ఫ్రీ క్వారంటైన్.. పేదలకు ఉచితంగా కొవిడ్​ సేవలు

by Shyam |   ( Updated:2021-05-03 11:58:44.0  )
ఫ్రీ క్వారంటైన్.. పేదలకు ఉచితంగా కొవిడ్​ సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ కష్టకాలంలో పేదలకు అండగా ఉండేందుకు సీపీఐ(ఎం) ముందుకొచ్చింది. కరోనా లక్షణాలు, పాజిటివ్​ కేసులతో ఇబ్బందులు పడుతున్న వారికి తగిన వైద్య సహాయంతో పాటు ఆర్థికంగా వెసులుబాటు కలిగించేలా ఉచిత క్వారంటైన్​ సేవలను అందించనుంది. ఇందుకోసం బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాట్లు చేసింది. కొవిడ్​లక్షణాలతో బాధపడే ఎవరైనా ఇక్కడ సర్వీసును ఉచితంగా పొందవచ్చు.

హైదారాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 25 బెడ్స్‌తో కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. కొవిడ్​లక్షణాలతో, ఇంటి వద్ద హోం ఐసోలేషన్​ ఉండలేని వారికి అండగా నిలిచేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సెంటర్‌లో ఎప్పుడూ నర్సులు అందుబాటులో ఉంటుండగా.. పది మంది వైద్యులు పర్యవేక్షిస్తుంటారు. వైద్య సహాయం అవసరమైన పేషంట్లు వర్చువల్​పద్ధతిలో డాక్టర్లను సంప్రదించి సలహాలు, మెడిసిన్స్‌పై సమాచారం పొందవచ్చు. ఇక్కడ చేరిన వారందరికీ ఉచితంగా భోజనం, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి అందిస్తారు. ఉచితంగానే బెడ్, మెయింటెనెన్స్, డాక్టర్ కన్సల్టెంట్ కూడా లభిస్తుంది. కొవిడ్​ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న వారికి అండగా ఉండేందుకు.. వారు ఇక్కడ చేరినప్పటి నుంచి వెళ్లిపోయేంత వరకూ వసతి, మెడిసిన్స్ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.

ఒక్కోక్కరికి రూ.10 వేలకు పైగానే..

కొవిడ్ ​ఐసోలేషన్ ప్రస్తుతం 14 రోజులు ఉంటుంది. ఈ కాలంలో భోజనం, మెడిసిన్స్, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్​వంటి వాటి కోసమే రూ.10 వేలు అవుతుందని అంచనా.. ఆస్పత్రిలో, ప్రైవేట్​హోటళ్లు వంటి వాటిలో ఉంటే రోజుకు రూం అద్దె, హౌజ్​కీపింగ్​అదనం. ఇక డాక్టర్లు, నర్సులు, మెడిసిన్స్​ కలుపుకుంటే ఈ మొత్తాన్ని భరించడం కూడా కష్టమే.. నగరంలో ఎక్కువగా ఉండే పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ భారాన్ని తప్పించేందుకు పూర్తిగా ఉచితంగా ఇస్తుండటంతో ఆ మేరకు వారికి ఖర్చును తప్పిస్తున్నారు. రానున్న కాలంలో బెడ్స్, సెంటర్ల సంఖ్య కూడా పెంచాలని భావిస్తున్నారు. పేదల కోసం ఉచితంగా నిర్వహిస్తున్న ఈ కొవిడ్​ఫ్రీ క్వారెంటైన్​సెంటర్​ కోసం స్వచ్ఛందంగా దాతలు తమ సహకారాన్ని కూడా అందించవచ్చు.

Advertisement

Next Story