కథనాల పై కార్చిచ్చు అంటుకుందా?

by Shamantha N |
కథనాల పై కార్చిచ్చు అంటుకుందా?
X

న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో మొన్న వాల్‌స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్‌జే) కథనం దుమారం రేపగా, నేడు టైమ్స్ మ్యాగజిన్ స్టోరీ మరో చర్చను ముందుకుతెచ్చింది. విద్వేష ప్రసంగాలు, హింసను ప్రేరేపించే పోస్టులను తొలగించే నిబంధనలను వ్యాపార లబ్ది కోసం బీజేపీ అనుబంధ సంస్థలకు వర్తింపజేయట్లేదని ఫేస్‌బుక్ వ్యాఖ్యలను డబ్ల్యూఎస్‌జే ప్రచురించిన సంగతి తెలిసిందే.

ఆ రిపోర్టును కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. తాజాగా, టైమ్స్ మ్యాగజిన్ కథనాన్ని ట్వీట్ చేశారు. భారత్‌లో వాట్సాప్‌ ద్వారా విద్వేషం పరిఢవిల్లుతోందని, గోహత్య, మూకదాడులు, అల్లర్లలో కీలకపాత్ర పోషిస్తోందని టైమ్స్ రిపోర్ట్ చేసింది. వాట్సాప్, దీని యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌లోనూ అభ్యంతరకర కంటెంట్ ప్రచారమవుతూ ఉన్నదని ఆరోపించింది.

మైనార్టీలపై దాడుల్లో ఫేస్‌బుక్, వాట్సాప్‌ పాత్రపైనా ఆరోపణలున్నాయని పేర్కొంది. ఢిల్లీ అల్లర్లకు ముందు పోలీసులకు అల్టిమేటం జారీ చేసిన బీజేపీ కపిల్ మిశ్రా విద్వేషపూరిత ప్రసంగాన్ని ఈ కథనం పేర్కొంది. తర్వాత ఈ వీడియోను ఎఫ్‌బీ తొలగించినప్పటికీ సెకండ్ వర్షన్ మాత్రం సుమారు ఆరు నెలలవరకు అలాగే కొనసాగిందని వివరించింది.

క్విడ్ ప్రో కో!

ఫేస్‌బుక్ త్వరలో వాట్సాప్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఆపరేషన్స్ భారత్‌లో మొదలు పెట్టాలనుకుంటోందని, ఇందుకు భారత సర్కారుకు సానుకూలంగా ఉండటం అవసరమని టైమ్స్ పేర్కొంది. డిజిటల్ పేమెంట్ ఆపరేషన్స్‌కు భారత సర్కారు అనుమతి తప్పనిసరి అని, అందుకే వాట్సాప్‌పై బీజేపీకి ఎలాంటి ఆటంకాలు లేవని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. బీజేపీ, ఫేస్‌బుక్‌లు క్విడ్ ప్రో కో సంబంధాన్ని నెరపుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది.

పక్షంలో రెండో లేఖ

విద్వేషపూరిత పోస్టులపై చర్యలను బీజేపీ అనుబంధ సంస్థలకు ఫేస్‌బుక్ వర్తింపజేయడం లేదని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని పేర్కొంటూ కాంగ్రెస్ ఇటీవలే ఎఫ్‌బీ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా, టైమ్స్ మ్యాగజిన్ కథనాన్ని పేర్కొంటూ పక్షం రోజుల వ్యవధిలోనే మరో లేఖ రాసింది. తాము గతంలో లేవనెత్తిన ఆరోపణలపై తీసుకున్న చర్యలను వివరించాల్సిందిగా తాజా లేఖలో పేర్కొంది.

బీజేపీతో క్విడ్ ప్రో కో సంబంధంపై కథనాలు రావడంతో మరో లేఖ రాయకతప్పడం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇండియాలో వాట్సాప్ ఆపరేషన్స్‌ను నియంత్రణ తీసుకుని డిజిటల్ పేమెంట్స్ లైసెన్స్‌ మంజూరు చేయడానికి ఒప్పందం జరిగి ఉన్నట్టు తెలుస్తున్నదని ఆరోపించారు. ఒక ప్రైవేటు సంస్థ లాభాల కోసం దేశంలో అల్లర్ల సృష్టిని సహించబోమని, దీని నివారణకు లెజిస్లేటివ్, జ్యుడిషియల్ చర్యలకు యోచిస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story