చైనా.. కరోనాకు కళ్లెం ఎలా వేసింది?

by sudharani |
చైనా.. కరోనాకు కళ్లెం ఎలా వేసింది?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనావైరస్‌పై మూడు నెలలు పోరాడి ఇప్పుడిప్పడే విజయం దరికి చేరుతున్న చైనా అనుభవాలు ఏం చెబుతున్నాయి? వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆ దేశం తీసుకున్న చర్యలేమిటి? మనకెలా ఉపయోగపడతాయో ఓ సారి పరిశీలిద్దాం.

చైనాను ముచ్చెమటలు పెట్టించిన కరోనా ఇప్పుడు యూరప్‌ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. చైనాలో 81వేల మందికి సోకిన ఈ వైరస్‌ వ్యాప్తికి కళ్లెం వేసేందుకు ఆ దేశం కఠిన విధానాలు పాటించింది. వైరస్ వెలుగుచూసిన హుబెయి ప్రావిన్స్‌లోని వుహాన్ నగరంలో కఠిన ఆంక్షలు విధించింది. ఆ ప్రావిన్స్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంతేకాదు, హుబెయి ప్రావిన్స్‌లోనూ ప్రజల మధ్య సామాజిక దూరాన్ని కఠినంగా అమలుచేసింది. ఈ ప్రావిన్స్‌లోని వుహాన్, ఇతర 15 నగరాల మధ్యా రాకపోకలు నిషేధించింది. రోడ్లు బ్లాక్ చేసింది. విమానాలను రద్దు చేసింది. ఆఫీసులు, పరిశ్రమలు, పాఠశాలలకు తాళం వేసింది. వేడుకలు, మీటింగ్‌లను నిషేధించింది. ఆరుకోట్ల జనాభాగల ఈ ప్రావిన్స్‌లో ప్రజలను దాదాపు రెండు నెలలు ఇంటికే పరిమితం చేసింది. చికిత్స, ఆహారం కోసం మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అంతేకాదు, కరోనా వైరస్ సోకినవారి మొబైల్ లొకేషన్ సమాచారం, ఫేస్ ట్రాకింగ్ వివరాలతో ఎక్కడెక్కడ తిరిగారో కనుక్కుని, అక్కడ అనుమానితులను క్వారంటైన్‌లోకి పంపించింది.

ఈ కఠిన ఆంక్షల వల్లే రోజుకు వెయ్యి మందికి సోకిన స్థితి నుంచి పదుల సంఖ్యకు చైనా పరిమితం చేసిందని మిన్నెసొటా వర్సిటీ పరిశోధకులు మైఖేల్ ఓస్టర్‌హామ్ తెలిపారు. తొలినాళ్లలో వైరస్ ఒక వ్యక్తి నుంచి వేగంగా మరో ఇద్దరికి సోకిందని శాస్త్రజ్ఞులు వివరించారు. ఈ ఆంక్షల తర్వాత వ్యాప్తి రేటు ఒకరికి పడిపోయిందని చెప్పారు. అయితే, చైనా రెస్పాన్స్‌లో ఒక లోపం ఏమంటే.. వైరస్ పట్ల తొలుత అప్రమత్తంగా వ్యవహరించలేదు. ఆ నిర్లక్ష్యమే భారీ మూల్యానికి కారణమైంది. విస్తృతంగా పరీక్షలు నిర్వహించకుండా తాత్సారం ప్రదర్శించింది. ఒకవేళ చైనా ఒకవారం ముందు నుంచే ఈ చర్యలు అమలు చేస్తే ఇప్పుడు నమోదైన 81వేల కేసుల్లో 67శాతం కేసులను నివారించగలిగేదని సౌథంప్టాన్ వర్సిటీ పరిశోధకుడు ఆండ్రూ టాటమ్ తెలిపారు. ఒకవేళ మూడు వారాల ముందు నుంచే చర్యలు తీసుకుంటే మొత్తం కేసుల్లో కేవలం ఐదు శాతానికే పరిమితం చేయగలిగేదని అన్నారు.

విస్తృత పరీక్షలు నిర్వహించడం, అనుమానితులను ఐసోలేషన్‌కు తరలించడం ముమ్మరం చేయడం, ప్రజల కదలికలపై ఆంక్షలు విధించి చైనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగింది. ఏ దేశమైనా.. వైరస్‌ను వేగంగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడంపైనే వైరస్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాపకింది నీరులా విస్తరించే కరోనావైరస్‌పై ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించి వ్యాప్తిని అడ్డుకోవాలని సూచిస్తున్నారు.

Tags : coronavirus, china, contained, restriction, hubei

Advertisement

Next Story

Most Viewed