వీవీప్యాట్‌లు ఎలా మారాయి? సీఈఓ ఆదేశాలు

by Shyam |
వీవీప్యాట్‌లు ఎలా మారాయి? సీఈఓ ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నోట్ల పంపిణీ, ప్రలోభాల నడుమ హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ముగిసినా సరికొత్త వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. పోలింగ్‌లో ఉపయోగించిన ఒక వీవీప్యాట్ మిషన్‌ను ఒక కారులో నుంచి మరో కారులోకి మారుస్తూ ఉండడం వీడియోతో సహా బహిరంగమైంది. దీనిపై బీజేపీ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పందించారు. వీవీప్యాట్ మిషన్ ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నది? ఒక వాహనంలో నుంచి మరో వాహనంలోకి ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆ మిషన్‌ను ఎక్కడ వాడారు? అనుమానాలకు తావిచ్చేలా ఎన్నికల సిబ్బంది ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది? తదితర అన్ని అంశాలపై సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారికి సీఈఓ ఆదేశాలు జారీ చేశారు.

పోలింగ్‌లో ఆ వీవీ ప్యాట్ మిషన్‌ను వాడలేదంటూ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయినా బీజేపీ సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో పూర్తిస్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా సీఈఓ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు నవంబరు 2న జరగనున్న నేపథ్యంలో ఆ లోపే వివరణ తీసుకుంటామని మీడియాకు శశాంక్ గోయల్ వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. కానీ అనుమానాలను నివృత్తి చేయడానికి అవసరమైన నివేదికలను సంబంధిత అధికారుల నుంచి తీసుకుంటామని, వారు ఇచ్చే వివరణకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

హుజూరాబాద్ పోలింగ్‌పై రివ్యూ

హుజూరాబాద్ పోలింగ్ ప్రక్రియపై కరీంనగర్, హన్మకొండ జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈఓ శశాంక్ గోయల్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. పోలింగ్ తీరుపై రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి బూత్‌ల వారీగా వివరాలను సమర్పించారు. కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో నవంబరు 2న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్, ఆర్వో, ఇతర ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఘర్షణలకు, అనుమానాలకు తావు లేకుండా ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై కూడా శశాంక్ గోయల్ సూచనలు చేశారు.

నేడు పార్టీలతో సీఈఓ మీటింగ్

కొత్త ఓటర్ల జాబితా తయారీకి అవసరమైన అభిప్రాయాలను స్వీకరించడానికి, ఎన్నికల సంఘం అభిప్రాయాలను వివరించడానికి అన్ని పార్టీల ప్రతినిధులతో సోమవారం సీఈఓ శశాంక్ గోయల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండినవారందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని, ఇందుకోసం దరఖాస్తు చేసుకోడానికి ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే కాక స్పెషల్ డ్రైవ్ చేపట్టడంపైనా ఈసీ అభిప్రాయాన్ని పార్టీల ప్రతినిధులకు వివరించనున్నారు. ఇప్పుడున్న ఓటర్ల జాబితాకు తగిన సవరణలు చేయడం, జాబితా నుంచి తొలగించడం, కొత్తవారిని చేర్చడం తదితర పలు ప్రక్రియలతో 2022 నూతన ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉన్నదని శశాంక్ గోయల్ మీడియాకు ఆదివారం వివరించారు. పార్టీల ప్రతినిధుల నుంచి వెలువడే అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. కొత్త ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించడం, దానిపైన ఓటర్ల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం, తగిన సవరణలు చేయడం, తుది జాబితాను ప్రచురించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి షెడ్యూలు ఖరారు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story