కత్తులు దూస్తున్న చైనా

by  |
కత్తులు దూస్తున్న చైనా
X

న్యూఢిల్లీ: ఇండియా, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుసార్లు మిలిటరీ అధికారుల సమావేశాలు జరిగినా ఈ ఉద్రిక్తతలు సమసిపోవడం లేదు. ఎల్ఏసీని గౌరవించాలని భారత్ చెబుతున్నప్పటికీ గాల్వాన్ లోయ మాదేనన్న వాదనను చైనా మళ్లీ మళ్లీ లేవనెత్తుతున్నది. అదే సమయంలో భారత్‌తో సఖ్యంగా మెలుగుతామని, సరిహద్దులో ఘర్షణాపూరిత వాతవరణాన్ని తొలగించడానికి కలిసి పనిచేస్తామని చెబుతున్నది. జూన్ 6వ తేదీ, 22వ తేదీన జరిగిన మిలిటరీస్థాయి సమావేశాల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని అనుసరిస్తామని, బలగాలను ఉపసంహరించుకుంటామని ఇరుదేశాలూ ప్రకటించాయి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. భారత్, చైనా రెండు దేశాలూ సరిహద్దులో సైనికులను వెనక్కి తీసుకెళ్లడం పక్కనపెట్టి అదనపు బలగాలను చేరవేస్తున్నాయి.

ఒప్పందాలన్నీ బేఖాతరు

భారత్, చైనాల మధ్య ఇప్పటివరకు కుదిరిన ఒప్పందాలన్నింటినీ పొరుగుదేశం పూర్తిగా బేఖాతరు చేస్తున్నదని మనదేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో కొన్నిసార్లు మిలిటరీ బలగాలు కనిపించినా మళ్లీ వెనక్కివెళ్లేవని, కానీ, ఈ ఏడాది ఆ దేశం ద్వైపాక్షిక ఒప్పందాలు సహా అన్నింటినీ బేఖాతరు చేస్తున్నదని తెలిపింది. మే నెల మొదటి నుంచీ చైనా భారీగా సైన్యాన్ని, సైనిక పరికరాలను సరిహద్దుకు తరలించిందని ఆరోపించింది. ముఖ్యంగా ఎల్ఏసీ సరిహద్దులో శాంతి సామరస్యతను కాపాడే ఉద్దేశంతో, మిలిటరీ దళాల వ్యవహారాలను చాలావరకూ తగ్గించుకుంటామని చేసుకున్న 1993 ఒప్పందాన్ని ఉల్లంఘించిందని వివరించింది. ఎల్ఏసీలో యథాతథా స్థితిని మార్చేందుకు భారత్ ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేసింది. గాల్వాన్ ఘర్షణల తర్వాత ఇరువైపులా బలగాలు మోహరిస్తున్నాయని తెలిపింది. చైనా పెద్దఎత్తున మిలటరీని బార్డర్‌కు తరలిస్తున్నదని, ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారుతాయని పేర్కొంది. కాగా, సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు భారత్‌తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉన్నదని ఆ దేశ దౌత్య అధికారులు తెలిపారు. ఇరుదేశాల మధ్యనున్న అనేక ద్వైపాక్షిక ఒప్పందాలకు విరుద్ధంగా భారత్ వ్యవహరించిందని ఆరోపించారు.

బలగాల మోహరింపు

చైనా బలగాలను, సైనిక పరికరాలను పెద్దమొత్తంలో సరిహద్దుకు తరలించినట్టే, భారత్ కూడా సైన్యాన్ని సరిహద్దులకు పంపిస్తున్నది. ఆర్మీతోపాటు ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసులు(ఐటీబీపీ) కూడా సరిహద్దులకు చేరుతున్నారు. మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్, ఐటీబీపీ చీఫ్ ఎస్ఎస్ దేశ్వాల్ లేహ్ పర్యటించిన తర్వాత ఆర్మీకి సహకారంగా ఐటీబీపీని రంగంలోకి దింపాలని నిర్ణయించారు. కాగా, చైనీస్ ట్రూపులు ఫింగర్ 4 వరకూ చేరుకున్నారని, కనీసం 130 వరకు వాహనాలను వెంట తెచ్చుకున్నారని సమాచారం అందింది. పలు చోట్ల చైనా ఆర్మీ కత్తులతో విన్యాసాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాల్వాన్‌లోని పెట్రోల్ పాయింట్ 14 దగ్గర కొత్తగా చైనా నిర్మాణాలు చేపడుతున్నట్టు కొన్ని శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి.

మరో జవాను వీరమరణం

ఈనెల 15న భారత్, చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణలో మరో జవాను వీరమరణం పొందాడు. గాల్వాన్ లోయలో విధి నిర్వహణలో ఉండగా నదిలో పడిపోయిన ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో తీవ్రగాయాల పాలయ్యాడు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్ర మలేగావ్ తాలూకా సాకూరి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ గురువారం అమరుడయ్యారు. గాల్వాన్‌ ఘర్షణలో మృతిచెందిన వారి సంఖ్య 21కి చేరింది.


Next Story

Most Viewed