‘మహిళల ఆర్థిక సుస్థిరత కోసం పాడిపరిశ్రమ’

by Anukaran |
‘మహిళల ఆర్థిక సుస్థిరత కోసం పాడిపరిశ్రమ’
X

దిశ, ఏపీ బ్యూరో: పాడి పరిశ్రమ ద్వారా మహిళల ఆర్థిక సుస్థిరత సాధన కోసం తగు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్​ వెల్లడించారు. గురువారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆసరా, చేయూత పథకాల అమలుపై సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైఎస్సార్​చేయూత, ఆసరా పథకాల ద్వారా 26 నుంచి మహిళలకు పాడె గేదెలు సరఫరా చేస్తామన్నారు. ఇప్పటిదాకా ఆవులు, గేదెలు తీసుకునేందుకు 4.68 లక్షల మంది లబ్దిదారులు సంసిద్దత వ్యక్తం చేసినట్లు చెప్పారు.

అలాగే, గొర్రెలు, మేకలు తీసుకునేందుకు 2.49 లక్షల మంది సంసిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఒక్కో యూనిట్​రూ.75 వేలతో మొత్తం ఈ ప్రాజెక్టు కింద రూ.5,386 కోట్లు వెచ్చిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 2,11,780 ఆవులు, 2,57,211 గేదెలు, 1,51,671 గొర్రెలు, 97,480 మేకల పంపిణీకి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. తొలి దశ కింద కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని నాలుగు వేల గ్రామాల్లో 26న పాడి పశువుల పంపిణీ చేపడతామన్నారు. లబ్దిదారుల పెట్టుబడికి గిట్టుబాటయ్యే విధంగా పాల నాణ్యత, అధిక ఉత్పత్తిపై అధికారులు దృష్టిసారించాలని సీఎం నిర్దేశించారు. మొదట పాడి పశువులను ఇచ్చేటప్పుడే వాటి ఆరోగ్య పరిస్థితులు, తర్వాత అందించే సేవలపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.

78 వేల దుకాణాల ఏర్పాటు:

చేయూత, ఆసరా పథకాల కింద ఇప్పటి వరకూ అర్బన్, రూరల్‌ ప్రాంతాల్లో కలిపి 78 వేల దుకాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వెల్లడించారు. చేయూత కింద కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది నుంచి కూడా ఆప్షన్లు తీసుకునేట్లు చూడాలని సీఎం సూచించారు. వాళ్లు కూడా సుస్థిర జీవనోపాధి పొందేలా చూడాలని నిర్దేశించారు. సమావేశంలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story