డిప్యూటీ తహశీల్దార్ వేధింపులతో రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య..

by Sumithra |
డిప్యూటీ తహశీల్దార్ వేధింపులతో రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య..
X

దిశ, కామారెడ్డి : డిప్యూటీ తహశీల్దార్ వేధింపులు భరించలేక తాడ్వాయి తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే రికార్డు అసిస్టెంట్ ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన తెడ్డు ప్రశాంత్ (30) గతంలో వీఆర్ఏగా పని చేసేవాడు. అయితే గత సంవత్సరం ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థ రద్దు చేయడంతో పాటు అర్హతలను బట్టి వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. అందులో భాగంగా ప్రశాంత్ తాడ్వాయి మండల కార్యాలయంలో రికార్డు అసిస్టెంటుగా 11 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ప్రతిరోజు గూడెం నుంచి తాడ్వాయికి ద్విచక్రవాహనం పై వెళ్లి విధులు ముగించుకుని రాత్రి 8-9 గంటల మధ్య ఇంటికి చేరుకునేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం విధులకు వెళ్తున్నానని భార్యకు చెప్పి ద్విచక్రవాహనం పై ఇంటి నుంచి ఉదయం 9:30 గంటలకు బయలు దేరాడు. రాత్రి 9 అయినా ప్రశాంత్ ఇంటికి రాకపోయేసరికి భార్యలత ప్రశాంత్ కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.

చాలా సార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో బంధువులకు ఫోన్ చేసినా రాలేదని సమాధానం రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే మృతుడు ప్రశాంత్ చిన్నాన్న దేవునిపల్లి ఎస్సైకి సమాచారం అందించడంతో లొకేషన్ ఆధారంగా కన్నాపూర్ శివారులో ఉన్నట్టుగా గుర్తించి అక్కడికి వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. అయితే తాడ్వాయి డిప్యూటీ తహశీల్దార్ వెంకటేష్ వేధింపులు ఎక్కువయ్యాయని అప్పుడప్పుడు తనతో చెప్పేవాడని భార్య లత తెలిపింది. డిప్యూటీ తహశీల్దార్ వేధింపులు భరించలేకనే ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. మరోవైపు చనిపోయే ముందు డిప్యూటీ తహశీల్దార్ వెంకటేష్ వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ప్రశాంత్ సూసైడ్ నోట్ రాసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆ సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్ లో ఏం రాసింది అనే వివరాలు పోలీసులు గోప్యంగా ఉంచారు. జిల్లా ఆస్పత్రికి కామారెడ్డి డీఎస్పీ చేరుకుని వివరాలు సేకరించారు.

ఇద్దరు ఆడపిల్లలు.. 23 రోజుల బాబు

అయితే ప్రశాంత్ కు ఇద్దరు కూతుళ్లు కాగా ఇటీవలే కొడుకు జన్మించాడు. రెండు రోజుల క్రితమే కొడుకు బారసాల కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఆరేళ్ళ క్రితం పాల్వంచ మండలం ఎల్పుగొండ గ్రామానికి చెందిన లతతో ప్రశాంత్ కు వివాహం కాగా వీరికి ఇద్దరు కూతుళ్లు ఐదేళ్ల ఆద్య, మూడేళ్ళ విధాత్రి, ఒక కుమారుడు ఉన్నారు. ప్రశాంత్ ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు పుట్టిన సంతోషం కూడా ఇంట్లో లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Next Story

Most Viewed