రిపోర్టు అందింది.. తీర్పే మిగిలింది

by Shamantha N |
రిపోర్టు అందింది.. తీర్పే మిగిలింది
X

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. సీల్డ్ కవర్‌లో ఈ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. పది రోజుల క్రితం (మార్చి 19న) కోర్టుకు ఈ రిపోర్టును అందజేసినట్టు కమిటీ సభ్యుడు, వ్యవసాయరంగ నిపుణుడు అనిల్ ధన్వంత్ తెలిపారు. ఇదే విషయమై ఆయన బుధవారం మాట్లాడుతూ.. తాము సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి రూపొందించిన నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించామని తెలిపారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున అందులో ఏమున్నదనే విషయాన్ని వెల్లడించలేనని అన్నారు.

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గతేడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. 2020 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వీటిని ఆమోదించుకున్న విషయం తెలిసిందే. అయితే రైతులు పోరుబాట పట్టడంతో వాటి అమలును నిలిపివేయాలని ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చట్టాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదికను అందజేయాలని అనిల్ ధన్వత్, అశోక్ గులాటి, ప్రమోద్ జోషిలతో కూడిన కమిటీ (జనవరి 11న)ని నియమించింది. ఈ కమిటీ 18 రాష్ట్రాలలోని సుమారు 85 రైతు సంఘాలతో చర్చించి నివేదికను రూపొందించింది. కాగా.. ఈనెల 5 న కోర్టు వీటిని పరిశీలించనుంది.

Advertisement

Next Story

Most Viewed