వరద బాధితులకు సీఎం జగన్ హామీ.. 

by srinivas |
jagan
X

దిశ, ఏపీ బ్యూరో: వరదలతో చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పాక్షికంగా అనంతపురం జిల్లా కూడా దెబ్బతింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరదల్లో ప్రాణ నష్టం కూడా భారీగా జరిగింది. 46 మంది మృతి చెందగా..16 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలు ఇప్పటికీ రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం వైఎస్ఆర్ కడప జిల్లాలో వరద బాధిత ప్రాంతాలైన మందపల్లి, రాజంపేట, పులపుత్తూరు పర్యటించారు. నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వరద బాధితులతో మాట్లాడారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పై వరద బాధితులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు కోల్పోయిన వారు జగన్‌కు తెలియజేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారందరినీ సీఎం జగన్ ఊరడించారు. అందరినీ ఆదుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

నేనున్నాను..ధైర్యంగా ఉండండి

వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడారు. నేనున్నాను..ధైర్యంగా ఉండండి అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పొదుపు మహిళల రుణాల పై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. అలాగే వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వరదలతో చాలా నష్టం జరిగిందనే విషయాన్ని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారని సీఎం జగన్‌ కొనియాడారు.

ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టిస్తా

ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన రూ.90 వేల సాయం సరిపోదని ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎంను వరద బాధితులు కోరారు. ఇళ్లు నిర్మించే బాధ్యత నాది. అన్ని విధాలుగా ఆదుకుంటానని జగన్‌ వారికి చెప్పారు. అనంతరం గ్రామంలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. పులత్తూరు, మందపల్లిలో వరద బాధితులతో సీఎం జగన్‌ మాట్లాడారు. ‘ఊహించని వరదతో పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయాయి. రెండు ప్రాజెక్టులకు రీడిజైన్‌ చేసి నిర్మాణం చేపడతాం. పరివాహక గ్రామాలు ఉన్న చోట రక్షణ గోడలు నిర్మిస్తాం. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టిస్తాం. పొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి హెక్టార్‌కు రూ.12 వేలు ఇస్తాం. వరదల్లో వాహనాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపుతాం’’ అని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed