దొంగతనానికి వచ్చి వ్యక్తి పై హత్యాయత్నానికి పాల్పడిన దుండగులు..

by Sumithra |   ( Updated:2024-09-18 10:56:53.0  )
దొంగతనానికి వచ్చి వ్యక్తి పై హత్యాయత్నానికి పాల్పడిన దుండగులు..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : దొంగతనానికి వచ్చి వ్యక్తి పై చాకుతో దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు పారిపోయిన సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తాండ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట మండలం బంజారా తండా గ్రామానికి చెందిన దారావత్ మోహన్, దారావత్ నిర్మల అనే భార్యాభర్తలిద్దరూ పిల్లలతో కలిసి మంగళవారం తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో అర్ధరాత్రి వేళ ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దారావత్ మోహన్ ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. దొంగతనానికి వచ్చిన దుండగులకు ధరావత్ మోహన్, నిర్మలలు తమ ఇంట్లో ఉన్న బంగారాన్ని చూపించకపోవడంతో ధారావత్ మోహన్ మెడ పై చాకుతో బలంగా దాడి చేసి గాయపరిచారని తెలిపారు.

గాయపడిన మోహన్ ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. తన భర్త పై దుండగులు దాడికి పాల్పడడంతో భయపడిన నిర్మల ఇంటి ముందు ఉన్న వినాయక మండపం వద్ద ఉన్న యువకులకు వెళ్లి చెప్పిందని తెలిపారు. దుండగులు దారావత్ మోహన్ భార్య నిర్మల మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం, గొలుసుతో పాటు, బీరువాలో ఉన్న ఏడు తులాల బంగారం దోచుకొని పరారైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్ నాయక్, స్థానిక పోలీసులు చేరుకొని డాగ్ స్క్వాడ్ ను రప్పించి విచారణ చేపట్టారు. దొంగతనానికి పాల్పడినవారి వేలిముద్రలు సేకరించి ధరావత్ మోహన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed