అగ్రరాజ్యాన్ని కలవరపెట్టిన చిన్నారి ట్వీట్

by Shyam |
US Strategic Command
X

దిశ, ఫీచర్స్ : ఉగ్రవాదులు, దేశద్రోహులు, భద్రతా దళాలు తమ ఆపరేషన్స్ కోసం సీక్రెట్ కోడ్స్‌ ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. అయితే సెక్యూరిటీ బలగాలు నిత్యం అలర్ట్‌గా ఉంటూ ఉగ్రవాదుల కోడ్స్‌ను డీకోడ్ చేసే పనిలో ఉంటాయి. ఈ మేరకు ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే అలర్ట్ అయిపోతారు. ఈ నేపథ్యంలో యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్ అధికారిక ఖాతాలో పోస్ట్ అయిన ;l;;gmlxzssaw అనే పదం యావత్ అమెరికాను హడలెత్తించింది. పైగా దేశభద్రతకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే సంస్థ కావడంతో ఈ పదం ఏంటని అధికారులు అప్రమత్తమయ్యారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు.. ఖాతా హ్యాక్ అయ్యుండొచ్చునని భయపడగా, ఇంకొంతమంది న్యూక్లియ‌ర్ లాంచ్ కోడ్ కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు? ఇంతకీ ఆ ట్వీట్ ఎవరు చేశారు? అసలు ఏమైంది?

Child tweets

‘యూఎ‌స్ స్ట్రాటజిక్ కమాండ్’ అనే సంస్థ అమెరికా మిలిట‌రీకి సంబంధించిన అణ్వాయుధాలు, మిస్సైల్ డిఫెన్స్‌ల‌ను నిర్వహిస్తుంటుంది. తాజాగా ఈ సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పైన తెలిపిన పదం ట్వీట్ అవడంతో అధికారులతో పాటు ప్రజలందరిలోనూ భయం నెలకొంది. ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయిపోయారు. కానీ చివరకు సోషల్ మీడియా మేనేజర్ కుటుంబానికి చెందిన ఓ చిన్నారి పొరపాటున ఈ ట్వీట్ చేసిందని తెలుసుకుని సదరు సంస్థ ఊపిరిపీల్చుకుంది. ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించడంతో పాటు మళ్లీ అసలు విషయాన్ని ట్వీట్ చేయడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పింది. భద్రతను పర్యవేక్షించే సంస్థ నుంచి ఇలాంటి పొరపాటు ట్వీట్స్ రావడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన నెటిజన్లు.. ‘ఫ్లీటింగ్ మూమెంట్స్.. ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మిలిటరీని ఓ చిన్నారి నియంత్రించింది, ఇది అద్భుతం.. అచ్చం మెన్ ఇన్ బ్లాక్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ లాగా అనిపిస్తోంది. సందేశాన్ని డీకోడ్ చేసిన వారు ఏడాది వరకు ఏజెంట్ కెతో శిక్షణ పొందుతారు’ అంటూ కామెంట్లు చేశారు.

Advertisement

Next Story