ఐపీఎస్, ఆర్మీ ఆఫీసర్ ను అంటూ లక్షలు దోచిండు.. చివరికి ఏమైందంటే..?

by Javid Pasha |   ( Updated:2023-05-26 03:26:44.0  )
ఐపీఎస్, ఆర్మీ ఆఫీసర్ ను అంటూ లక్షలు దోచిండు.. చివరికి ఏమైందంటే..?
X

దిశ తెలంగాణ బ్యూరో/శేరిలింగంపల్లి: నకిలీ ఐపీఎస్ ​అవతారమెత్తి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని శంషాబాద్ ​జోన్ ​ఎస్వోటీ అధికారులు మాదాపూర్​ పోలీసులతో కలిసి మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుని నుంచి 7.65 దేశవాళీ పిస్టల్, 9 బుల్లెట్లతో పాటు నాలుగు మ్యాన్​ ప్యాక్​లు, ఐపీఎస్ ​అధికారుల యూనిఫాంపై ఉండే చిహ్నాలు, తెలంగాణ, ఢిల్లీ పోలీసు అధికారి పేరిట తయారు చేసుకున్న ఏడు గుర్తింపు కార్డులతోపాటు పదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్​ ఇన్​ఛార్జ్ ​డీసీపీ శ్రీనివాస్​రావు బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ​రాష్ర్టం భీమవరం జిల్లా చిక్కాల గ్రామానికి చెందిన నాగరాజు కార్తిక్ రఘువర్మ ఎలియాస్​ కార్తిక్​(25)కు చిన్నప్పటి నుంచి పోలీస్​ కావాలన్నది కల. భీమవరంలోని ఎస్ఆర్కే కాలేజీ నుంచి 2016లో బీఏ పూర్తి చేసిన కార్తిక్​ ఆ తరువాత హైదరాబాద్​ వచ్చాడు. సనత్​నగర్​లోని పాషా ట్రావెల్స్​లో డ్రైవర్​గా పని చేస్తూ పోలీస్​ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు రాశాడు. అయితే పరీక్షల్లో అర్హత సాధించలేకపోయాడు. ఆ తరువాత ట్రావెల్స్​కు చెందిన ఇన్నోవా కారుతో ఉడాయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సనత్ నగర్​ పోలీసులు కార్తిక్​ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆరునెలల తరువాత బెయిల్​పై బయటకు వచ్చిన కార్తిక్​ కొన్నాళ్లపాటు మహారాష్ర్టలో బోర్​వెల్​ ఆపరేటర్​గా ఉద్యోగం చేశాడు.

2018లో హైదరాబాద్​ తిరిగి వచ్చి వరిస్టా ఇన్ఫోకామ్​ కంపెనీ యజమాని రాధాకృష్ణ వద్ద కారు డ్రైవర్​గా ఉద్యోగంలో చేరాడు. మూడు నెలల తరువాత యజమానికి చెందిన కారుతో ఉడాయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు రిమాండ్ ​చేశారు. మళ్లీ బెయిల్​పై వచ్చిన కార్తిక్​ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్​లో ఉన్న ఎక్స్​పర్ట్​ సెక్యూరిటీ సర్వీసెస్​లో గార్డుగా చేరాడు. అక్కడ కార్తిక్​కు మాజీ ఆర్మీ అధికారి బిక్కుదర్​ దాస్​తో పరిచయం ఏర్పడింది. ఇలా పరిచయమైన దాస్​ నుంచి ఆర్మీ ఆఫీసర్ల ర్యాంకులు, యూనిఫాం, వాళ్లు ధరించే బ్యాడ్జీలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు. అనంతరం పారస్​ఎఫ్​ రెజిమెంట్​ మేజర్​ ర్యాంకులో యూనిఫాం తయారు చేయించుకున్నాడు.

స్వస్థలానికి వెళ్లి..

ఆ తరువాత స్వస్థలానికి వెళ్లి బంధువులు, స్నేహితులతో తాను పారస్​ఎఫ్​ రెజిమెంట్​కు మేజర్​గా సెలెక్ట్ ​అయినట్టు చెప్పుకొన్నాడు. అనంతరం సైనిక్ ​డిఫెన్స్​ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి స్థానిక యువకుల నుంచి డబ్బు వసూలు చేస్తూ ట్రైనింగ్​ ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన పోడూర్ ​పోలీసులు విచారణ జరుపగా కార్తిక్ ​నకిలీ ఆఫీసర్​ అని వెల్లడైంది. దాంతో అతనిపై కేసులు పెట్టిన పోడూర్​ పోలీసులు జైలుకు రిమాండ్​ చేశారు. ఆ తరువాత కొన్నాళ్లకు కార్తిక్​బెయిల్​పై విడుదలయ్యాడు.

2020లో మళ్లీ హైదరాబాద్​కు

2020లో హైదరాబాద్​కు తిరిగొచ్చిన కార్తిక్​ ఆర్థికంగా స్థిరపడ్డ మధుసూదన్​రావు అనే వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజాలని పథకం వేశాడు. ముగ్గురు సహచరులతో కలిసి బంజారాహిల్స్​లోని మధుసూదన్​రావు వద్దకు వెళ్లి తమను తాము ఇంటెలిజెన్స్ ​విభాగానికి చెందిన పోలీసు అధికారులుగా పరిచయం చేసుకున్నాడు. మధుసూదన్​రావు ఇంట్లో సోదాలు జరిపినట్టు నటించి లక్ష రూపాయలతో ఉడాయించాడు. ఈ మేరకు పంజగుట్ట స్టేషన్​లో కార్తిక్​తోపాటు అతని సహచరులపై కేసులు నమోదయ్యాయి.

కిడ్నాప్​లు

ఆ తరువాత కార్తిక్ ​తన సహచరులతో కలిసి శ్రీసాయి అంబులెన్స్​ సర్వీసెస్​ యజమాని శ్రీనివాస్​ ముదిరాజ్​ ఆయన కుమారుడు సాయి నిఖిల్​ను కిడ్నాప్ ​చేశాడు. తమను తాము ఇంటెలిజెన్స్​ అధికారులమని చెప్పి వారి నుంచి యాభైవేల రూపాయలు తీసుకుని విడిచిపెట్టాడు. ఈ మేరకు బాధితులు ఫిర్యాదు చేయగా ఆర్సీపురం పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు. ఆ తరువాత తనను తాను ఆర్మీ కల్నల్​గా చెప్పుకొన్న కార్తిక్​ మియాపూర్​ మదీనాగూడలో ఐ హెల్త్​కేర్​ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా కూడా హాజరయ్యాడు. దీనికోసం ఆస్పత్రి యాజమాన్యం నుంచి లక్షా 30వేల రూపాయలు కూడా తీసుకున్నాడు. వచ్చింది నకిలీ ఆఫీసర్​ అని తెలిసి ఆస్పత్రి వర్గాలు ఫిర్యాదు చేయగా మియాపూర్ ​స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి.

ఆ తరువాత తనకు పరిచయం ఉన్న అనిల్​కుమార్​ అనే వ్యక్తి చెప్పిన మేరకు సహచరులైన దీపక్​కుమార్, పైలా స్వామి సత్యనారాయణతో కలిసి తమను తాము పోలీసు అధికారులుగా చెప్పుకొని కూకట్​పల్లిలోని ఫోరం మాల్​ వద్ద నుంచి దిలీప్​కుమార్ ​అనే వ్యక్తిని కారులో కిడ్నాప్ ​చేశాడు. అతన్ని సూర్యాపేట బస్టాండ్ ​వద్దకు తీసుకెళ్లి దేశవాళీ పిస్టల్​తో బెదిరించి దగ్గరున్న లక్షా 90వేల రూపాయల నగదును దోచుకుని అక్కడే విడిచిపెట్టి పరారయ్యాడు. ఈ మేరకు కేపీహెచ్బీ స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కార్తిక్​ను అరెస్టు చేసిన కేపీహెచ్బీ పోలీసులు పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్​ చేశారు.

విడుదలైన తరువాత

2022, జూలైలో జైలు నుంచి విడుదలైన తరువాత కార్తిక్​ స్వస్థలానికి వెళ్లిపోయాడు. అక్కడ ఓ సెక్స్​ వర్కర్​ను తాను రాజమండ్రి పోలీస్ ​స్టేషన్​ సర్కిల్​ ఇన్స్​పెక్టర్​నని బెదిరించి 50వేల రూపాయలను దోచుకున్నాడు. గంజాయి స్మగ్లింగ్​ దందాలో ఉన్న శివ అనే వ్యక్తిని ఓ హోటల్​కు తీసుకెళ్లి గదిలో నిర్భంధించి తాను పోలీస్​అధికారినని చెప్పి ఇంటరాగేషన్ ​పేర చిత్రహింసలు పెట్టాడు. అతని నుంచి 30వేలు తీసుకుని వదిలిపెట్టాడు. ఆ తరువాత రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏలూరుకు చెందిన పలువురిని మోసం చేసిన మేకపాటి రవిశంకర్​ను పట్టుకుని తనను తాను పోలీసు అధికారిగా చెప్పుకొని 2లక్షలు తీసుకున్నాడు.

అంతటితో ఆగకుండా న్యాయం చేసి డబ్బులు వాపసు ఇప్పిస్తానని బాధితులను నమ్మించి వారి నుంచి మరో 3లక్షల 70వేల రూపాయలు తీసుకున్నాడు. ఆ తరువాత రవిశంకర్​కుటుంబసభ్యులను కలిసి అతను మోసం చేసిన వారు చంపాలని చూస్తున్నట్టు చెప్పాడు. ఎలాగైనా కాపాడాలని వాళ్లు కోరగా డబ్బు తీసుకుని రవిశంకర్​ను ఎన్​కౌంటర్ ​చేసినట్టు డ్రామా ఆడి దానిని వీడియో రికార్డింగ్​ చేసి అతని చేతుల్లో మోసపోయిన వారికి చూపించాడు.

జైలు పరిచయంతో

జైల్లో ఉన్నపుడు పరిచయం అయిన యశ్వంత్ ​అనే ఖైదీ మిత్రుడు పాశ్వాన్​ను కలిసిన కార్తిక్​ అతను ఇచ్చిన సమాచారం మేరకు జనవరిలో జార్ఖండ్​ రాష్ర్టం కుండా గ్రామానికి వెళ్లి దేశవాళీ పిస్టల్, బుల్లెట్లు కొని తిరిగి వచ్చాడు. మార్చిలో పోలీస్​ యూనిఫాం, బ్యాడ్జీలు, వాకీటాకీ, పోలీస్​ ఫ్లాష్​లైట్​ తదితర వాటిని మదీనా ప్రాంతంలో కొనుగోలు చేశాడు. దాంతోపాటు చేతులకు వేసే సంకెళ్లు, లాఠీలు, పిస్టల్​ పౌచ్ తదితర వాటిని కూడా కొన్నాడు. ఆ తరువాత కుమార్​ అనే వ్యక్తి చెప్పాడని ప్రసాద్ ను ఇన్స్​పెక్టర్​నని బెదిరించాడు. నీపై ఫిర్యాదులు ఉన్నాయని, చర్యలు తీసుకోకుండా ఉండాలంటే 14లక్షలు ఇవ్వాలని డిమాండ్​చేశాడు.

చివరకు 30వేల రూపాయలు తీసుకున్నాడు. ఇంటెలిజెన్స్ ​ఆఫీసర్లమంటూ సహచరులైన శ్రీశైలం, స్వామిలతో కలిసి గాంధీనగర్​లో నివాసముంటున్న గోస్లా జ్యోత్స్నను కిడ్నాప్​ చేసి జార్ఖండ్ ​రాష్ర్టం దేవ్​ఘడ్ ​తీసుకెళ్లి 9లక్షల రూపాయలు వసూలు చేశాడు. రద్దీగా ఉండే బస్టాపులు, ఎయిర్​పోర్టు, పబ్లిక్​స్థలాల్లో మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తిరుగుతూ తనను తాను ఎస్వోటీ అధికారినని బెదిరిస్తూ పలువురి నుంచి డబ్బు వసూలు చేసేవాడు. కార్తిక్​ గురించిన సమాచారాన్ని పక్కాగా సేకరించిన శంషాబాద్​ ఎస్వోటీ, మాదాపూర్​పోలీసులు కలిసి మంగళవారం రాత్రి అతన్ని అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed