టెస్టులు మరింత పెరగాలి

by Shyam |
టెస్టులు మరింత పెరగాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: గతంతో పోలిస్తే తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెరిగిందని, యాంటీజెన్ పరీక్షలు కూడా పెరిగాయని కేంద్ర బృందం వ్యాఖ్యానించింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని, పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడం ద్వారా ట్రేసింగ్ సులభమైందని గుర్తుచేసింది. టెస్టుల సంఖ్య పెరిగినాకొద్దీ పాజిటివిటీ రేటు తగ్గుతుందని, వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఇదే కీలకమని వ్యాఖ్యానించింది. నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్‌కుమార్ పాల్ నేతృత్వంలో ఆర్తి ఆహుజా, రవీంద్రన్ తదితరులతో కూడిన కేంద్ర బృందం హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని కరోనా వైరస్ వ్యాప్తిపై అద్యయనం చేసింది. గాంధీ ఆసుపత్రిని సందర్శించడంతో పాటు టెస్టింగ్ కేంద్రాలను కూడా పరిశీలించింది. రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి, అధికారులు, ప్రధాన కార్యదర్శితో ఈ బృందం సమావేశమై ఇకపైన తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది.

అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హోం ఐసోలేషన్ పేషంట్లకు టెలి-మెడిసన్ విధానం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, పర్యవేక్షణ కోసం వినూత్నంగా అమలులోకి తెచ్చిన ‘హితం’ మొబైల్ యాప్‌ మంచి ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ నిర్వహణలో భాగంగా తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఇకముందు చేపట్టాల్సిన చర్యలు చాలా ఉన్నాయన్నారు. జిల్లా స్థాయిలోని ఆసుపత్రుల్లో సైతం కరోనాను ఎదుర్కోడానికి కల్పించిన మౌలిక సదుపాయాలు, సన్నద్ధత రోగులకు అందిస్తున్న చికిత్స గతంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో వైరస్ నివారణకు కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Next Story