కేరళను చూసి నేర్చుకుందాం.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Anukaran |
కేరళను చూసి నేర్చుకుందాం.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామాభివృద్ధిలో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కొనియాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి అనుభవాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని పంపనున్నారు. అక్కడి విధానాల నుంచి నేర్చుకోవడంలో, తెలుసుకోవడంలో అహంభావం కూడదని నొక్కిచెప్పారు. ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలుచేస్తున్న కొన్ని పథకాలను ఇప్పటికే తెలంగాణ ఆదర్శంగా తీసుకున్నదని గుర్తుచేశారు. కేరళ పర్యటనకు వెళ్ళాల్సిన కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల బృందాన్ని ఖరారు చేయాల్సిందిగా ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన రివ్యూ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఒక జిల్లాను దత్తత తీసుకుని ప్రత్యక్షంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సీఎం తెలిపారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంశాలపై ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశానికి అన్ని జిల్లాల నుంచి అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కూడా ఆదర్శనీయంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

మీ వెంట సీఎం వున్నడు

పల్లెల, పట్టణాల అభివృద్ధిలో అధికారులు నిర్భీతిగా వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాలని, ఎవరో వత్తిడి చేస్తున్నరనే మాట వినపడకూడదని సీఎం స్పష్టంచేశారు. “మీ పని మీరు సమర్థవంతంగా చేయండి. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీ వెంట సీఎం వున్నడనే ధైర్యంతో పనిచేయండి“ అని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. గట్టిగా తల్చుకోవాలేగాని అసాధ్యమనేది ఏదీ వుండదన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధిని మించిన మరో పనిలేదని, అవసరమైతే పల్లెల్లో పర్యటనలు చేపట్టాలని, రాత్రిల్లు బస చేసి పొద్దున లేచి జనంలో తిరుగాలని, అప్పుడే క్షేత్రస్థాయి కష్టాలు అర్థమవుతాయని అదనపు కలెక్టర్లు, డీపీవోలకు దిశానిర్దేశం చేశారు.

పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలను కనుగొనగలుగుతారన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడానికి కొత్త వాహనాలను సిద్ధం చేసి ఉంచామని, ప్రతీ నెలా క్రమం తప్పకుండా ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేస్తూ ఉన్నదని, ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేస్తున్నదని, ఏ ప్రభుత్వమైనా ఇంతకన్నా ఎక్కువ ఏం చేయగలుగుతుందని నొక్కిచెప్పారు. “ఆర్ధిక వనరులు ఉన్నాయి. ఉద్యోగ వ్యవస్థ ఉన్నది. ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండగా ఉన్నది. ఇంకేం కావాలి? ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ చర్యలకు గురికావద్దు“ అని స్పష్టం చేశారు.

అధికారుల సమన్వయంతో యజ్ఞంలా సాగాలి

పల్లెలు, పట్టణాలు వంద శాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, పంజాయతీ రాజ్ అదికారులు, మున్సిపల్ అధికారులు సమిష్టి కృషితో, సమన్వయంతో ఒక యజ్ఞంలా అందులో పాలు పంచుకోవాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సీఎంఓ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నది. అధికారులు వారి పనితీరును చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తేలేదని హెచ్చరించారు. అధికారుల పనితీరును బేరీజు వేసి కఠిన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. పర్సనల్ అప్రెయిజల్ రిపోర్టును (పీఏఆర్) తయారు చేయడం ద్వారా కలెక్టర్ల, అదనపు కలెక్టర్ల పనితీరును రికార్డు చేయనున్నట్లు తెలిపారు.

ఎవరైనా అదనపు కలెక్టర్లు, డిపీవోలు వారి పనితీరును మెరుగుపరుచుకోకుండా, తప్పులను సరిదిద్దుకోకుండా, అలసత్వం వహించి, నిర్దేశిత బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తనిఖీల సందర్భంగా తేలితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తక్షణమే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. క్షేత్రస్థాయి తనిఖీలకు ఇంకా పది రోజులు ఉన్నందున ఈలోపే తప్పులుంటే చక్కదిద్దాలని సూచించారు. గ్రామసభలు జరపకపోతే గ్రామ కార్యదర్శులను, సర్పంచ్‌లను సస్పెండ్ చేయాలని, అధికార పార్టీ అయినా అదే ట్రీట్‌మెంట్ ఉంటుందని పేర్కొన్నారు.

సేవ్ ద విలేజ్.. సేవ్ పీపుల్

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు దాటినా పల్లెలు, పట్టణాల్లో ఆశించిన అభివృద్ధి జరగలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా గ్రామీణాభివృద్ధి మొదటినుంచీ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, ఇందుకు అధికార యంత్రాంగం మానసిక ధోరణి కూడా ప్రబల కారణమని సీఎం అభిప్రాయపడ్డారు. పాత పద్దతులను వదిలి, ప్రజా క్షేత్రంలో మమేకమై, గ్రామాభివృద్ధి కోసం యువ కలెక్టర్లు పాటుపడాలని పిలుపునిచ్చారు. మూస ధోరణులను విడనాడి సామర్ధ్యాన్ని పెంచుకొని పట్టుదలతో కృషిచేసి పేరుతెచ్చుకోవాలని కోరారు. ఆదర్శవంతమైన కలెక్టర్లను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని కొద్దిమంది కలెక్టర్ల పేర్లను ఉదహరించారు. గ్రామ సభలు నిర్వహించి, గ్రామ ఆర్ధిక నివేదికల మీద చర్చలు చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డిపీవోలదేనని స్పష్టంచేశారు. గ్రామ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, కరెంటు బిల్లుల చెల్లింపు, ట్రాక్టర్ కిస్తీల చెల్లింపు, గ్రీన్ కవరేజీ కోసం తొలుత నిధులు కేటాయించిన తర్వాతే మిగతా వాటికి చెల్లించాలని స్పష్టంచేశారు.

నిరంతరం డిపీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలతో సమావేశాలు నిర్వహించాలని, అలసత్వం వదిలి నిత్యం గ్రామాభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. ‘సేవ్ ద పీపుల్.. సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్’’ (ప్రజలను, గ్రామాలను కాపాడండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ) అని అదనపు కలెక్టర్లు డీపీవోలకు సీఎం స్పష్టం చేశారు. పనితీరు సరిగా లేనప్పుడు షోకాజ్ నోటీసులు పంపడమే కాదు, తర్వాత వాటి మీద తాత్సారం చేయకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జూన్ 20న సిద్దిపేట, కామారెడ్డి టూర్

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులను తనిఖీ చేయడానికి ఈ నెల 20న సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. మరుసటి రోజు (జూన్ 21) వరంగల్ జిల్లాలో తనిఖీలు చేసి అదే రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. వరంగల్ సెంట్రల్ జైలును కూల్చివేసి ఆ ప్రాంతంలో కట్టనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కూడా సీఎం అదే రోజున శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆస్పత్రిని 24 అంతస్తులతో గ్రీన్ బిల్డింగ్‌గా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్న సీఎం అత్యవసర చికిత్స కోసం వచ్చే పేషెంట్ల అవసరాలకు భవనం మీదనే హెలీపాడ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పట్టణాల్లో మహిళలకు ప్రత్యేక టాయ్‌లెట్లు

పట్టణాల్లో మహిళలకు ఇబ్బంది లేకుండా పబ్లిక్ టాయ్‌లెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ ఎలా ఉందో అధ్యయనం చేయడానికి మూడు, నాలుగు దేశాలకు ఒక అధికారుల బృందాన్ని పంపించాలని మంత్రికి సూచించారు. మిషన్ భగీరథ త్రాగునీరు పట్టణాలకు బల్క్ సప్లై పూర్తి స్థాయిలో అందుతున్నా అంతర్గతంగా పైప్ లైన్ల సమస్య ఉన్నదని, దీన్ని పరిష్కరించాలని ఆదేశించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు విషయంలో అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్, గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్‌ను పరిశీలించాలని స్పష్టం చేశారు.

జిల్లా, మున్సిపల్, మండల స్థాయి ఇంటర్‌డిపార్టుమెంటల్ సమన్వయ సమావేశాలను నిరంతరం నిర్వహించాలని, నాటిన మొక్కల విషయంలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు సర్టిఫై చేయాలన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులకు ఓరియంటేషన్ క్లాసులను రెగ్యులర్‌గా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతీ పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని మంత్రి కేటీఆర్‌ను, అధికారులను ఆదేశించారు.

లే అవుట్ల విషయంలో జాగ్రత్త

పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే లే అవుట్స్ విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కమ్యూనిటీ హాల్, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, వాటర్ ట్యాంకర్ తదితరాలకు కేటాయించిన స్థలాలను యజమానులు అమ్ముకోకుండా చూడాలన్నారు. వాటిని ముందుగానే మున్సిపాలిటీల పేరు మీద రిజిస్టర్ చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టణాలు ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందేలా నిబంధనలకు అనుగుణంగా లే అవుట్లు ఉండాలని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌లో డైనమిక్ అప్‌డేషన్ చేయాలన్నారు. ప్రజా అవసరాల కోసం నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సూచించారు.

సీజనల్ వ్యాధులపై జర భద్రం

జిల్లా, మండల పీహెచ్ స్థాయిల్లో సీజనల్ వ్యాధులను తగ్గించేందుకు శాఖల వారీగా సమన్వయం చాలా అవసరమని స్పష్టం చేసిన సీఎం వ్యాధులు ప్రబలిన తర్వాత మందుల డబ్బాలు చేతుల్లో పట్టుకుని తిరిగి పరేషాన్ కావద్దన్నారు. వాతావరణ పరిస్థితులు మారడానికి ముందే ఏయే వ్యాధులు వ్యాపించే ప్రమాదమున్నదో అంచనా వేయాలన్నారు. నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యం, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ఒక చార్టును రూపొందించుకోవాలన్నారు. వైరల్ సీజనల్ వ్యాధులను ముందస్తుగానే అరికట్టవచ్చన్నారు.

కరోనాకు చికిత్స, నియంత్రణ, వ్యాక్సినేషన్ తదితరాలపై వైద్యాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హై రిస్కు గ్రూపులను గుర్తించి వాక్సినేషన్ అందించడం ద్వారా గణనీయంగా కరోనా వ్యాప్తిని అరికట్టగలిగామని సమావేశంలో అధికారులు వివరించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉండాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed