతో రెండు రోజుల వ్యవధిలో సినిమా, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖుల నుంచి సుమారు రూ. 60 కోట్లకు పైగా సమకూరాయి. ఇప్పటికీ విరాళాలు వస్తూనే ఉన్నాయి.