పాజిటివ్ కేసులే కాదు.. రికవరీలూ పెరిగాయ్

by vinod kumar |   ( Updated:2021-04-24 07:25:46.0  )
పాజిటివ్ కేసులే కాదు.. రికవరీలూ పెరిగాయ్
X

దిశ, వెబ్‌‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రెండ్రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్యను చూసి దేశప్రజలతో పాటు ప్రపంచ దేశాలు సైతం నివ్వెరపోతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు అయితే ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్‌లో ప్రస్తుతం కొవిడ్ సునామీ కొనసాగుతోందని పలు కథనాలు సైతం వెలువడుతున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు సైతం దేశంలో నెలకొన్న ప్రస్తుతం పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, దేశంలో కేసుల పెరుగుదలతో పాటు రికవరీ సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. కాగా, ఈ విషయాన్ని ఎవరూ గమనించడం లేదు. కొవిడ్ అంటే భయం ఉండటంతో కేవలం పెరుగుతున్న కేసులను మాత్రమే పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. కొవిడ్ రూల్స్ జాగ్రత్తగా పాటిస్తే వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ దేశంలో అందుబాటులో ఉండటంతో త్వరగా ఈ విపత్తు నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. దేశంలో రోజుకు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తుంటే, అంతే వేగంగా రెండు లక్షలకు పైగా రోగులు కరోనా నుంచి కోలుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో 2,19,838 బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలోని పది రాష్ట్రాల్లో 82.94శాతం రికవరీ శాతం నమోదైంది. దేశంలో కేసులు మూడు లక్షలు దాటడానికి ఏ రాష్ట్రం అయితే దోహదం చేసిందో అదే మహారాష్ట్రలో వేగంగా రికవరీ శాతం పెరిగింది. కొవిడ్ బాధితులు కోలుకుంటున్న వారిలో మహారాష్ట్ర నెంబర్ వన్ (74,045) స్థానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ (23,572), ఉత్తరప్రదేశ్ (22,566), మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో 10 వేలకు పైగా రికవరీలు నమోదవుతున్నాయి.

Advertisement

Next Story