బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి దారుణ హత్య

by Sridhar Babu |   ( Updated:2024-09-21 16:11:16.0  )
బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి దారుణ హత్య
X

దిశ,ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగించి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ ఫణిధర్, మావల ఎస్సై విష్ణు వర్ధన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై తోటి విద్యార్థులను అడిగి ఆరా తీశారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, తోటి స్నేహితుల కథనం ప్రకారం.. నార్నూర్‌ మండలంలోని చోర్‌గావ్‌కు చెందిన రాథోడ్‌ ధన్‌సింగ్‌, మీరాబాయి దంపతుల మూడవ కుమారుడు రాథోడ్‌ జితేందర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహంలో ఉంటూ రిమ్స్‌ ఆసుపత్రిలో బీఎస్సీ ఓటీటీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి వసతి గృహానికి జితేందర్‌ స్నేహితుడు రావడంతో ఆయనతో కాసేపు బయటకు వచ్చి మాట్లాడాడు.

అనంతరం జితేందర్‌ వసతి గృహం లోపలికి వెళ్తున్న క్రమంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారు వసతి గృహం ప్రధాన గేటు వద్ద ఉండి పిలిచారు. వారి వద్దకు వెళ్లేందుకు జితేందర్‌ నిరాకరించాడు. దాంతో బలవంతంగా జితేందర్‌ను కొందరు వ్యక్తులు తీసుకొని వసతి గృహం ఎదురుగా నిర్మాణంలో ఉన్న సమీకృత బీసీ భవనంపైకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం సేవించాలని వారు బలవంతం చేయగా జితేందర్ నిరాకరించాడు. దీంతో వారు ఆయనకి బలవంతంగా మద్యం తాగించి ఆ సీసాతో మృతుని ఛాతి, తలపై, కాళ్లపై, శరీర భాగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కాగా జరిగిన సంఘటన మొత్తాన్ని తనకు జితేందర్‌ ఫోన్‌ ద్వారా తెలిపాడని ఆయన బంధువు నగేష్‌ తెలిపారు. అక్కడికి చేరుకుని చికిత్స కోసం ముందుగా జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.

మెరుగైన వైద్యం కోసం శనివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించినట్టు చెప్పాడు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. వసతిగృహం వార్డెన్, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. తన కొడుకు జితేందర్ కు బలవంతంగా మద్యంలో పురుగుల మందు కలిపి తాగించి దాడి చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. దీంతో పోలీసులు ఆదిలాబాద్ ఆర్డీఓ వినోద్ కుమార్ కు విషయం తెలియజేశారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడారు. ఆందోళనకారులను శాంతింపచేశారు. కాగా ఈ సంఘటనపై విచారణ చేపడుతున్నామని, నిందితులను త్వరలో పట్టుకొని అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed