Breaking News... అమెజాన్ గోదాంపై దాడులు.. వేలల్లో నకిలీ ఉపకరణాల స్వాధీనం

by M.Rajitha |
Breaking News... అమెజాన్ గోదాంపై దాడులు.. వేలల్లో నకిలీ ఉపకరణాల స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్ : అమెజాన్(Amezon) లో భారీగా నకిలీ వస్తువులు, ఉపకరణాలు పట్టుబడటం నగరంలో(Hyderabad) కలకలం సృష్టించింది. బీఐఎస్ ధ్రువీక‌రించిన ఐఎస్ఐ మార్కు, రిజిస్ట్రేష‌న్ మార్కు లేని ఉత్పత్తుల‌ను నిల్వ చేశార‌న్న స‌మాచారంతో బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (BIS) హైద‌రాబాద్ శాఖ అధికారులు బుధవారం అమెజాన్ గోదాముల‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ పొంద‌ని గృహోప‌క‌ర‌ణాలు, సాంకేతిక ఉప‌క‌ర‌ణాల‌ను గుర్తించి సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్ శాఖాధిప‌తి పీవీ శ్రీకాంత్ ఆదేశాల‌తో హైద‌రాబాద్ ప‌రిధిలోని ఎయిర్‌పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంలో మంగ‌ళ‌వారం బీఐఎస్ అధికారులు త‌నిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో భాగంగా దాదాపు రూ.50 ల‌క్షల పైగా విలువైన 2783 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ లేద‌ని గుర్తించిన‌ట్లు తెలిపారు. ఐఎస్ఐ మార్క్‌, రిజిస్ట్రేష‌న్ మార్కులేని ఉత్పత్తుల‌ను జ‌ప్తు చేసిన‌ట్లు వెల్లడించారు.150 స్టార్ట్ వాచ్‌లు, 15 ఎల‌క్ట్రిక్ వాట‌ర్ హీట‌ర్లు, 30 సీసీటీవీ కెమెరాలు, 16 మిక్సర్లు, 10 ప్రెజ‌ర్ కుక్కర్లు, 1937 స్టెయిన్ లెస్ స్టీల్ వాట‌ర్ బాటిళ్లు, 326 వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌, 170 మొబైల్ ఛార్జర్లు, 90 ఆట బొమ్మలు, ఇత‌ర గృహోప‌క‌ర‌ణాలను జ‌ప్తు చేసి కేసు న‌మోదు చేయ‌నున్నట్లు అధికారులు వెల్లడించారు.

బీఐఎస్ చ‌ట్టం 2016లోని ప‌లు సెక్షన్ 17 ప్రకారం భార‌త ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ త‌ప్పనిస‌రి చేసిన ఉత్పత్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులకు రిజిస్ట్రేష‌న్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమ‌తి పొంద‌కుండా త‌యారు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా రెండేళ్ల జైలు శిక్ష, రూ.2ల‌క్షల జ‌రిమానా మొద‌టిసారి.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5ల‌క్షల వ‌ర‌కూ జ‌రిమానా రెండోసారి.. త‌దుప‌రి దీనికి ప‌దిరెట్ల వ‌ర‌కూ శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది. ఇప్పటివ‌ర‌కు భార‌త ప్రభుత్వం 679 ఉత్పత్తుల‌ను త‌ప్పనిస‌రి చేస్తూ ప‌లు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు విడుద‌ల చేసింది. వీటిని ఎవ‌రు ఉల్లంఘించినా క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవ‌ని బీఐఎస్ హైద‌రాబాద్ శాఖాధిప‌తి పీవీ శ్రీకాంత్ వెల్లడించారు. భార‌తీయ ప్రమాణాల‌పై ప్రతీ ఒక్క వినియోగ‌దారుడూ అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని, బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వ‌స్తువుల నాణ్యతా ప్రమాణాలను గుర్తించాల‌ని, ఉల్లంఘ‌న‌ల‌ను గుర్తిస్తే అదే యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాల‌ని కోరారు. ఈ దాడుల్లో బీఐఎస్ హైద‌రాబాద్ శాఖ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ త‌న్నీరు, డిప్యూటీ డైరెక్టర్ కెవిన్‌, ఎస్పీవో అభిసాయి ఇట్ట‌, జేఎస్ఏ శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Next Story