కరోనా: సర్కారు లెక్కల్లో తప్పులు

by Anukaran |
కరోనా: సర్కారు లెక్కల్లో తప్పులు
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ కరోనా లెక్కల్లో మొదటి నుంచీ గందరగోళమే. జిల్లా వైద్యాధికారులు వెల్లడించే వివరాలకూ, రాష్ట్ర బులెటిన్‌ లెక్కలకూ పొంతనే ఉండదు. జిల్లాల గణాంకాలు ఇందులో చేరవు. నిజానికి బయటకు వెల్లడవుతున్న కేసులు మూడో వంతు మాత్రమే అనే అనుమానాలూ ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులెన్నో ఎవ్వరికీ తెలియదు. ఎప్పటికీ గోప్యమే. ‘కరోనా కేసుల్ని, చావుల్ని దాస్తే దాగుతాయా’ అంటూ మంత్రులు, అధికారులు వ్యాఖ్యానిస్తారు. ఏ మండలంలో ఎన్ని టెస్టులు జరిగాయో, ఎన్ని పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయో జిల్లా వైద్యాధికారి విడుదల చేసే బులెటిన్‌లో ప్రత్యక్షమవుతాయి. రాష్ట్ర బులెటిన్‌లో కనిపించవు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే వాస్తవాలను దాచిపెడుతోందనే విమర్శలు ఇప్పుడు కొత్తవేమీ కాదు. గతంలోనూ వచ్చాయి. హైకోర్టు కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది. ముప్పేట విమర్శలు, ఆరోపణలు రావడంతో జిల్లాస్థాయి బులెటిన్లను అధికారికంగా విడుదల చేయవద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అవి జిల్లా వైద్యాధికారి సంతకం లేకుండా మీడియాకు చిక్కుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలోని వాస్తవిక వివరాలను పరిశీలిస్తే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్న ర్యాపిడ్ టెస్టులుగానీ, నమోదవుతున్న కేసులుగానీ రాష్ట్ర బులెటిన్‌లలో ఉంటున్నాయా అనే సందేహం కలుగుతోంది.

చేరని ప్రైవేటు లెక్కలు

ప్రైవేటు ఆసుపత్రులు చేస్తున్న ర్యాపిడ్ టెస్టుల వివరాలు ప్రభుత్వ లెక్కల్లోకి ఎక్కడం లేదు. ల్యాబ్‌లు, కార్పొరేట్ ఆసుపత్రులు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ర్యాపిడ్ టెస్టులు కూడా చేస్తున్నాయి. అవి మార్కెట్ నుంచి కిట్లు కొనుక్కుంటాయి కాబట్టి ఎన్ని కొన్నారు, ఎన్ని టెస్టులు చేశారనేది ప్రభుత్వ గణాంకాలకు రావడం లేదు. ఇప్పటికీ ప్రైవేటు రంగంలో జరుగుతున్న పరీక్షల సంఖ్యగానీ, కేసుల సంఖ్యగానీ పూర్తిస్థాయిలో ప్రభుత్వం దగ్గరకు చేరడం లేదు. ఆస్పత్రులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని మంత్రి, డైరెక్టర్ పలు సందర్భాల్లో మీడియాకు చెప్పారు. తప్పనిసరిగా డ్యాష్‌బోర్డులో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. సహజీవనం తప్పదంటూ ముఖ్యమంత్రి, వైద్యారోగ్య మంత్రి, ఉన్నతాధికారులే చెబుతుండడంతో ప్రైవేటు పరీక్షల గురించి, కేసుల గురించి పెద్దగా పట్టించుకోవడంలేదు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించే ప్రక్రియ ఆగిపోయింది. ట్రేసింగ్, ట్రాకింగ్ పకడ్బందీగా అమలు కావడంలేదు.

ఇదీ అసలు సంగతిల

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెల 21వ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి 22 తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగిన కరోనా టెస్టులు, కేసులను పరిశీలిస్తే లెక్కల్లో ఎంత తేడా ఉందో స్పష్టమ వుతుంది. 24 గంటల వ్యవధిలో 90 కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్‌లో 19, తిమ్మాజీపేటలో 12, తెలకపల్లిలో 8, పెంట్లవెల్లిలో 8, వెల్దండలో 7, లింగాలలో 7, కల్వకుర్తిలో 6, తాడూ రులో 6, కొల్లాపూర్‌లో 5, బల్మూరులో 4, బిజినేపల్లిలో 3, అచ్చంపేటలో 3, ఆమ్రాబాద్‌లో 1, ఊరుగొండలో 1 చొప్పున కేసులు వచ్చాయి. రాష్ట్ర బులెటిన్‌లో మాత్రం 29 కేసులనే రాశారు. 61 పాజిటివ్ కేసులను రాష్ట్ర ప్రజారోగ్య శాఖ దాచి పెట్టిందన్నమాట. నల్లగొండ జిల్లాలో ఆగస్టు 22న 140, సూర్యాపేటలో 139, యాదాద్రిలో 97 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇవి జిల్లా వైద్యాధికారి సంతకం లేకుండా వెల్లడించిన వివరాలు.

రాష్ట్ర బులెటిన్‌లో మాత్రం నల్లగొండలో 137, సూర్యాపేటలో 110, యాదాద్రిలో 28 అని పేర్కొన్నారు. మూడు జిల్లాల్లో కలిపి 367 కేసు లు నమోదైతే, రాష్ట్ర బులెటిన్‌లో చెప్పింది మాత్రం 275. ప్రభుత్వం 92 కేసుల్ని దాచిపెట్టింది. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ నమోదయ్యే కేసుల వాస్తవిక లెక్కలతో పోల్చుకుంటే బులెటిన్‌ లో ప్రత్యక్షమవుతోంది సగం కంటే తక్కువే. కరోనా మృతుల విషయంలోనూ ఇది తేటతెల్లమైంది. మంత్రిని, అధికారులను మీడియా ప్రతినిధులు అడిగితే రకరకాల సాకులు చెబుతున్నారు.

టెస్టులు ఎక్కడ చేయించుకుంటే వివరాలు కూడా అక్కడే నమోదవుతాయంటారు. ఏ జిల్లాల్లో ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి, అందులో ఆర్‌టీ-పీసీఆర్ పద్ధతిలో జరిగేవి ఎన్ని, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులెన్ని, ట్రూనాట్ టెస్టులెన్ని, సీబీనాట్ టెస్టులెన్ని, ప్రభుత్వ ల్యాబ్‌లు, ఆసుపత్రుల్లో జరుగుతున్నవెన్ని, ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రుల్లో జరుగుతున్నవెన్ని, ఈ వివరాలేవీ బులెటిన్‌లో ఉండవు. ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని యాక్టివ్‌లో ఉన్నాయి తదితర వివరాలేవీ రాష్ట్ర బులెటిన్‌లలో కనిపించవు. హైకోర్టు చెప్పినా, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరె క్టర్ దాన్ని అమలు చేయడం లేదు.

వాస్తవాలను దాస్తున్నారు: తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే కేసులను తగ్గించి చూపిస్తోంది. ఈ నెల 22న అన్ని జిల్లాల నుంచి అధికారిక లెక్కలను తెప్పించాం. మొత్తం 4,325 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర బులెటిన్ లో మాత్రం 2,474 మాత్రమే నమోదయ్యాయి. కేసుల సంఖ్యను తక్కువగా చూపించినంత మాత్రాన కరోనా తగ్గినట్లు కాదు. ఇది ప్రజలను మోసం చేయడమే. వాస్తవిక లెక్కలను నిజాయితీ గా ప్రకటించాలి. హైకోర్టు, కేంద్ర వైద్యారోగ్యశాఖ చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఒత్తిడితో టెస్టుల సంఖ్యను పెంచినా, పాజిటివ్‌లను దాచిపెడుతోంది. వాస్తవాలను ప్రజలకు చెప్పినప్పుడే జాగ్రత్త పడతారు. గొప్పలకు పోయి తప్పుడు గణాంకాలు చెప్తే ప్రజలు కరోనా బారిన పడతారు. ఇప్పటికైనా వాస్తవ లెక్కలను చెప్పాలి.

సీపీఎం ఈ నెల 22న సేకరించిన లెక్కలు

జిల్లా వాస్తవం బులెటిన్
ఆదిలాబాద్ 51 15
కొత్తగూడెం 123 44
జగిత్యాల 252 91
గద్వాల 169 59
ఖమ్మం 385 125
మహబూబ్‌నగర్ 126 49
మంచిర్యాల 149 53
ములుగు 46 15
నాగర్‌కర్నూలు 128 52
నల్లగొండ 162 122
నిర్మల్ 44 19
నిజామాబాద్ 286 153
సిరిసిల్ల 94 52
సిద్దిపేట 283 92
సూర్యాపేట 139 63
వనపర్తి 83 37
వరంగల్ రూరల్ 72 22

Advertisement

Next Story

Most Viewed