ప్రగతిభవన్ ప్రక్షాళన పీఆర్వోతో మొదలు?

by Anukaran |   ( Updated:2023-10-12 07:19:57.0  )
ప్రగతిభవన్ ప్రక్షాళన పీఆర్వోతో మొదలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి పీఆర్వోగా పనిచేస్తున్న గటిక విజయకుమార్ రాజీనామా చేశారు. పీఆర్వోగా మాత్రమేకాక ట్రాన్స్‌కో విభాగంలో జనరల్ మేనేజర్ పదవికి కూడా రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో పీఆర్వోగా పనిచేస్తున్న గటిక విజయకుమార్ హఠాత్తుగా రాజీనామా చేయడం వెనక కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రాజీనామా రూపంలో ఉద్వాసన పలికినట్లు కొద్దిమంది భావిస్తున్నారు. మరికొద్ది మంది మాత్రం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలన్న నిర్ణయమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఇక హోదాను వాడుకుని సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారన్న ఆరోపణ కూడా ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ముఖ్యమంత్రి కుటుంబం నిర్వహిస్తున్న టీ న్యూస్ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడగానే ఆ ఛానల్ యాజమాన్యంతో ఉన్న సంబంధాలతో ముఖ్యమంత్రికి దగ్గరయ్యారు. తొలుత ప్రైవేటు పీఆర్వోగా పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున భద్రత ఉండే తీరులో ఆయన విద్యార్హతలకు అనుగుణంగా ట్రాన్స్‌కో సంస్థలో జనరల్ మేనేజర్ పదవి కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ తయారైంది. కేవలం ఆయన కోసమే ఆ పోస్టు ఏర్పడింది. విద్యుత్ సంస్థలో ఉద్యోగమైనా ఆయన ఎప్పుడూ కనిపించేది ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాల్లోనే. ప్రగతి భవన్ లో జరిగే అన్ని రకాల అధికారిక సమావేశాలు, సమీక్షల్లో విజయకుమార్ పౌర సంబంధాల అధికారిగా కీలక భూమిక పోషిస్తూ ఉంటారు.

విద్యుత్ శాఖలో జనరల్ మేనేజర్ పోస్టుకు సైతం రెండు రోజుల క్రితమే రాజీనామా సమర్పించారని, దాన్ని ఆ సంస్థ ఉన్నతాధికారులు ఆమోదించారని ఆ శాఖ వర్గాల సమాచారం. విజయకుమార్ తనంతట తానుగా పీఆర్వో పోస్టు నుంచి తప్పుకుంటున్నట్లు ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. అయితే విద్యుత్ శాఖ జీఎం పోస్టు రాజీనామా సంగతి మాత్రం అధికారికంగా ఆ శాఖ నుంచి వెలువడాల్సి ఉంది.

రాజకీయాల్లో యాక్టివ్ కావడం కోసమే బాధ్యతల నుంచి తప్పుకున్నారా? లేక ప్రగతి భవన్ లో కీలక మార్పులు జరుగుతాయని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తల్లో భాగంగా విజయకుమార్ నుంచి మొదలైందా అనే చర్చలు జరుగుతున్నాయి. పీఆర్వోగా తన పరిధిని దాటి ఇతర విషయాల్లో వేలు పెడుతున్నారని, కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పజెప్పే విషయంలో విజయకుమార్ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి కారణమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి కార్యాలయం విజయకుమార్ రాజీనామాపై ప్రకటన చేయలేదు.

టీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారని, అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని, అందులో భాగమే ఈ రాజీనామా అని ఆయనకు సన్నిహితంగా ఉంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు చెప్తున్నారు. సీఎంకు అత్యంత దగ్గరగా ఉండే విజయకుమార్ రాజీనామాకు కారణాలపై ఇప్పుడు టీఆర్ఎస్‌లో మాత్రమే కాక అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చలకు త్వరలోనే స్పష్టత రానుంది.

Advertisement

Next Story