సమస్యలు చెప్పండి.. మీ గొంతుకగా నేను మాట్లాడుతా : భట్టి

by Shyam |   ( Updated:2021-09-30 02:26:17.0  )
All-Party Meeting
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విద్యా, ఉద్యోగ రంగాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గాంధీ భవన్‌లో గురువారం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో పోరాట లక్ష్యాలు నెరవేరలేదన్నారు. సీఎం కేసీఆర్ నియంతలా పాలిస్తూ.. రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేసే హక్కు లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని, రాష్ట్ర ఏర్పడ్డ నాటినుంచి ఇప్పటివరకూ ఒక్క డీఎస్సీ, టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వలేదని విమర్శించారు.

ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించకుండా చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య, నియంత పోకడలపై కలిసి పోరాటం చేయాలనే అఖిలపక్షాలందరం నిర్ణయించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు విద్యార్థి, నిరుద్యోగ సైరన్ పేరిట నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని, అంతా కలిసి రావాలని కోరారు. అంతేగాకుండా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా మీ అంశాలు కూడా మాకు తెలియజేస్తే అసెంబ్లీలో మీ గొంతుకగా వినిపిస్తామని భట్టి అఖిలపక్షాలను కోరారు. ఈ సమావేశంలో సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ నేత ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, తెలంగాణ ఇంటి పార్టీ చీఫ్ చెరుకు సుధాకర్, కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, న్యూ డెమోక్రసీ, టీటీడీపీ, లిబరేషన్ తదితర పార్టీల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed