భారీ వరదలపై సీఎం జగన్ సమీక్ష..

by srinivas |
భారీ వరదలపై సీఎం జగన్ సమీక్ష..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కొనసాగుతున్న వరదల బీభత్సంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. కృష్ణానదిలోకి భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. కృష్ణా, గుంటూరు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి ముంపు బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉండాలని, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లకు స్పష్టంచేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరద నీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోలపై సీఎంఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నుంచి ప్రజలను ఖాళీ చేయించాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న వరదను అంచనా వేసుకుని ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు గోదావరిలో కూడా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వారికి ఆహారం, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు.

నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు .కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. నాగార్జున సాగర్‌కు 2,90,000 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో అధికారులు 14 గేట్లు ఎత్తి 2,40,000 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్‌కి విడుదల చేశారు. ఆ నీరు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతోంది. శనివారం పులిచింతల ప్రాజెక్ట్‌ని సందర్శించిన కలెక్టర్‌ ఇంతియాజ్.. వరద పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంత తహశీల్దార్లకు పలు సూచనలు ఇచ్చారు. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల, రావిరాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed