- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా పై కన్నేసిన అసెంబ్లీ
దిశ, న్యూస్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అధికారులకు సవాలుగా మారింది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా అనేక పరిమితులతో నిర్వహించాల్సి వస్తోంది. ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీల వయస్సు, అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, వైరస్ సోకితే ఎదురయ్యే ఇబ్బందులు తదితర వివరాలతో హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. సెప్టెంబరు ఏడు నుంచి సమా వేశాలు జరగనున్నందున, నాలుగో తేదీ వరకు వీటిని సేకరించనున్నారు.
వాటికి తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవడం, సభలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం తదితర అంశాల మీద నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు సభ్యుల్లో ఎవరెవరికి కరోనా వచ్చింది? తగ్గిపోయి ఎన్ని రోజులైంది? ఇంకా ఎంత మందికి పాజిటివ్‌గా ఉంది? క్వారంటైన్ గడువు ఎప్పటికి ముగుస్తుంది? వారికి ఉన్న ఇతర అనారోగ్యాలేంటి? ఇలాంటి వివరాలను ఆరా తీస్తున్నారు. శని లేదా ఆదివారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సమావేశాలకు హాజరయ్యేవారిలో ఒక్కరికి వైరస్ వచ్చినా మొత్తం సభ నిర్వహణ ఇబ్బందిలో పడుతుందనే ఉద్దేశంతో, ముందస్తు ఏర్పాట్లు చేయడమే మేలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, స్పీకర్, మండలి ఛైర్మన్, కార్యదర్శి తదితరులు అభిప్రాయ పడుతున్నారు.
అసెంబ్లీ సిబ్బందికి పీపీఈ కిట్లు?
సమావేశాల సందర్భంగా సభ్యులకు, మంత్రులకు, అధికారులకు మధ్య కాగితాల పంపిణీ జరుగుతూ ఉంటుంది. వాటి ద్వారా వైరస్‌కు అవకాశం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ పనులు చేసే సిబ్బందికి పీపీఈ కిట్లను ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సిబ్బంది నివాసం ఉంటున్న ప్రాంతంలో వైరస్ ఎలా ఉంది? లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా ఉండే అవకాశాలు, ఇంటి నుంచి రాకపోకలు, మధ్యలో వైరస్ సోకడంలాంటి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పీపీఈ కిట్లు, గ్లౌజులు లాంటి ఏర్పాట్లు తప్పనిసరి చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అసెంబ్లీ సెక్రటేరియట్ సిబ్బందికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చ జరుగుతోంది. సభ్యులకు మంచినీళ్లు, టీ, కాఫీలు అందించడం, మంత్రుల ఛాంబర్లలో అవలంబించాల్సిన పద్ధతులు, శుభ్రతా చర్యలపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
వీలైనంత తక్కువ మంది, తక్కువ సమయం
చర్చల సందర్భంగా అంశంతో సంబంధం ఉన్న మంత్రి మాత్రమే తగిన వివరణ ఇచ్చి, ఛాంబర్‌లోకి వెళ్లిపోయే విధానాన్ని అనుసరించడంపైనా ఆలోచన చేస్తున్నారు. ప్రశ్నోత్తరాలను, జీరో అవర్‌ను కూడా రద్దు చేసి, ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టడం, సభ్యుల దృష్టికి తీసుకురావాల్సిన అంశాలకు మాత్రమే పరిమితం అయ్యేలా చూడడంపై చర్చ జరుగుతోంది. వీలైనంత తక్కువ స్థాయిలో చర్చలకు అవకాశం కల్పించి, సబ్జెక్టుకు మాత్రమే పరిమితం అయ్యేలా ప్రక్రియను ముగించాలన్న అభిప్రాయం ఉంది. సభకు రాకుండా ఇంట్లోనే ఉండాలని ఎవరైనా కోరుకుంటే మినహాయింపు ఇవ్వడం, వారు సభకు హాజరైనట్లుగానే పరిగణించడం, శాసనసభా నియమాలతో లీగల్ చిక్కులు రాకుండా చూసుకోవడం లాంటి అంశాలన్నీ పరిగణనలో ఉన్నట్లు తెలిసింది.
వైరస్‌కు గురయ్యే అవకాశం ఉందని భావించినవారికి ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. రోజుకు నాలుగు గంటలకు మించకుండా సమావేశాలను నిర్వహించడం, వారం రోజుల లోపే మొత్తం బిజినెస్‌ను పూర్తిచేయడం లాంటి అంశాలు కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. వివిధ పార్టీల నేతల అభిప్రాయాలను తీసుకుని ఖరారు చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి. సభ్యుల మధ్య దూరం పాటించాల్సి ఉన్నందున సీటింగ్‌లో కూడా మార్పులు జరుగుతున్నాయి.
కౌన్సిల్‌లో కొన్ని సవాళ్ళు
శాసనసభలో సోషల్ డిస్టెన్స్ నిబంధనకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ, శాసనమండలిలో మాత్రం సీట్లు ఇరుకుగా ఉండడం, ఒక వరుసకు మరో వరుసకు మధ్య తక్కువ స్థలం ఉండడంతో సీటింగ్ నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. అదనంగా కొత్తగా ఎనిమిది సీట్లను ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సభ్యుల సంఖ్య తక్కువే అయినప్పటికీ వివిధ అంశాలకు సంబంధించి ఆయా శాఖల మంత్రులు వచ్చిపోవడం, ఆయా శాఖల కార్యదర్శులు కూడా రావాల్సి ఉన్నందున సోషల్ డిస్టెన్స్ అమలుపై మల్లగుల్లాలు పడుతున్నారు. కౌన్సిల్‌లోని మీడియా గ్యాలరీలో సీటింగ్ దగ్గర దగ్గరగా ఉన్నందువల్ల కవరేజీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చ జరుగుతోంది.