- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సినిమాను తలపించే క్రైం స్టోరీ: పరువు పోయిందని హత్యకు కుట్ర.. దూలపల్లి యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు ..
దిశ, పేట్ బషీరాబాద్: తన సోదరికి దూరంగా ఉండమని హెచ్చరించినప్పటికీ వినకుండా ఏకంగా సోదరిని ఎత్తుకెళ్లి తమ కుటుంబ పరువు తీశాడనే కక్షతో యువకుడిని దారుణంగా హత్య చేసిన ఉదాంతంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పేట్ బషీరాబాద్ సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ ఎంసీహెచ్ కాలనీకి చెందిన ఓ యువతి, కుత్బుల్లాపూర్ సూరారం మైత్రినగర్ కాలనీకి చెందిన దేవరకొండ హరీష్ కుమార్ (28)లు కొన్నాళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.
వీరు ఇంస్టాగ్రామ్ లో చాట్ చేసుకుంటుండగా యువతి సోదరుడు దీన్ దయాల్ గమనించి సోదరిని, హరీష్ కుమార్ లను హెచ్చరించాడు. దీంతో హరీష్ ముందుగా ఇకపై యువతికి దూరంగా ఉంటానని హామీ ఇచ్చాడు. కానీ దీన్ దయాళ్ సోదరి హెచ్చరికలను ఖాతరు చేయకుండా యధావిధిగా హరీష్ తో ఫోన్ లో మాట్లాడటం, కలవడం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు తమ పెళ్లికి ఒప్పుకోరని భావించి ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
స్నేహితుడి హామీతో..
అంతకు ముందు వరకు డీజే ఆపరేటర్ గా, డ్రైవర్ గా పనిచేస్తూ వచ్చిన హరీష్ ప్రేమ వివాహం చేసుకోవాలని ఉద్దేశంతో తన మకాన్ని, ఉనికిని మార్చుకునేందుకు తన స్నేహితుడైన మాధంగి రాజేంద్ర కుమార్ ను సంప్రదించాడు. స్నేహితుడు ఇచ్చిన హామీతో దూలపల్లిలో ఉన్న ఓ వెంచర్ లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం పొందాడు. అతని సహకారంతోనే అదే వెంచర్ లో హరీష్, యువతి కలిసి ఉండేందుకు తెలిసిన వారి ద్వారా ఏర్పాటు చేశాడు. దీంతో ఫిబ్రవరి 27వ తేదీన హరీష్ తాను ప్రేమించిన యువతితో దూలపల్లికి వచ్చి ఉద్యోగంలో చేరి అక్కడే ఉంటున్నాడు.
పోలీసులమంటూ ఫోన్ చేసి..
అయితే యువతి సోదరుడు దీమ్ దయాల్ తన స్నేహితులతో కలిసి సోదరి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రయత్నంలో భాగంగా హరీష్ యొక్క ప్రాణ స్నేహితుడు అయినా రాజేంద్రకుమార్ వివరాలు తెలుసుకున్నాడు. తన స్నేహితుడైన బ్యాండ్ వెంకట్ ఫోన్ నుంచి రాజేంద్ర కుమార్ కు ఫోన్ చేయించి తాము పోలీసులం అంటూ బెదిరించి హరీష్ కుమార్ గురించి తెలుసుకున్నాడు. ఇంకా పూర్తి వివరాలు కావాలని అందుకు కలవాలని ఫోన్ లో తెలుపగా రాజేంద్రకుమార్, మరో మహిళ నవనీత లు బోయిన్ పల్లి హస్మత్ పేటలో దీమ్ దయాల్, బ్యాండ్ వెంకట్ లను మార్చి 1వ తేదీన కలిశారు. హరీష్ కుమార్ తన సోదరిని తీసుకెళ్లాడని వారి ఆచూకీ తెలుసుకోవడానికి సహకరించాలని దీమ్ దయాల్ వారిని అభ్యర్థించాడు. దీంతో రాజేంద్ర కుమార్ హరీష్ కుమార్ యొక్క ఆచూకీ చెప్పి వారికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు.
పథకం ప్రకారం దారుణంగా హత్య..
తన సోదరిని ఎత్తుకెళ్లి కుటుంబం పరువు తీసిన హరీష్ కుమార్ ను ఎలాగైనా అంతమొందించాలని ముందు నుంచే పథకం ప్రకారం తన ఇంటిలో ఉన్న మూడు కత్తులను పదును పెట్టి మరీ బాత్ రూంలో సిద్ధంగా ఉంచాడు. రాజేంద్ర కుమార్ ఆచూకీ చూపిస్తానని హామీ ఇవ్వడంతో దీమ్ దయాల్ తన స్నేహితులైన త్రిముఖి నరేష్, పొట్ల చెరువు వెంకటేష్ గౌడ్, రోహిత్ సింగ్, అక్షయ్ కుమార్, అనికేత్, కోయల్కర్ మనీష్ లను తాను బాత్ రూంలో దాచి ఉంచిన కత్తులను తీసుకొని దూలపల్లికి రావలసిందిగా సూచించాడు. ఈ మధ్య సమయంలో బ్యాండ్ వెంకట్ తో కలిసి దీమ్ దయాల్ దూలపల్లిలో ఉన్న చంద్ర వైన్స్ లో మద్యం సేవిస్తూ గడిపారు.
ఫాస్ట్ ఫుడ్ తిందామంటూ బయటకు రప్పించి..
పథకం ప్రకారం అందరూ ఒక చోటకు చేరిన అనంతరం హరీష్ కుమార్ ప్రాణ స్నేహితుడు అయినా మాధంగి రాజేంద్ర కుమార్, మరో మహిళా నవనీతలు హరీష్ పని చేస్తున్న వెంచర్ లోకి వెళ్లి అక్కడ వారిద్దరితో మాటలు మాట్లాడుతూ ఫాస్ట్ ఫుడ్ తిందామంటూ బయటకు తీసుకువచ్చారు. దూలపల్లి హనుమాన్ టెంపుల్ సమీపంలోకి రాగానే ముందుగా కాపు కాసి ఉన్న దీన్ దయాల్, అతని స్నేహితులు వారిని చుట్టుముట్టగా నవనీత, రాజేంద్ర కుమార్ లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోహిత్ సింగ్, మనీష్ లు దీన్ దయాల్ సోదరిని బలవంతంగా స్కూటీపై ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇదే సమయంలో త్రిముకే నరేష్ హరీష్ కుమార్ ను గట్టిగా పట్టుకోగా యువతి సోదరుడు దీన్ దయాల్, అతని స్నేహితులు వెంకటేష్ గౌడ్, పర్వారి అనికేత్ లు కత్తులతో హరీష్ పై విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
జనాలు గుమిగూడడంతో అందరూ సిద్ధంగా ఉన్న ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు వందలాది సీసీ కెమెరాలు పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కనుగొన్నారు. హత్య అనంతరం నిందితులు సాక్షాధారాలను అదృశ్యం చేసే క్రమంలో వాటిని శుభ్రంగా కడిగి మరో నిందితుడైన సాయినాథ్ కు అప్పగించారు. అనంతరం జియాగూడలో నే ఓ గదిలో ఆశ్రయం పొందిన 8 మంది నిందితులతో పాటు, హరీష్ ఆచూకీ చూపించేందుకు సహకరించిన రాజేంద్ర కుమార్ నవనీతలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు అంటూ ఫోన్ చేయటానికి సహకరించిన మరో నిందితుడు బ్యాండ్ వెంకట్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
హత్య చేసిన వారిలో 20 నుంచి 22 సంవత్సరాల యువకులే..
ఇక హత్యలో పాల్గొన్న నిందితులు అందరూ 20 నుంచి 22 వయసు కలిగిన యువకులే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ప్రధాన నిందితుడు దీందయాల్ (22), అతని స్నేహితులైన త్రిముఖి నరేష్ (20), పొట్లచెరువు వెంకటేష్ గౌడ్ (20), రోహిత్ సింగ్ (20), గడ్డం అక్షయ్ కుమార్ (22), అనికేత్ (21), మనీష్ (23), సాయినాథ్ (21) లు ఉన్నారు.