- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శుభకార్యాల వాయిదా.. దైన్యంలో బ్రాహ్మణులు
దిశ, తెలంగాణ బ్యూరో : సర్వేజనా సుఖినోభవంతు అంటూ దీవించే పూజారులకు కష్టాలొచ్చాయి. కరోనా వేళ వైదీకులు దీనస్థితిని ఎదుర్కొంటున్నారు. సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో పురోహితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తినడానికి తిండిలేక, చేసేందుకు పనిలేక పూటగడవని పరిస్థితి వైదీకులకు ఏర్పడింది. మూడేం పోయినా కరోనా రక్కసి తిష్ట వేయడంతో శుభకార్యాలు జరుపుకునేవారు లేక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు.
పూజ ఏదైనా సరే చేయాలంటే బ్రాహ్మణుడు కావాల్సిందే. కానీ ఇలాంటి విపత్కర సమయంలో ఎవరికీ కానివారిగా మిగిలిపోయినట్లు వారు వాపోయారు. క్లిష్ట సమయంలో సాయమందించేందుకు ఎవరూ ముందుకురాక ఆవేదనకు గురవుతున్నారు. కుటుంబ పోషణ భారమై అప్పులపాలవుతున్నారు వైదీకులు. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగానూ ఎలాంటి సహాయం అందక దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు.
పనులు లేక పస్తులు
రాష్ట్ర వ్యాప్తంగా పురోహితులు వేల సంఖ్యలోనే ఉన్నారు. పెండ్లిలు, శుభకార్యాలు చేస్తే కానీ డొక్కాడని వైదీకులకు కరోనా విజృంభణతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రోచ్ఛరణ చేస్తే కానీ వారి కడుపు నిండదు. కుటుంబ పోషణ సాగదు. అలాంటిది సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో అంతటా చాలా వరకు శుభకార్యాలు వాయిదాపడ్డాయి. దీంతో ఎంతోమంది పురోహితులు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దె కూడా కట్టలేని దీనస్థితిలో పురోహితులున్నారు.
చల్లగా ఉండాలంటూ దీవించే చేతులే శుభకార్యమేదైనా ఉంటే చెప్పండంటూ వేడుకుంటున్నారు. అంతకముందు కనీసం సమయం కూడా దొరకనంత బిజీగా గడిపిన వారు నేడు రోడ్డువద్ద అడ్డా కూలీల మాదిరిగా పని వెతుక్కునేంత దీనస్థితికి వచ్చారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, తద్దినాలు తప్పా వేరే పని చేయడం తెలియని వారు పనులు లేక పస్తులుంటున్నారు. కొన్ని చోట్ల కార్యక్రమాలు ఉన్నా కరోనా భయంతో వెళ్లాలా వద్దా.. అని దిక్కుతోచని స్థితిలో పురోహితులున్నారు.
కార్యక్రమాలకు వెళ్లాలా? వద్దా?
ఈ ఏడాది ముహుర్తాలు బాగుండటంతో గతేడాది కోల్పోయిన ఆదాయాన్ని సంపాదించుకుంటామని పురోహితులు ఆశపడ్డారు. కానీ సెకండ్ వేవ్ విజృంభణ వారి ఆశలను అడియాశలు చేసింది. పరిమిత సంఖ్యలో శుభకార్యాలు జరుపుకోవచ్చని ప్రభుత్వం అవకాశం ఇచ్చినా రిస్క్ తీసుకోవడం ఎందుకనే భావన చాలామందిలో ఉండటంతో పనులు లేక పురోహితులు ఇబ్బందుల పాలవుతున్నారు.
ఒకవేళ ఏదైనా కార్యక్రమం ఉన్నా ఒకటికి పదిసార్లు వెళ్లాలా? వద్దా? అని ఆలోచనలో వైదీకులు పడ్డారు. ఎక్కడ వెళ్తే ఎవరి నుంచి ఎవరికి వైరస్ సోకుతుందోనని భయాందోళనకు గురై కొందరు వెనుకడుగు వేస్తున్నారు. పనుల్లేక ఇంటి అద్దెలు చెల్లించక సొంత ఊర్లకు పయనమైతే సొంత ఇల్లు ఉన్నవారే హైదరాబాద్ లో ఉన్నారని వారు చెప్పుకొచ్చారు.
శుభకార్యాల వాయిదాతో నష్టం
కొవిడ్ వల్ల శుభకార్యాలు వాయిదా పడటంతో వైదీకులు తీవ్రంగా నష్టపోయారు. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా పెళ్లిళ్ల సీజన్ లోనే కరోనా విజృంభిస్తుండటంతో సీజన్ మొత్తం పెళ్లిళ్లు, శుభకార్యాలకు పూజారులు దూరమై ఆర్థికంగా చితికిపోతున్నారు. కరోనా భయంతో చావు తర్వాత నిర్వహించాల్సిన పిండ ప్రధానాలు, కర్మకాండ వంటి కార్యక్రమాలకు కూడా బ్రేక్ పడింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా కొవిడ్ భయంతో తూతూ మంత్రంగా తంతును పూర్తి చేస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో సంభావన లభించక నష్టపోతున్నారు.
గతంలో ఒక పెండ్లికి మంత్రోచ్ఛరణ చేస్తే రూ.పదివేల నుంచి పదిహేను వేలు లభించేవి. కానీ ప్రస్తుతం అతికొద్ది మంది సమక్షంలో నిర్వహిస్తుండటంతో రూ.ఐదు వేలకు మించి ఇవ్వడంలేదని వారు వాపోతున్నారు. దీంతో ఆదాయం కోల్పోయి కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు పురోహితులు. పోయినేడాది లాక్ డౌన్ సమయంలో.. తమ కష్టాలను చూసి ఇరుగుపొరుగు, తమతో రెగ్యులర్ గా కార్యక్రమాలు చేపట్టేవారు నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకున్నారు. కానీ ఈసారి పట్టించుకునే నాథుడే కరువయ్యారని తమ గోడును వెళ్లబోసుకున్నారు పురోహితులు. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
రోజుకు రూ.200 కూడా రావట్లేదు
లాక్ డౌన్ కంటే ముందు రోజుకు కనీసం రూ.వెయ్యి వరకు సంపాదించే వాళ్లం. లాక్ డౌన్ విధించడంతో పనిలేక అల్లాడుతున్నాం. ఇప్పుడు రోజుకు రూ.రెండు వందలు సంపాదించడం కూడా గగనంగానే మారింది. ముహుర్తాలు ఉన్న కరోనా భయంతో శుభకార్యాలకు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. చావైనా, బతుకైనా కార్యమేదైనా బ్రాహ్మణుడు కావాలి. కానీ బ్రాహ్మణుడికి దిక్కులేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సహాయం చేసేవాళ్లు కూడా కరువయ్యారు. పోయినేడాది లాక్ డౌన్ సమయంలో తమకు తెలిసిన వారు ఆర్థికసాయం, నిత్యావసరాలు ఇచ్చి ఆదుకున్నారు. ఈసారి అదికూడా లేకుండా పోయింది.
– నాగరాజు, పురోహితుడు, చిక్కడపల్లి
పని కోసం అడ్డా వద్ద కూర్చుంటున్నాం..
శుభకార్యాలు లేక పనికోసం అడ్డా వద్ద కూర్చుంటున్నాం. లాక్ డౌన్ సమయంలో శుభకార్యాలు ఎందుకని చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు. అడపాదడపా ఒకటి రెండు దినాల కార్యక్రమాలు దొరికినా రాబడి తక్కువగానే ఉంటోంది. తప్పనిసరి అయిన ప్రజలు కరోనా ఎఫెక్ట్ తో నామ్ కె వాస్తే తూతూ మంత్రంగా తంతు చేయింటుకుంటున్నారు. అందుకు వారు ఇచ్చేది కూడా చాలా తక్కువ. చేసేదేం లేక కుటుంబాన్ని పోషించుకునేందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం నుంచి రూపాయి బిళ్ల కూడా సాయం అందలేదు. సర్కార్ కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వడంలేదు.
– సత్యనారాయణ శాస్త్రి, పురోహితుడు