రెవె‘న్యూ’ మీద త్వరలో కేసీఆర్ సమీక్ష!

by Shyam |
రెవె‘న్యూ’ మీద త్వరలో కేసీఆర్ సమీక్ష!
X

‘‘వీఆర్వోల వ్యవస్థ రద్దు కానుంది. తహసీల్దార్ల అధికారాలకు కోత పడనుంది. ఆర్డీఓలకే మ్యుటేషన్ బాధ్యతలు. కిందిస్థాయి సిబ్బంది అధికారాలను బదలాయిస్తారు. కొత్త రెవెన్యూ చట్టం అమలు కానుంది’’ అంటూ కొద్ది రోజులుగా జోరు ప్రచారం సాగుతున్నది. చట్టం ఎలా ఉంటుందోనని రెవెన్యూ అధికారులు, సిబ్బందిలో కలవరం సైతం మొదలైంది. అయితే, ‘‘ఈ విషయం మీద ఇంతవరకు ప్రభుత్వం మాతో మాట్లాడనే లేదు. మేధావులతో చర్చించనూ లేదు. కొత్త చట్టం ఎట్ల తెస్తరు? అంది అంత ఈజీ కాదు’’ అని అంటున్నరు ఉద్యోగులు, వారి సంఘాల నాయకులు. ఈ అంశం మీద సీఎం కేసీఆర్ త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కొత్త రెవెన్యూ చట్టం ఎలా బాగుంటుందన్న అంశంపై నిపుణుల అభిప్రాయాలను ‘దిశ’ మీ ముందుకు తీసుకొస్తున్నది.

దిశ, న్యూస్ బ్యూరో: పాలనా వ్యవస్థకు రెవెన్యూ శాఖ ఇప్పటి వరకు మూలంగా ఉంటూ వస్తోంది. అలాంటిది మేధావులు, ఉద్యోగవర్గాలతో చర్చించకుండానే కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన చట్టాల రూపకల్పనలో తమ అభిప్రాయాలకు ప్రాధాన్యం లభించకపోతే ప్రయోజనమేమీ ఉండదని ఉద్యోగులు స్పష్టంగానే చెబుతున్నారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టాల రూపొందించాలని రెవెన్యూ అధికారులు, మాజీ అధికారులు కోరుతున్నారు. గ్రామస్థాయిలో పని చేసే వీఆర్వోకు వ్యవసాయ అంశాలను అప్పగిస్తే వచ్చే ఫలితాలు నామమాత్రమేనని అంటున్నారు. భూ పాలనాపరమైన అంశాలను గ్రామస్థాయిలో ఉండే రెవెన్యూ ఉద్యోగికి అప్పగించడమే శ్రేయస్కరమని చెబుతున్నారు. రెవెన్యూ ఇన్​స్పెక్టర్, తహసీల్దార్ స్థాయి వారికి అప్పగిస్తే సత్వర న్యాయానికి బదులు.. సమస్యను జటిలం చేసినట్లవుతుందని పేర్కొంటున్నారు. ఐదారు గ్రామాలకో వీఆర్వో ఉండడంతో పని ఒత్తిడి, అత్యాశతోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే భావన ఉంది. మార్పులో భాగంగా ఇప్పటికే రెవెన్యూ కోర్టులను నిలిపివేయడంతో వేలాది కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

అందుకే అవినీతి మరక

సీఎం కేసీఆర్ అధ్యక్షతన త్వరలోనే కొత్త చట్టం రూపకల్పన, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష కొనసాగుతుందని ప్రచారం జరుగుతోంది. ‘‘రెవెన్యూ శాఖతో ప్రతి మనిషికీ పని ఉంటుంది. ప్రస్తుతం భూముల విలువ పెరిగింది. 50 శాతం మంది ధనికులు భూములపైనే పెట్టుబడులు పెడుతున్నారు. దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. 20 ఏండ్ల క్రితం ఎవరైనా భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఊర్లో పెద్ద మనిషి దగ్గర సెటిల్మెంట్ అయ్యేది. ఇప్పుడేమో ఆ వ్యవస్థ సమూలంగా సమసిపోయింది. రెవెన్యూ శాఖ ప్రజలతో వంద శాతం మమేకమై ఉంటుంది. మిగతా శాఖలేమో కొందరికే పరిమితం. అందుకే రెవెన్యూ శాఖకు అవినీతి మరక పెద్దదిగా కనిపిస్తున్నది’’ అని ఓ డిప్యూటీ కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో లోపాలను గుర్తించకుండా రెవెన్యూ శాఖ మొత్తాన్ని బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గతంలో ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పత్రికలలో వార్త వస్తే మధ్యాహ్నం వరకే దానిపై సమగ్రమైన నివేదికను కలెక్టరు తెప్పించుకునేవారు. సీఎం తప్పకుండా అడుగుతారనే భయం ఉండేది. ఇప్పుడు అలాంటి వాతావరణం లేకుండా పోయింది. అందుకే అవినీతి శాతం పెరిగింది’’ అని ఓ రిటైర్డు జాయింట్ కలెక్టరు కుండబద్ధలు కొట్టారు. ‘‘పిటిషన్లను మానిటరింగ్ చేసే వ్యవస్థ సీఎంఓలోనే లేకుండా పోయింది. ఏటా రూ.50 వేల కోట్లకు పైగానే భూ వివాదాలకు వెచ్చిస్తున్నారు. ఓ సివిల్ కేసు కోర్టులో తేలాలంటే దశాబ్దాలు పడుతోంది. అవినీతిని నిర్మూలించేందుకు కఠినమైన నిబంధనలను స్వాగతిస్తాం. కానీ రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగుల బాధ్యతలను, అధికారాలను కుదించడం మీద పునరాలోచించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

జమాబందీని కప్పేశారు

రాష్ట్రంలో 1950 నుంచి పటిష్టమైన భూ పరిపాలనకు జమాబందీ దోహదపడింది. మ్యుటేషన్, సెటిల్ మెంటు రికార్డు, మొత్తం విస్తీర్ణం, సాగు విస్తీర్ణం, ఏయే పంటలు ఎంత సాగు? ప్రభుత్వ భూముల కబ్జా, లావుణి పట్టాలెంత? లావుణి అమ్మకాలు, నోటి మాట, కాగితాల మీద అమ్మకాలు, ఇలా 39 నమూనాల రూపకల్పన సాగేది. ఎవరైనా చనిపోతే వారసుల పేరిట మ్యుటేషన్ సాగిపోయేది. 1983 వరకు సాగిన జమాబందీని కప్పేశారు. ఆ తర్వాత వీఆర్వో వ్యవస్థ ఏటా చేపట్టాల్సిన భూ రికార్డుల మార్పిడికి నీళ్లొదిలేశారు. దీంతోనే అక్రమాలకు బాటలు పడ్డాయి. రైతులకు, రెవెన్యూ యంత్రాంగానికి మధ్య అగాధం ఏర్పడింది. 1971 పీవీ నర్సింహారావు హయాంలో రూపొందించిన రికార్డ్ ఆఫ్ రెవెన్యూ (ఆర్వోఆర్) చట్టాన్నీ గాలికొదిలేశారు. ఎన్టీఆర్ హయాంలో సవరణలు చేశారు. విలక్షణమైన తెలంగాణ రెవెన్యూ వ్యవస్థను శాస్త్రీయంగా అధ్యయనం చేయకుండానే సవరణలు జరిగాయి. దీంతోనే వైఫల్యాలు ఆరంభమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా లేని టైటిల్ డీడ్ ను అమలు చేశారు. జమాబందీలో నోటి మాటతో సాగే వ్యవస్థలు ఉండే తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం వల్ల కష్టాలు మొదలయ్యాయి. పహణీకి బదులుగా మద్రాసు రెసిడెన్సీలో వాడుకలోని అడంగల్ ను ప్రవేశపెట్టారు. 44 రకాల నిజాం నాటి రికార్డులను గాలికొదిలేశారు. హైదరాబాద్ స్టేట్ లోని బోర్డు ఆఫ్ రెవెన్యూ వ్యవస్థ మాత్రమే ఇక్కడి భూ పరిపాలనకు అనుకూలమన్న వాస్తవాన్ని విస్మరించారు.

వేల సంఖ్యలో వివాదాలు

భూ రికార్డుల ప్రక్షాళనలో ఎన్నో వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వారంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. అది కూడా రెవెన్యూ ఉద్యోగులకు చెడ్డ పేరు తీసుకొచ్చింది. పదో తరగతి పరీక్షలు, జనాభా లెక్కలు, వరదలు, కరువులు ఏర్పడినా, చెరువులు తెగినా, కుంటలు నిండినా వీఆర్వోలే రిపోర్టులు రాయాలి. వీరిని ఆయా బాధ్యతల నుంచి తప్పించి భూ సంబంధ అంశాలకే పరిమితం చేస్తే మెరుగైన పనితీరును చూపిస్తారని ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

గ్రామానికో వీఆర్వో ఉండాలి: తోట మాణిక్యాలరావు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్

ఎన్టీఆర్ రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారు. మళ్లీ ఇంకింత పాడు చేయొద్దు. ఐదారు గ్రామాలకు కాదు, ఊరికో వీఆర్వో ఉండాలి. అదే ఆ ప్రాంతానికి చెందినవారైతే అవినీతికి అంతగా ఆస్కారం ఉండదు. జమబందీ లేనందునే రికార్డులు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో ఆశించడం కూడా పెరిగింది. కుల, ఆదాయ సర్టిఫికేట్లకు సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడం ద్వారా సమస్యలు సమసిపోతాయి.

పర్యవేక్షణ లేకుండా పోయింది: సురేశ్​ పొద్దార్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్

వీఆర్వో పూర్తి చేసిన పహణీల్లో 50% ఆర్ఐ, ఆర్ఐ చేసిన దాంట్లో కనీసం 10% తహసీల్దార్ పరిశీలించాలి. సీసీఎల్ఏ నుంచి కలెక్టర్ కార్యాలయానికి, అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయాలకు, అటు నుంచి తహసీల్దార్ కార్యాలయాలకు ఏటా 3 రోజుల పాటు వచ్చేవారు. అక్కడే ఉండి అన్ని రికార్డులను పరిశీలించేవారు. ఈ వ్యవస్థ 1996-97 వరకు కొనసాగింది. ఇప్పుడా వ్యవస్థ ఎందుకు లేదు? దాని కారణంగానే రికార్డులు అస్తవ్యస్తమయ్యాయి.

అవగాహన కల్పించాలి : బి. నాగేందర్, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్

తెలంగాణ భూ చట్టాలపై ఇప్పటి అధికారులకు అవగాహన కల్పించాలి. గ్రామ స్థాయి రెవెన్యూ కీలకం. 11 రకాల లెక్కలను ఏటా చేయాలి. ఈ బాధ్యతను ఇతర శాఖలకు అప్పగిస్తే మరిన్ని సమస్యలు పుట్టుకొస్తాయి. ప్రస్తుత భూ రికార్డుల ప్రక్షాళనలో అన్నదమ్ముల గొడవను కూడా పార్ట్ బీ లో పేర్కొని పాసు పుస్తకాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. దానికి కూడా కోర్టు కావాలా? జిల్లా, రాష్ట్ర స్థాయిలలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి.

Advertisement

Next Story