సంచలన ఘటన.. ప్రియుడిని ముక్కలుగా నరికి చంపిన మాజీ ప్రియురాలు!

by Satheesh |   ( Updated:2023-04-04 11:25:57.0  )
సంచలన ఘటన.. ప్రియుడిని ముక్కలుగా నరికి చంపిన మాజీ ప్రియురాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ మర్డర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రియురాలు శ్రద్ధాను ఆమె ప్రియుడు అప్తాబ్ దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి పలుచోట్ల పారేశాడు. తాజాగా.. ఇదే తరహా ఘటన చెన్నైలో ఆలస్యంగా వెలుగు చూసింది. కానీ ఇక్కడ ప్రియుడుని అతడి మాజీ ప్రియురాలే హతమార్చి.. అతడి శరీరాన్ని ముక్కలుగా చేసి పలుచోట్ల పాతిపెట్టింది.

పోలీసుల వివరాల ప్రకారం.. చైన్నైకు చెందిన భాగ్యలక్ష్మి, జయనంతన్ గతంలో ప్రేమించుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇటీవల విడిపోయారు. కాగా, జయనంతన్ చెన్నై ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, ఉన్నట్టుండి గత నెల మార్చి 18వ తేదీ నుండి జయనంతన్ కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జయనంతన్ చివరగా అతడి మాజీ ప్రియురాలు భాగ్యలక్ష్మితో మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. జయనంతన్‌ను తానే హత్య చేసినట్లు తమ దర్యాప్తులో భాగ్యలక్ష్మి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య వివాదం జరగడంతో జయనంతన్‌ను హత్య చేసిన భాగ్యలక్ష్మి.. ప్రియుడి శరీరాన్ని ముక్కలు చేసి పలుచోట్ల పాతిపెట్టినట్లు తెలిపిందని పోలీసులు వెల్లడించారు. దీంతో మృతుడి మాజీ ప్రియురాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటన చెన్నైలో సంచలనంగా మారింది.

Advertisement

Next Story