పంట కొనుగోళ్లలో మళ్లీ లొల్లి

by Anukaran |
పంట కొనుగోళ్లలో మళ్లీ లొల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పంటల కొనుగోకు సంబంధించి మళ్లీ సందిగ్ధం నెలకొంది. కొత్త వ్యవసాయ విధానాలతో మార్కెట్లలో సెస్​ ఉండదని, రాష్ట్ర ఖజానా నుంచే మార్కెట్లకు నిధులు ఇస్తామంటూ సీఎం కేసీఆర్​ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొత్తసాగు విధానాలపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో మార్కెట్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. యథాతథంగా పాత విధానాలతోనే కొనసాగుతున్నాయి. వ్యవసాయ మార్కెట్​ చెక్​పోస్టులను కూడా తెరిచారు. ఎప్పటి వరకు కొనసాగుతాయనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు.

సెస్​ వసూలు

ప్రస్తుతం రైతులు మార్కెట్​ యార్డులకే పంటను తీసుకురావాలని మార్కెట్​ పరిధి గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. లైసెన్స్​ లేని వ్యాపారులు కొనుగోలు చేయొద్దని, చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు లేవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్తసాగు విధానాలకు రాష్ట్రం అనుకూలంగా ఉందంటూ సీఎం ​ప్రకటించడం, దానిపై ఎటూ తేలని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో కొన్ని జిల్లాల్లో యార్డులలోకి ఉత్పత్తులు వస్తున్నాయి. వరంగల్​లోని ఏనుమాముల, కేసముద్రం మార్కెట్లలో కొనుగోళ్లు మొదలయ్యాయి. ఖమ్మం, ఇల్లంద మార్కెట్​ల్లో కూడా కొనుగోళ్లు చేస్తున్నారు. వీటి పరిధిలోని చెక్​పోస్టులు కూడా తెరిచారు. అంతేకాకుండా కొనుగోళ్లపై ఒక్క శాతం సెస్​ను వసూలు చేస్తున్నారు.

చెక్​పోస్టులు కూడా

రాష్ట్రంలో మార్కెటింగ్​ శాఖకు దాదాపు 80 శాతం ఆదాయం మార్కెట్​ చెక్​పోస్టుల నుంచే వస్తుంది. రాష్ట్రంలో 184 మార్కెట్లు, 7 ఉప మార్కెట్లు ఉండగా 64 ప్రధాన మార్కెట్​ యార్డుల్లో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన 124 మార్కెట్ల పరిధిలో ఎక్కడ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసినా చెక్​పోస్టుల్లో మాత్రం మార్కెట్​ రుసుము చెల్లించాల్సి ఉంటోంది. ఈ లెక్కన ఈ రెండేండ్ల కాలంలో మొత్తం మార్కెట్​ శాఖకు రూ.346 కోట్లు వసూలైతే ఇందులో రూ.121 కోట్ల పంట ఉత్పత్తులను నుంచి రాగా మిగిలిన రూ.225 కోట్లు చెక్​పోస్టుల నుంచి వచ్చిందే. కొత్త చట్టాలతో ఎక్కడైనా పంటలు అమ్ముకునేందుకు అవకాశం కల్పించగా చెక్​పోస్టులను ఎత్తివేశారు.

ఇదీ పరిస్థితి

వాస్తవంగా రాష్ట్రంలోని మొత్తం మార్కెట్లలో లైసెన్స్​ వ్యాపారులు 6166, రైస్​మిల్లర్లు 2099, 314 జిన్నింగ్​ మిల్లులు, 106 శీతల గిడ్డంగులు, 4163 మంది కమీషన్​ ఏజెంట్లు ఉన్నారు. మార్కెట్లలో 2449 మంది ఉద్యోగులు ఉండగా 1508 మంది పెన్షన్​దారులున్నాయి. వీరికి జీతభత్యాలు, పెన్షన్ల కింద ఏటా రూ.246 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఆదాయం రాకుంటే వీరి జీతాలపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్​ ఈ నెల 24న నిర్వహించన సమీక్షలో యార్డుల్లో సెస్​ వసూలు చేసే అవకాశం లేదని స్పష్టం చేస్తూనే మార్కెట్​ శాఖను ఆదుకుంటామని ప్రకటించారు. ఇదిలా ఉండగా, మార్కెట్లను తెరిచిన అధికారులు సుప్రీం కోర్టు స్టే కారణంగా పాత విధానంలోనే సెస్​ను వసూలు చేస్తున్నారు. మళ్లీ చెక్​పోస్టుల్లో మార్కెట్​ రుసుం వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెస్​ లేదని చెప్పడం, కానీ పాత విధానమే అంటూ మార్కెట్​ వర్గాలు చెప్పుకుంటూ వసూలు చేయడం అంతా గందరగోళంగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి అవసరం ఉంది.

Advertisement

Next Story