- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇదీ.. కరోనా పేషెంట్ ఆవేదన
‘15 రోజుల క్రితం కరోనా టెస్టులు చేశారు. పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉండమన్నారు. ప్రతి రోజూ వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మొదటి వారం రోజులు రెండు రోజులకోసారి వచ్చి టెస్టులు చేశారు. ఇప్పుడైతే ఇటువైపు ఎవరూ రావడం లేదు.. మేం ఫోన్ చేసినా నో రెస్పాన్స్.. అనారోగ్య లక్షణాలు ఉన్నాయంటే ఏం పర్వాలేదు. సాధారణ మెడిసిన్ వాడాలని సూచిస్తున్నారు.
– ఇదీ.. హయత్ నగర్లో హోం ఐసొలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్ ఆవేదన
‘‘రెండు రోజులుగా తీవ్ర జ్వరం, శ్వాస ఇబ్బందులు వస్తున్నాయని మెడికల్ సిబ్బందికి కాల్ చేశా.. 108కి ఫోన్ చేసి వెళ్లాలని చెబుతున్నారు.. అంబులెన్స్ రాకుంటే సొంతంగా వెహికిల్ మాట్లాడుకోమంటున్నారు..’’ – ఇదీ సెంట్రల్ జోన్‌లోని ఓ వ్యక్తి (55) ఆవేదనతో చెబుతున్న మాటలివి
హోం ఐసొలేషన్‌పై సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గ్రేటర్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు పాజిటివ్ పేషెంట్లను హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అయితే వారికి నిత్యం అందుబాటులో ఉంటూ చికిత్స అందించాల్సిన జీహెచ్ఎంసీ ప్రత్యేక టీమ్‌లు చేతులెత్తేశాయి. రోజూ ఇంటికొచ్చి పరీక్షలూ నిర్వహించడం లేదు. కనీసం ఫోన్‌లో కూడా వారికి ట్రీట్‌మెంట్ అందడం లేదు. రోగం నయం కావడం దేవుడెరుగు.. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని కరోనా పేషెంట్లు వాపోతున్నారు. సిబ్బందికీ వైరస్ సోకుతుండడంతో ఇండ్లకు వెళ్లేందుకు జంకుతున్నారు. కరోనా ప్రారంభంలో జీహెచ్ఎంసీ తీసుకున్న శ్రద్ధ ఇప్పుడు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిశ, న్యూస్‌బ్యూరో: జీహెచ్ఎంసీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులను హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అయితే వారికి అందాల్సిన సేవల్లో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎంతమందిని హోం క్వారంటైన్‌లో ఉంచారనే విషయం సాక్షాత్తూ కమిషనర్‌కు కూడా తెలియదంటే అర్థం చేసుకోవచ్చు. హోం క్వారెంటైన్‌లో ఉన్న వ్యక్తుల నుంచి సెకండరీ కాంటాక్ట్‌లను నిరోధించడంతో పాటు వారికి ప్రతి రోజూ వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యం మెరుగుపడుతుందా లేదా చూడటం జీహెచ్ఎంసీ పని. ఇందుకోసం గతంలో ప్రత్యేకంగా వైద్య, పోలీసు, శానిటేషన్ సిబ్బందితో కూడిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. వీరిలో ప్రతి రోజూ ఎవరో ఒకరు కనీసం ఫోన్‌లో వారి ఆరోగ్య పరిస్థితులపై వాకబు చేయాలి. అయితే ప్రస్తుతం ఫోన్ చేసేవారు కూడా కరువయ్యారు. మెడికల్ సిబ్బంది రాకపోయినా గతంలో రెండు రోజులకోసారి స్థానిక ఆశా కార్యకర్తలు మాత్రం వచ్చి చెకప్ చేసేవారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారి నుంచి కొత్త వారికి వ్యాపించకుండా శానిటేషన్ సిబ్బంది చర్యలు తీసుకునేవారు. స్ప్రేయింగ్ చేయడం, పాజిటివ్ వ్యక్తుల నుంచి వచ్చే మెడికల్ వేస్ట్‌ను జాగ్రతగా తరలించేవారు. జీహెచ్ఎంసీలో ఇపుడు ఈ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయినట్టు కనిపిస్తోంది. బాధితులు లేదా వారి కుటుంబాలు నేరుగా జీహెచ్ఎంసీ అందజేసిన నెంబర్లకు కాల్ చేసినా పట్టించుకునే వారు కనిపించడం లేదు. అందుబాటులో ఉన్న మెడిసిన్స్ ఉపయోగించాలనో లేదా నేరుగా ఫలానా హాస్పిటల్‌కు వెళ్లాలనో సూచిస్తున్నారు తప్ప జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన సిబ్బంది వచ్చి చికిత్సనందించడం లేదు.
పాజిటివ్ వ్యక్తుల బాధలు వర్ణనాతీతం
గ్రేటర్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో చేరిపోయింది. రాష్ట్రంలో నమోదయిన కేసుల్లో 80 శాతం వరకూ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే ప్రైవేటు వాహనాల డ్రైవర్లు జంకుతున్నారు. ఒక వేళ ఒప్పుకున్నా రూ.వేలల్లో ఛార్జీలు వసూలు చేస్తూ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాజిటివ్ వ్యక్తులు మానసికంగా మరింత కృంగిపోతున్నారు. అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని చెబుతున్నా వాటిని కేవలం ఎమర్జెన్సీ కోసమే వినియోగించాలని ఆదేశాలు ఉన్నాయని, సాధారణ ట్రీట్‌మెంట్ కోసం చేసే కాల్స్‌కు ఆ సమయంలో తోచిన సమాధానం చెప్పి దాటవేస్తున్నట్టు తెలుస్తోంది. అంబులెన్స్‌లు రాకపోవడంతో ప్రైవేటు వెహికిల్స్ తీసుకుని వెళ్లక తప్పడం లేదని బాధితులు చెబుతున్నారు. అసలు బల్దియా ఏర్పాటు చేసిన వైద్యులు ప్రతి రోజూ తమను పరిశీలించి చికిత్స అందిస్తే ఇన్ని కష్టాలు ఉండవనేది వారి వాదన. ప్రజలే ఫోన్లు చేసినా పట్టించుకోకుండా వారి దగ్గరకు కూడా వెళ్లడం లేదు. మరో వైపు హోం క్వారంటైన్‌లో పాజిటివ్ వ్యక్తులకు ప్రత్యేకంగా రూం, టాయిలెట్లు వంటివి కావాల్సి ఉంటుంది. ఉపాధిని వెతుక్కుంటూ వచ్చి గ్రేటర్‌లో అద్దెకు ఉంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. వీరికి ప్రత్యేక వసతులేమో గానీ పాజిటివ్ అనగానే ఇల్లు ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా.. లేక కుటుంబాన్ని కాపాడుకోవాలా అని సతమతమవుతున్నారు. రెగ్యులర్‌గా చికిత్సనందిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని, ఇతర ఇబ్బందులు కూడా తగ్గుతాయని పాజిటివ్ వ్యక్తులు కోరుతున్నారు.
జీహెచ్ఎంసీలోనే అసలు లోపం
జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా కాల్ సెంటర్ ప్రారంభించామని చెబుతున్నా.. అందుతున్న సేవలపై మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రతి రోజూ సగటున రెండొందలకు పైగా వివిధ కాల్స్ వస్తున్నట్టు జీహెచ్ఎంసీ హెల్ప్ సెంటర్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇందులో అంబులెన్స్, ఆహారం కోసం వస్తున్నాయని చెబుతున్నారు. హోం క్వారంటైన్‌లో ఉండే వ్యక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు స్ధానికంగా అందుబాటులో ఉంచామని జీహెచ్ఎంసీ చెబుతోంది. అయితే ఏప్రిల్ నెలలో ఉన్నంత పనివేగం ఇప్పుడు వారిలో లేదని అధికారులే ఒప్పుకుంటున్న మాట. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో వారిలోనూ ఆందోళన కలుగుతోందని జీహెచ్ఎంసీలోని ఓ అధికారి చెబుతున్నారు. పాజిటివ్ వ్యక్తులను నేరుగా కలిసేందుకు సిబ్బంది భయపడుతున్నారని అధికారి స్వయంగా ఒప్పుకుంటున్నారు. అయితే బల్దియాలో ఎవరూ క్వారంటైన్‌లో ఉన్నారనే సమాచారం క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది వద్ద లేదని ఓ డిప్యూటీ కమిషనర్ ద్వారా తెలిసింది. ఎవరికి సేవలు అవసరమో తెలియకుండా వెళ్లమంటే తాము ఏమి చేయాలని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సర్కిళ్లలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్నాయని, ఒకే సర్కిల్లో అంత మందికి సేవలందించేందుకు అవసరమైన వ్యవస్థ అందుబాటులో లేదని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారి ద్వారా తెలుస్తోంది.