చెరువులో వాకింగ్ ట్రాక్.. ఆశ్చర్యపోతున్న జనం

by Sridhar Babu |   ( Updated:2021-11-01 01:29:32.0  )
Cheruvu1
X

దిశ, ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీ పరిధిలోని చిన్న చెరువులో ప్రభుత్వం నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ ప్రోత్సహిస్తూ నిధులు మంజూరు చేయడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇబ్రహీంపట్నం చెరువు శిఖం భూమిలో ఇప్పటికే అనేక అక్రమ ఇళ్ల నిర్మాణాలు, కట్టడాలు జరిగాయి. చెరువు శిఖం భూమి ఇంతకుముందే చాలా వరకు అక్రమార్కుల వల్ల కబ్జాకు గురైంది. అయినా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోలేదు. మిగిలిన చెరువు భూభాగం నీటితో నిండి ఉండేది. ఇప్పుడు ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో చెరువు పూర్తిగా మాయం అవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నీటిని పంట పొలాలకు విడుదల చేసే రెండు తూములు, ట్రాక్ వల్ల శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉంది. పూర్తిగా నాసిరకంగా.. నాణ్యత లేకుండా ఉందని, పెద్ద ఎత్తున ప్రజాధనం వృథా అవుతుందని, అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అంటున్నారు.

వర్షాకాలంలో కాల్వలు, వాగుల ద్వారా వచ్చే నీటితో చెరువులో నీటిమట్టం ఏ మాత్రం పెరిగినా వాకింగ్ ట్రాక్ నీట మునగనున్నది. ఈ నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మున్సిపల్ శాఖ అధికారులకు లేఖ రాశారని, అయినా ఎటువంటి స్పందన లేదని తెలిపారు. ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణం నిలుపుదల చేసి, మున్సిపల్ పరిధిలో మరేదైనా అనువైన ప్రదేశంలో నిర్మిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటదని స్థానికులు చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా చెరువులో నీరు ఉండడంతో మత్స్యకారులు చేపల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం పంపిణీ చేసిన చేపపిల్లలను చెరువులో వదిలారు. చెరువును మట్టితో నింపి ట్రాక్ నిర్మాణం చేపట్టడం వల్ల చెరువు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని, తమ జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుందని మత్స్య కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

ఈ అంశంపై నీటిపారుదల శాఖ డీఈ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నచెరువు శిఖం భూమిలో వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ నుండి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, గతంలో కూడా పట్టణ ప్రగతి పేరుతో పాత ఇళ్లను కూలగొట్టి ఆ మట్టిని చెరువులో నింపడాన్ని కూడా అడ్డుకున్నామని ఆయన తెలిపారు.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఏఈ మల్లికార్జున్ మాట్లాడుతూ ‘మేము మా కౌన్సిల్ లో ఈ వాకింగ్ ట్రాక్ కోసం ఎటువంటి సమావేశం నిర్వహించలేదు. ఇది పూర్తిగా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీస్ నుంచి నిధుల ప్రొసిడింగ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ తీర్మానం చేయవలసిన అవసరం లేదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని తెలుస్తుంది.

Advertisement

Next Story