'సీతారామ' పనుల్లో వేగం పెంచండి: కేసీఆర్

by Shyam |
సీతారామ పనుల్లో వేగం పెంచండి: కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా నదిలో నీళ్ళు ఎప్పుడుంటాయో, ఎప్పుడు ఉండవో తెలియని అనిశ్చితి ఉంటుందని, ఈ జలాలు అందని సమయంలో గోదావరి నుంచి నీటిని తెచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పొలాలకు నీరు అందించాలని, అందుకోసం సీతారామ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని సాగునీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రగతి భవన్‌లో గురువారం సమీక్ష నిర్వహించిన కేసీఆర్ కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు నాగార్జునసాగర్ ఆయకట్టును కూడా కలుపుకుని మొత్తం పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని స్పష్టం చేశారు.

ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందని, దుమ్ముగూడెం పాయింట్ దగ్గర గోదావరి నదిలో సంవత్సరం పొడవునా పుష్కలంగా నీటి లభ్యంత ఉంటుందని నొక్కిచెప్పారు. ఇక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి ఇల్లెందు, సత్తుపల్లి ప్రాంతాలకు అందించడంతోపాటు పాలేరు రిజర్వాయర్‌కు కూడా నీటిని తరలించాలని అధికారులకు వివరించారు. సత్తుపల్లి, ఇల్లెందుకు నీరు వెళ్ళడానికి అవసరమైన కాలువల నిర్మాణం, ఇతర పనులపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఇందుకోసం వెంటనే సర్వే పనులను పూర్తిచేసి టెండర్లను పిలవాలని ఆదేశించారు.

మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించాలని, పాలేరు రిజర్వాయర్ వరకు కాలువల నిర్మాణాన్ని రానున్న జూన్ మాసంకల్లా పూర్తిచేయాలని డెడ్‌లైన్ విధించారు. కృష్ణా నదిలో నీరు ఉంటే దాన్ని వాడుకోవచ్చని, అక్కడ లభ్యం కానప్పుడు గోదావరి ద్వారా ఇవ్వవచ్చునని, అంతటి ప్రాధాన్యత ఉన్న సీతారామ ప్రాజెక్టుపై అధికారులు పగడ్బందీ సమన్వయంతో పనిచేసి లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు ఇరిగేషన్ కార్యదర్శి రజత్ కుమార్, ఆ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఇంజనీర్-ఇన్-చీఫ్, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed