మళ్లీ అతన్ని వేలంలో కొంటాం : CSK

by Shyam |
మళ్లీ అతన్ని వేలంలో కొంటాం :  CSK
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2022 రిటెన్షన్స్ నిబంధనల కారణంగా అన్ని పాత ఫ్రాంచైజీలు తమ కీలకమైన ఆటగాళ్లను విడుదల చేయాల్సి వచ్చింది. నలుగురినే అట్టిపెట్టుకోవాలనే నిబంధనతో ఫామ్‌లో ఉన్న క్రికెటర్లను కూడా వదిలేసుకున్నాయి. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌ను రిటైన్ చేసుకున్నది. అదే సమయంలో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేయాల్సి వచ్చింది.

ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఎన్నో సార్లు చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. గత సీజన్‌లో కూడా చక్కగా రాణించాడు. గత నాలుగు సీజన్లలో వరుసగా 380, 303, 633 పరుగులు చేసి చెన్నయ్ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. వాస్తవానికి మొయిన్ అలీ బదులు డుప్లెసిస్‌నే రిటైన్ చేసుకుంటారని అందరూ భావించారు. అయితే సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ మేం ఎంతో మంది కీలకమైన ఆటగాళ్లను వదిలేసుకున్నాము. అందులో డు ప్లెసిస్ ఒకడు. వీలైతే అతడిని మెగా వేలంలో తిరిగి కొనుగోలు చేయాలనుకుంటున్నామని చెప్పాడు. డు ప్లెసిస్ మొదట్లో రూ. 4.75 కోట్ల జీతం తీసుకునే వాడు. అయితే ఆ తర్వాత వేలంతో సీఎస్కే రూ. 1.6 కోట్లకే కొనుగోలు చేసింది. ఈ సారి వేలంలో దాదాపు రూ. 2 కోట్ల వరకు వెచ్చించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story