- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలను స్కూళ్లకు పంపేందుకు వెనకడుగు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, కరోనా వైరస్ తీవ్రత తగ్గడంతో పునర్ప్రారంభమైన పాఠశాలలకు పిల్లలు అంతంత మాత్రంగానే వస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే 9, 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సుమారు పది నెలల తర్వాత తిరిగి తెరుచుకున్న పాఠశాలలకు పిల్లలు ఇంకా భయం భయంగానే బడికి వస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో రోజుకు సగటున సగం మంది కూడా హాజరుకావడం లేదు. పాఠశాలల్లో శానిటైజేషన్ సమస్య ఉండగా.. వివిధ గ్రామాల నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థుల హాజరు శాతం తగ్గుతోంది. అటెండర్లు, సిబ్బంది లేకపోవటంతో ఉపాధ్యాయులే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోంది. ఇక మధ్యాహ్న భోజనానికి చాలా మంది విద్యార్థులు ఇంటికే వెళ్తున్నారు.
తానూరు మండలం ఏల్వి ఉన్నత పాఠశాలలో 9,10వ తరగతుల్లో మొత్తం 82 మంది విద్యార్థులున్నారు. 9వ తరగతిలో 34 మందికి 27 మంది, పదో తరగతిలో 48 మందికి 38 మంది విద్యార్థులను పంపేందుకు మాత్రమే తల్లిదండ్రులు అనుమతి పత్రం ఇచ్చారు. మొత్తం 65 మందిలో 45-50 మంది రెగ్యులర్గా వస్తున్నారు. పాఠశాలల్లో అటెండరు పార్ట్ టైం వర్కర్ కాగా.. ఉదయం వచ్చి తాళం తీసి పాఠశాల గదులు ఊడ్చి, సాయంత్రం తాళం వేసి వెళ్తారు. పారిశుధ్యం, వాటరింగ్ చేసే సిబ్బందిని కరోనా టైంకు ముందే తీసేశారు. దీంతో ఇదే ప్రధాన సమస్యగా ఉంది. దీంతో ఉపాధ్యాయులే అన్ని పనులు చేసుకోవాల్సిన దుస్థితి.
ఇది మచ్చుకు ఉదాహరణ మాత్రమే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 850 ఉన్నత పాఠశాలలుండగా.. ఇందులో 9, 10వ తరగతి చదివే విద్యార్థులు 73,840 మంది ఉన్నారు. 9,10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు ప్రారంభించగా, ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పంపేందుకు నిరాసక్తత వ్యక్తం చేశారు. పాఠశాలలకు పంపేందుకు అనుమతి పత్రం ఇచ్చిన వారి పిల్లలు కూడా కొందరు రావడంలేదు. ఇందులోనూ70 నుంచి 80 శాతం మంది మాత్రమే వస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని మొదటి నుంచీ విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం పెరగడంలేదు. పాఠశాల ప్రారంభానికి ముందే పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించారు. శానిటైజర్లు విద్యాశాఖ ద్వారా సరఫరా చేయగా, గ్రామ పంచాయతీ సిబ్బందితో శానిటైజేషన్ చేయించారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్తోపాటు శానిటైజర్వేస్తున్నారు. బెంచీకి ఒక్క విద్యార్థి చొప్పున తరగతి గదిలో 20 మంది విద్యార్థులు కూర్చునేలా అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పటికీ చాలా చోట్ల హాజరు శాతం పెరగకపోవడానికి అనేక కారణాలున్నాయి. పాఠశాలల్లో శానిటైజేషన్ అసలు సమస్యగా ఉంది. శానిటైజేషన్ కోసం రసాయనాలు ఉన్నా.. చేసేవారు లేరు. అన్ని చోట్ల అటెండర్లు లేకపోగా.. పార్ట్ టైం వర్కర్లు పనిచేస్తున్నారు. వీరు ఉదయం పూట తాళం తీసి.. పాఠశాల గదులు ఊడ్చి వెళ్లిపోతారు. మళ్లీ సాయంత్రం వచ్చి గదులకు తాళం వేసుకుని వెళ్తారు. మరుగుదొడ్లు శుభ్రం చేసే స్కావెంజర్లు, మొక్కలకు నీరు పోసే వాచర్లను కరోనాకు ముందే తొలగించారు. దీంతో వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్యం, శానిటైజేషన్ అసలు సమస్యగా మారింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.40 వరకు తరగతులు నిర్వహిస్తుండగా.. అటెండర్లు లేకపోవడంతో పంతుళ్లే అన్ని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కరోనా తర్వాత అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ప్రయాణ వసతులు లేకపోవడం, ప్రైవేటు ఆటోల చార్జీలు కరోనా తర్వాత పెంచడంతో ఆర్థికంగా భారంగా మారింది. మరోవైపు మధ్యాహ్న భోజనం కూడా చాలా మంది విద్యార్థులు తినకుండా.. ఇండ్లకు వెళ్లి తిని వస్తున్నారు.