- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నలుగురు ఓకే.. మరి ఆ ఇద్దరు ఎవరు..? టీఆర్ఎస్‌లో జోరుగా చర్చ
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నలుగురు అభ్యర్థులు ఖరారు కాగా, మరో ఇద్దరు ఎవరని పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. గడువు దగ్గర పడుతుండటంతో ఆశావాహులు మాత్రం పట్టుసడలకుండా ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గవర్నర్ కోటాలోనే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నారు. ఆ దిశగా పార్టీ అధిష్టానం చర్యలు చేపడుతోంది. ఎమ్మెల్యే కోటాలో మరో ఇద్దరి పేర్లను మాత్రం ఈ నెల 15న కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ 6 స్థానాలకు ఖాళీ అయిన విషయం విధితమే. అయితే ఆ స్థానాల్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పిస్తారేమోనని ఉత్కంఠ నెలకొంది. తాజాగా పదవీకాలం పూర్తయిన వారికి ఎంతమందికి అవకాశం కల్పిస్తారు… కొత్తవారికి ఎంతమందికి అనేది గత 6నెలలుగా పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నెల 16న నామినేషన్లకు తుదిగడువు కావడంతో ఆశావాహులు పోటీపడి మరి అధినేత కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలుస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. అయితే ఇప్పటికే శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు ఖరారైనట్లు సమాచారం. అయితే మరో ఇద్దరు ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఒక్కో జిల్లా నుంచి పదుల సంఖ్యలో ఆశావాహులు ఎమ్మెల్సీ టికెట్లను ఆశిస్తుండటం… రెండు స్థానాలు మాత్రమే ఉండటంతో ఎవరికి ఇస్తారోనని నేతలు మధనపడుతున్నారు.
ఇదిలా ఉంటే గుత్తా సుఖేందర్ రెడ్డికి సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. టీఆర్ఎస్ లో చేరిన ఆయనకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంతో పాటు మండలి చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. గుత్తా సోదరుడు జితేందర్ రెడ్డి మదర్ డెయిరీ చైర్మన్ గా పనిచేయగా ఈ సారి చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. మరోసారి అధినేత ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తారని హామీ ఇవ్వడంతోనే జితేందర్ రెడ్డిని తప్పించినట్లు ప్రచారం జరిగింది. కేసీఆర్ హామీ మేరకు రెండోసారి మండలికి అవకాశం కల్పించినట్లు సమాచారం. మధుసూదనాచారి కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు తెలంగాణ మొదటి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. సామాజిక పరంగా మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరడమే కాకుండా కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్ లో విలీనం అయ్యేందుకు కీలక భూమిక పోషించారు. అప్పుడే లలితకు అధినేత మరోసారి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేయడంతో పాటు కేసీఆర్ కుటుంబానికి విధేయుడు. కేసీఆర్ తోపాటు కేటీఆర్, హరీష్ రావులకు సన్నిహితుడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలీలో తిప్పికొట్టడంలో దిట్ట. దీంతో శ్రీనివాస్ కు ఎమ్మెల్సీకి పేరును ఖరారు చేసినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
మిగిలిన రెండుస్థానాలకు మాత్రం ఈనెల 15న అధినేత పేర్లను ప్రకటించి అదే రోజు నామినేషన్లను వేయించనున్నట్లు సమాచారం. అయితే ఉద్యమ సమయంలో, వివిధ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని పార్టీ అధినేత హామీ ఇవ్వడంతో వారిలో ఎవరికి ఇస్తారనేది చర్చనీయాశంగా మారింది.
మరోసారి గవర్నర్‌కు కౌశిక్ రెడ్డి పేరు ప్రతిపాదన!
ఈ ఏడాది జూలై 21న పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. వేదికపైనే కౌశిక్ రెడ్డికి పెద్దపదవి ఇస్తానని పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. కేవలం పది రోజుల్లో ఆగస్టు 1న నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని ప్రతిపాదిస్తూ కేబినెట్ ఆమోదించింది. గవర్నర్ ఆమోదం కోసం కేబినెట్ సిఫార్సు చేసింది. అయితే మూడు నెలలు గడిచినా గవర్నర్ ఆమోదం తెలుపలేదు. సామాజిక సేవారంగం కింద కౌశిక్ రెడ్డిని ప్రతిపాదించడం, ఆయనపై పలు కేసులు ఉండటంతో పెండింగ్‌లో పెట్టినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే మరోసారి ఈనెల 14న కేబినెట్ సమావేశం నిర్వహించి క్రీడారంగం నుంచి కౌశిక్ రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ కు పంపించనున్నట్లు సమాచారం. అయితే క్రికెట్ ప్లేయర్ కావడంతో ఈసారి గవర్నర్ ఆమోదం తెలుపుతుందని , కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.