పెరుగుతున్న హాట్ స్పాట్‌లు.. నైట్ కర్ఫ్యూకు సీఎం ఆదేశం

by Shamantha N |
పెరుగుతున్న హాట్ స్పాట్‌లు.. నైట్ కర్ఫ్యూకు సీఎం ఆదేశం
X

చండీగఢ్: పంజాబ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం కరోనా వ్యాప్తి నివారణకు కొన్ని ఆంక్షలు ప్రకటించారు. ఇండోర్‌లలో 100 మందికి మించి ఒక చోట సమావేశమవ్వొద్దని, బహిరంగంగా 200 మందికి మించవద్దని తెలిపారు. వచ్చే నెల 1 నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలని చెప్పారు. రాష్ట్రంలోని హాట్‌స్పాట్‌లలో అవసరం మేరకు రాత్రి కర్ఫ్యూ విధించడానికి డిప్యూటీ కమిషనర్‌లకు ఆదేశాలనిచ్చినట్టు వివరించారు. పెళ్లి వేడుకలు, రెస్టారెంట్‌లలో కరోనాను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కరోనా టెస్టుల సంఖ్యను రోజుకూ సుమారు 30వేలకు పెంచుతామని వివరించారు. సినిమా హాళ్ల ఆక్యుపెన్సీపై మార్చి 1 తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం. లూధియానా, ఎస్‌బీఎస్ నగర్, ఎస్ఏఎస్ నగర్, హోషియార్‌పూర్, అమృత్‌సర్, భటిండాలలో కరోనా కేసులు ఏకబిగిన పెరిగాయని రాష్ట్ర ప్రిన్సిపల్ (ఆరోగ్య)సెక్రెటరీ తెలిపారు.

టీకా వేసుకోకుంటే వారికి క్వారంటైన్ సెలవులుండవ్

హెల్త్‌కేర్ వర్కర్లు అందరు టీకా వేసుకోవాలని పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ సూచించారు. వారికి మళ్లీ మళ్లీ అవకాశమిచ్చినప్పటికీ వేసుకోకుంటే తర్వాతి దశల్లో సదరు హెల్త్‌కేర్ వర్కర్‌కు కరోనా పాజిటివ్ అని తేలితే సొంత డబ్బులతో వైద్యం చేయించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు, వారికి క్వారంటైన్‌ సెలవులూ ఉండవని వివరించారు.

మధ్యప్రదేశ్ బాలాఘాట్‌లో నైట్ కర్ఫ్యూ

కేసులు పెరుగుతున్న మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన బాలాఘాట్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటానికి అనుమతిలేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్ పేర్కొంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యవసర సేవలకు మినహా ప్రజలు, వాహనాలకు పర్మిషన్ లేదని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed