అసెంబ్లీకి టీషర్ట్ వేసుకొచ్చిన ఎమ్మెల్యే.. గెటౌట్ అన్న స్పీకర్

by Anukaran |   ( Updated:2021-03-16 00:53:20.0  )
Gujarat Congress MLA Vimal Chudasama
X

దిశ, వెబ్‌డెస్క్: బాధ్యత గల పదవిలో ఉండి శాసనసభ సమావేశాలకు టీషర్ట్ వేసుకుని వచ్చినందుకు గాను ఓ ఎమ్మెల్యే బహిష్కరణకు గురయ్యాడు. గుజరాత్‌లో జరిగిన ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చుడసమ.. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు టీషర్ట్ వేసుకుని వచ్చారు. వారం రోజుల క్రితం ఇలాగే వచ్చిన ఆయనను అసెంబ్లీ స్పీకర్ త్రివేది మందలించారు.

శాసనసభాపతి మందలించినా విమల్ మాత్రం ఆయన మాటలను ఖాతరు చేయలేదు. సోమవారం కూడా ఆయన టీషర్ట్ వేసుకునే అసెంబ్లీలోకి వచ్చారు. ఇది చూసిన స్పీకర్.. సభలోకి వచ్చే ఎమ్మెల్యేలు షర్ట్ గానీ కుర్తా గానీ వేసుకుని రావాలని సభా మర్యాదలు పాటించాలని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సదరు ఎమ్మెల్యే స్పందిస్తూ… అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన క్యాంపెయినింగ్‌లో తాను టీషర్ట్ వేసుకుని తిరిగానని, తనను ప్రజలు ఆమోదించారని అన్నారు. ‘నేను టీ షర్ట్ వేసుకునే ఎన్నికల ప్రచారం చేశా. గెలిచాను. ప్రజలు నన్ను ఆమోదించారు. కానీ మీరు (స్పీకర్) నా ఓటర్లను అగౌరవపరుస్తున్నారు’ అని అన్నారు. దీనికి స్పీకర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఎలా ఓట్లు అడిగారో నాకు తెలియదు. మీరు స్పీకర్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు. ఎమ్మెల్యే అయినంత మాత్రానా శాసనసభకు మీ ఇష్టమొచ్చినట్టు వస్తానంటే కుదరదు. ఇదేం ఆటస్థలం కాదు. ఇక్కడ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిని పాటించాలి’ అంటూ ఫైర్ అయ్యారు.

ఈ వ్యవహారంతో సభలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కలగజేసుకున్నారు. ఆయన స్పందిస్తూ.. ‘మా మంత్రి జయేశ్ రడాడియా కూడా టీషర్ట్ వేసుకున్నాడు. కానీ స్పీకర్ అడిగిన వెంటనే ఆయన దానిని మార్చుకుని షర్ట్ వేసుకున్నాడు. టీషర్ట్ అనేది సభలో అంత హుందాగా ఉండదు. ఆయన (విమల్)కు నచ్చజెప్పండి’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. అయితే ఇదే విషయమై సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు పరేష్ దన్హాని స్పందిస్తూ.. సభకు టీషర్ట్ వేసుకుని రావొద్దని ఎక్కడా రాసిలేదని, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఏదేమైనా సభాపతి ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను విమల్‌ను మూడు రోజుల పాటు సభ అసెంబ్లీ నుంచి తొలగిస్తున్నట్టు త్రివేది ఆదేశించారు. విమల్ వెళ్లకపోవడంతో మార్షల్స్ ఆయనను బయటకు తీసుకెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed