షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్: BCCI

by Shiva |
షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్: BCCI
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఆటగాళ్లకు కరోనా భయం పట్టుకున్నదా? బయోబబుల్‌లో ఉంటున్నా.. వైరస్ అంటుకుంటుందని ఆందోళనలో ఉన్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నది. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేనట్లు లీగ్ జరుగుతుండగానే ఆటగాళ్లు ఇంటి బాట పడుతున్నారు. ‘వ్యక్తిగత కారణాలు’ అంటూ పైకి చెబుతున్నా లోపల మాత్రం కరోనా భయంతోనే లీగ్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోతున్నట్లు తెలుస్తున్నది. ఐపీఎల్ తొలి విడత మ్యాచ్‌లు ఆదివారం ముగిసాయి. ఆ వెంటనే నలుగురు క్రికెటర్లు ఐపీఎల్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయా ఫ్రాంచైజీలు వారిని బలవంతంగా అయితే ఆపలేవు. ఆ క్రికెటర్లు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్న తర్వాత జట్టు యాజమాన్యాలు కూడా వారు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఇండియాలో ప్రతీ రోజు పెరుగుతున్న కరోనా కేసులు ఆ క్రికెటర్లను భయపెట్టాయని.. రెండో విడత మ్యాచ్‌ల కోసం ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయడం కంటే ఇంటికి వెళ్లిపోవడం మంచిదనే ఈ నిర్ణం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికి ఐదుగురు..

ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ‘తన కుటుంబంతో పాటు బంధువులు కరోనాతో బాధపడుతున్నారు. వారికి ఈ సమయంలో తగిన సహాయం అందించాలి. అందుకే తాను ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఢిల్లీ జట్టు రెండో విడత మ్యాచ్‌ల కోసం చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉన్నది. అయితే లోకల్ బాయ్ అశ్విన్.. బ్రేక్ తీసుకొని చెన్నైలోనే ఉండిపోయాడు. పరిస్థితులు అన్నీ సజావుగా సాగితే మళ్లీ ఐపీఎల్‌కు వస్తానని చెప్పాడు. అయితే బీసీసీఐ ప్రోటోకాల్ ప్రకారం బయోబబుల్ నుంచి బయటకు వెళ్తే.. తిరిగి రావాలంటే బోర్డు మెడికల్ బృందం అనుమతితో పాటు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. మే 30తో ఐపీఎల్ ముగియనున్న నేపథ్యంలో అశ్విన్ తిరిగి వస్తాడా అనేది అనుమానమే. ఇక ఆదివారం ఉదయమే రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఆండ్రూ టై కూడా జట్టును వీడి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడని ఫ్రాంచైజ్ తెలిపింది. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఐపీఎల్ నుంచి ఔట్ అయ్యారు. వాళ్లు సోమవారం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కినట్లు యాజమాన్యం తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆ ఇద్దరూ స్వదేశాలకు తిరుగుముఖం పట్టినట్లు చెబుతున్నారు.

ఏమిటీ వ్యక్తిగత కారణం?

ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలు బయటకు వెల్లడించకపోవడం మంచిదే. కానీ ఐపీఎల్ ప్రారంభానికి ముందే బయోబబుల్‌లో ఉండాల్సి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. సుదీర్ఘ కాలం బయోబబుల్‌లో ఉండలేకపోవడంతో పాటు కరోనా భయం కూడా ప్రధాన కారణం అని తెలుస్తున్నది. రాజస్థాన్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టన్ బయోబబుల్‌లో ఉండలేక వెళ్లిపోతున్నానని నేరుగా చెప్పాడు. తాజాగా, రెండో విడత మ్యాచ్‌ల కోసం ఇతర నగరాలకు వెళ్లే సమయంలోనే నలుగురు ఆటగాళ్లు ఐపీఎల్‌ను వీడారు. ఇండియాలో కేసులు పెరుగుతున్న సమయంలో ఇక్కడ ప్రయాణాలు చేయడం అంత సేఫ్టీ కాదనుకొని నేరుగా స్వదేశాలకు వెళ్లిపోయి ఉంటారని క్రికెట్ వర్గాలు కూడా భావిస్తున్నది. బబుల్ టూ బబుల్ మార్పిడిలో ఎక్కడ వైరస్ అంటుకుంటుందో అనే భయమే వారిని బయటకు వెళ్లేలా చేసినట్లు తెలుస్తున్నది.

తగ్గని బీసీసీఐ..

ఢిల్లీలో ప్రస్తుతం లాక్‌డౌన్ ప్రకటించారు. రేపటి నుంచి అక్కడ రెండో విడత మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అరుణ్ జైట్లీ స్టేడియంను పూర్తిగా శానిటైజ్ చేసి బబుల్ సృష్టించారు. ఫ్రాంచైజీలు కూడా ఢిల్లీకి చేరుకున్నాయి. కేసులు నమోదవుతున్నా.. బీసీసీఐ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ జరుగుతుందని స్పష్టం చేసింది. కరోనా భయం ఉన్న క్రికెటర్లు లీగ్‌ను వదిలిపెట్టినా.. ఐపీఎల్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏదేమైనా కీలకమై ఆటగాళ్లు లీగ్‌ను వీడి వెళ్లిపోతుండటం మాత్రం ఐపీఎల్‌కు పెద్ద లోటే అని చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed