లాక్‌డౌన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు

by Shyam |
లాక్‌డౌన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు
X

దిశ, వరంగల్: కరోనా వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‎ను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. ఈ ఉత్తర్వులను అనుసరించి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, టాక్సీలు, ఆటో రిక్షాలాంటి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించామన్నారు. అదే విధంగా నిత్యవసర వస్తువులను తరలించే వాహనాలకు ఈ నిబంధన వర్తించదన్నారు. అదే విధంగా మెడికల్, కిరాణం, పండ్లు కూరగాయలు, పాలకేంద్రాలు మినహాయించి మిగతా అన్నిరకాల వ్యాపార సంస్థలు, వ్యాపార సముదాయాలు, మల్టీప్లెక్సులు విధిగా మూసివేయాలన్నారు. ముఖ్యంగా ఈ నెల 31 సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలులో వుంటుందన్నారు. ఈ సమయంలో మెడికల్ దుకాణాలు తప్ప మిగతా అన్నిరకాల షాపులను తెరవడంపై పూర్తి నిషేదం ఉంటుందని చెప్పారు. ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వారి వారి ఇండ్లకు పరిమితం కావాల్సి వుంటుందన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి వారిని హోం క్యారంటైన్లో వుంచుతున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం పోస్ట్ చేసే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

tag:cp Ravindra, warned, Strict action, lockdown, warangal

Advertisement

Next Story

Most Viewed