- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం కేసీఆర్ పక్కా ప్లాన్.. ఒకే వేదిక మీదకు దళిత ప్రజాప్రతినిధులు
దిశ, తెలంగాణ బ్యూరో : గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని దళిత ప్రజాప్రతినిధులంతా ఒకే వేదికమీద దర్శనమివ్వనున్నారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో ’దళితబంధు’ పథకం లాంఛనంగా ప్రారంభం కానున్నందున టీఆర్ఎస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ‘దళితబంధు’ పథకం రాష్ట్రంలోని మొత్తం పేద దళితులకు సంబంధించింది కావడంతో అన్ని జిల్లాల దళిత ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం విశేషం. సాధారణంగా ఒక పథకం ప్రారంభోత్సవానికి ఆ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే హాజరుకావడం ఆనవాయితీ. కానీ ఈ పథకానికి మాత్రం విస్తృత మైలేజీ రావడం కోసం అన్ని జిల్లాల్లోని దళిత ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన దళిత మండల, జిల్లా పరిషత్ ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక దగ్గరపడుతున్న నేపథ్యంలో అక్కడ ‘దళితబంధు’ లాంఛింగ్‌ను మెగా ఈవెంట్‌గా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. హుజూరాబాద్‌ను ఈ పథకం అమలుకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నది. దళిత ప్రజాప్రతినిధుల సమక్షంలోనే పథకాన్ని ఆవిష్కరించి ప్రభుత్వం దళితుల పక్షమేనని ప్రకటించుకోనున్నది. లాంఛింగ్ కార్యక్రమానికి 18 మంది దళిత ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు దళిత ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయ్యన్న, చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు ఎమ్మెల్సీలు గోరెటి వెంకన్న, ఎంఎస్ ప్రభాకర్, రాజేశ్వర్ రావు హాజరు కానున్నారు.
గతంలో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రైతుబంధు, రైతు బీమాలాంటివన్నీ హుజూరాబాద్ నుంచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ఉనికిలోకి వచ్చాయి. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం హుజూరాబాద్ ఉప ఎన్నికను కూడా దృష్టిలో పెట్టుకుని పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడి నుంచే ప్రారంభించనున్నది. ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని దళితుల ఓట్లను గంపగుత్తగా టీఆర్ఎస్ వైపు ఆకర్షించేందుకు ఇప్పటికే ఒక్కో మండలానికి ఒక్కో దళిత ఎమ్మెల్యేను పార్టీ అధిష్ఠానం ఇన్‌ఛార్జిగా నియమించింది.
పలు జిల్లాల్లోని దళితులను సైతం ఈ కార్యక్రమానికి తరలించడానికి ఎమ్మెల్యేలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారి సొంత నియోజకవర్గాల నుంచి తరలించడానికి వాహనాలను సమకూరుస్తున్నారు. దళిత సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ‘దళితబంధు’ను అధికార పార్టీ నేతలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం ఇలాంటి సంక్షేమం తాత్కాలికం మాత్రమేనని, రాజ్యాధికారం లభించినప్పుడే దళితుల జీవితాలు బాగుపడతాయని వ్యాఖ్యానించారు. పలు దళిత సంఘాల నేతలు కూడా ‘దళితబంధు’ స్కీమ్‌ను కేవలం ఎన్నికల తాయిలంగా వ్యాఖ్యానించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకం గురించి హుజూరాబాద్ వేదికగానే సీఎం ప్రసంగించనున్నారు.